చేయూతకు మడతపేచీ

ABN , First Publish Date - 2022-08-15T06:27:56+05:30 IST

జనం నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

చేయూతకు మడతపేచీ

చెత్తపన్ను కడితేనే  లబ్ధి

సొంత ఇల్లుంటే చెత్తపన్నుతోపాటు ఆస్తి, కొళాయి పన్ను క్లియర్‌ చేయాలి

అద్దె ఇళ్లలో ఉన్నవారికి చెత్తపన్ను కడితేచాలని ఆఫర్‌

లేకుంటే ఖాతాలో డబ్బులు జమ కావు

పథకం వర్తించేవారంతా  పన్నులు కట్టేయాలి 

వివాదాస్పదమవుతున్న వార్డు వలంటీర్ల వాయిస్‌ మెసేజ్‌లు


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జనం నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అన్నిరకాల పన్నులను పూర్తిగా చెల్లిస్తేనే  సంక్షేమ పథకాల లబ్ధిదారులకు డబ్బులు ఖాతాల్లోకి జమ చేస్తామంటూ షరతు విధిస్తోంది. వచ్చేనెలలో ‘చేయూత’ పథకం కింద రాష్ట్రంలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.18,750 చెల్లించాల్సి ఉండడంతో ఆ పథకం లబ్ధిదారులందరూ ఆస్తి, చెత్త, కొళాయిపన్నుల బకాయిలను పూర్తిగా చెల్లించాలంటూ వలంటీర్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. తక్షణం పన్నులన్నీ కట్టకపోతే పథకం కింద డబ్బులు జమ కావని బెదిరిస్తుండడం వివాదాస్పదమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారందరికీ ఏటా రూ.18,750 చొప్పున అందజేస్తోంది. అన్ని అర్హతలు ఉన్నవారు పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే, అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితా ప్రకారం ప్రతీఏటా ఆగస్టులో లబిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.18,750 జమ చేస్తున్నారు. 

జీవీఎంసీ పరిధిలో 63,134 మంది చేయూత కింద గత ఏడాది లబ్ధి పొందారు. ఈ ఏడాది కూడా ఆగస్టులోనే  నగదు జమ కావాల్సి ఉన్నప్పటికీ  వచ్చేనెలకు వాయిదా పడింది. ఈ క్రమంలో గతంలో అర్హులైనవారితో పాటు కొత్తగా  దరఖాస్తు చేసుకునేవారందరికీ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రజలంతా చెత్తపన్ను చెల్లింపుని వ్యతిరేకిస్తుండడం, పన్ను చెల్లించాలంటూ ఇంటింటికీ వెళ్లి అడుగుతున్న వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లపై  తిరగబడుతుండడంతో సంక్షేమ పథకాల కింద లబ్ధిపొందుతున్నవారి నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గతంలో సామాజిక  పింఛన్ల నుంచి చెత్తపన్ను మినహాయించడంతో తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. తాజాగా చేయూత లబ్ధిదారుల నుంచి చెత్తపన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతోనే సరిపెట్టకుండా ఆస్తి, కొళాయిపన్ను కూడా పూర్తిగా రాబట్టాలని వార్డు సచివాలయాల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో చేయూత లబ్ధిదారులంతా తక్షణం చెత్తపన్ను, ఇంటిపన్ను, కొళాయిపన్ను పూర్తిగా చెల్లించి, వాటి రశీదులను ఈనెలాఖరులోగా తమకు అప్పగిస్తేనే చేయూత డబ్బులు జమవుతాయని, సచివాలయాల సిబ్బంది వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌లను వార్డు వలంటీర్లు పంపారు. దీంతో వారంతా ఆ మెసేజ్‌ను తమ పరిధిలోని గ్రూపుల్లో పోస్ట్‌ చేశారు. అద్దె ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులతే చెత్తపన్ను పూర్తిగా చెల్లిస్తే చాలని, సొంత ఇళ్లలో ఉన్నవారైతే  అన్ని రకాల పన్నులు పూర్తిగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులంతా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెత్తపన్నుతో సంక్షేమ పథకాలకు లింకు పెట్టడం ఏమిటని వలంటీర్లను నిలదీస్తున్నారు. అయితే పై అధికారులు తమకు పంపిన మెసేజ్‌నే తాము పంపించామని, తమ చేతిలో ఏమీ లేదని వలంటీర్లు తప్పించుకుంటున్నారు. 

Updated Date - 2022-08-15T06:27:56+05:30 IST