చెత్త పన్ను చెల్లించాల్సిందే !

ABN , First Publish Date - 2022-06-28T05:29:20+05:30 IST

నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో 1,65,876 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 99,848 ఇళ్లు మురికివాడల్లోనూ, మరో 57,041 ఇళ్లు మామూలు ప్రాంతా ల్లోనూ, ఇంకో 8,987 అపార్టుమెంట్లుగానూ అధికారులు గుర్తించారు.

చెత్త పన్ను చెల్లించాల్సిందే !
అల్లీపురంలో చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికుడు (ఫైల్‌)

నగరవాసులపై వలంటీర్ల ఒత్తిడి

ఫిబ్రవరి నుంచి వసూళ్లకు డిమాండ్‌ 

రూ. 5.71 కోట్ల లక్ష్యంతో రంగంలోకి.. 

రోజువారీ గార్బేజీ సేకరణ లేకున్నా పన్నులా..?

ససేమిరా అంటున్న ప్రజలు

తలలు పట్టుకుంటున్న అధికారులు


చెత్తపై పన్ను విధించిన నెల్లూరు నగర పాలక సంస్థ  అధికారులు.. దాన్ని కట్టాల్సిందేనని నగర వాసులకు ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు యూజర్‌ చార్జీలు చెల్లించాలంటూ వలంటీర్లు ప్రజలను డిమాండ్‌ చేశారు.  నగరంలో రూ. 5.71 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రజల నుంచి ప్రతికూలత ఎదురవుతున్నది. దీనికితోడు ఇంటింటా రోజువారీ చెత్త సేకరణ జరగపోయినా ఎలా పన్ను వసూళ్లు చేస్తారంటూ ప్రజలు తిరగబడడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


నెల్లూరు(సిటీ), జూన్‌ 27: నెల్లూరు నగరంలోని 54  డివిజన్లలో 1,65,876 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 99,848  ఇళ్లు మురికివాడల్లోనూ, మరో 57,041 ఇళ్లు మామూలు ప్రాంతా ల్లోనూ, ఇంకో 8,987 అపార్టుమెంట్లుగానూ అధికారులు గుర్తించారు.  మురికివాడలకు నెలకు రూ. 30లు, మిగిలిన ప్రాంతాలకు రూ. 90 చొప్పున చెత్తపై పన్ను విధించారు. ఐదువేలకుపైగా  భవనాలను కమర్షియల్‌ కింద గుర్తించిన అధికారులు వాటికి వివిధ కేటగిరీల కింద పన్ను విధించారు. గత ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పన్నుల కింద రూ. 5,71,77,465 లెక్కకట్టారు. ఎన్‌ఎంసీలోని పారిశుధ్య  సిబ్బంది ఇప్పటివరకు రూ. 80,02,480 వసూలు చేశారు. ఈ మొత్తం 1,72,974 డోర్‌ నెంబర్ల (రెసిడెన్షియల్‌, కమర్షియల్‌) నుంచి వసూలు చేశారు.


ప్రజల నుంచి వ్యతిరేకత 

 చెత్తపై పన్ను చెల్లించేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరు. అంతేకాక నగరంలో ఈ భారీ ప్రణాళికను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడంవల్ల ప్రజల నుంచి ప్రతికూలత ఏర్పడింది. ఇంటింటా చెత్త సేకరణ ప్రతిరోజూ అన్నీ ప్రాంతాల్లో జరగడం లేదు. కానీ యూజర్‌ చార్జీలు మాత్రం రోజువారీగా నెలకొకసారి వసూళ్లు చేసేందుకు వంలటీర్లు సిద్ధపడటంతో ప్రజలు తిరస్కరిస్తున్నారు. 


రాష్ట్రంలోనే చివరిస్థానం 

చెత్తపై పన్ను వసూలు చేయడంలో రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలతో పోల్చితే నెల్లూరు చివర స్థానంలో ఉంది. 19.33శాతం మాత్రమే పన్ను వసూళ్ల ప్రగతి కనిపిస్తుం డటంతో కార్పొరేషన్‌ అధికారులపై  ప్రభుత్వం ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీంతో ఊపిరి తిప్పుకోలేకపోతున్న కార్పొరేషన్‌ అధికారులు నిత్యం ఆరోగ్య విభాగంతో సమీక్షలు జరిపి డివిజన్ల వారీగా శానిటేషన్‌ ఉద్యోగులతోపాటు వలంటీర్లకు యూజర్‌ చార్జీల వసూళ్ల బాధ్యతను అప్పగించారు. దీనిపై రోజువారీ లెక్కలు రాబడుతున్న అధికారులు ఇప్పటికే ప్రగతి చూపలేకపోయిన  కొంతమం దికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కాగా చెత్తపై పన్ను విధానం మొదలైన ఫిబ్రవరిలో ఎన్‌ఎంసీ వసూళ్ల ప్రగతి 25.72 శాతంగా ఉండగా, మార్చిలో 18.76, ఏప్రిల్లో 13.51, మేలో 8.82  ప్రస్తుతం 3.14 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి చెత్తపై పన్నును చెల్లించేందుకు  ప్రజలు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. 


నెలకి వసూళ్ల లక్ష్యం రూ. 1.14 కోట్లు 

ప్రతి నెలా నెల్లూరులో చెత్తపై పన్ను  రూ. 1.14 కోట్లు వసూలు చేయాలని ఎన్‌ఎంసీ లక్ష్యం పెట్టుకుంది. ఇందులో మురికివాడల నుంచి రూ. 30 లక్షల వరకు యూజర్‌ చార్జీల డిమాండ్‌ ఉండగా, మామూలు ప్రాంతాల నుంచి రూ. 60 లక్షలు, అపార్టుమెంట్ల నుంచి మరో రూ. 10 లక్షలు, కమర్షియల్‌ ప్రాంతాల నుంచి రూ. 14 లక్షల వరకు   ఉంది. అపార్టుమెంట్లు, కమర్షియల్‌ ప్రాంతాల నుంచి నెలవారీ వసూళ్లలో అనుకూల పరిస్థితులు కనిపిస్తుండగా, మురికివాడలు, రెసిడెన్షియల్‌ ప్రాంతాల నుంచే   ప్రతికూలత వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-06-28T05:29:20+05:30 IST