ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలోని 9 మంది మృతి!

Sep 20 2021 @ 06:07AM

ఫరాస్‌గావ్: ఛత్తీస్‌గఢ్‌లోని ఫరాస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో, ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రథమ చికిత్స అందించాక, ఫరాస్‌గావ్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 

బాధితులను పరామర్శించడానికి ఫరాస్‌గావ్ ఆసుపత్రికి వచ్చిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు సంతాప కార్యక్రమానికి హాజరై, తమ సొంత గ్రామమైన పాండేయత్‌గావ్‌కు తిరిగి వెళుతున్నారన్నారు. ఇంతలో బోర్గావ్ పీటీఎస్ క్యాంప్ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో ఈ ఆటోను బలంగా ఢీకొంది. దీంతో ఆటోలోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారన్నారు. మృతులలో 10 నెలల ఆడ శిశువు కూడా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.