వ్యాక్సిన్ వేసుకుంటే టమోటాలు ఫ్రీ!

ABN , First Publish Date - 2021-04-20T23:43:08+05:30 IST

కరోనా కేసులు విపరీతంగా పెరగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యాక్సీన్‌పై అవగాహన పెంచేందుకు ఛత్తీ‌స్‌గఢ్‌లోని ఓ గ్రామ అధికారులు వినూత్న...

వ్యాక్సిన్ వేసుకుంటే టమోటాలు ఫ్రీ!

బీజాపూర్: కరోనా కేసులు విపరీతంగా పెరగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యాక్సీన్‌పై అవగాహన పెంచేందుకు ఛత్తీ‌స్‌గఢ్‌లోని ఓ గ్రామ అధికారులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కొవిడ్ వ్యాక్సీన్ వేసుకున్న ప్రతి ఒక్కరికీ.. టమోటాలు ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టారు. బీజాపూర్ జిల్లాలో గిరిజనులు అధికంగా నివసించే బస్తర్ గ్రామంలో వ్యాక్సీన్‌పై పెద్దఎత్తున తప్పుడు ప్రచారం, నకిలీ వార్తలు, ఇతర ప్రమాదకర పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో వ్యాక్సీన్ వేసుకునేందుకు అక్కడి ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రతి గ్రామస్తుడికి రెండు కేజీలు టమోటాలు ఇచ్చారు. ‘‘ప్రజలు వ్యాక్సీన్ వేయించుకునేలా ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. కొందరు వ్యాక్సీన్ వేయించుకునేందుకు తటపటాయిస్తుండడంతో... వాళ్లు సంతోషంగా ముందుకొచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది. అంతే కాదు.. వ్యాక్సీన్‌పైనా, కరోనా వైరస్‌పైనా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. పుకార్లన్నిటినీ తిప్పికొట్టవచ్చు..’’ అని పురుషోత్తం సాల్లూర్ అనే ఓ అధికారి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 13,834 మంది కరోనా బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 165 మంది  ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గడ్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,29,000కు పెరిగింది. 

Updated Date - 2021-04-20T23:43:08+05:30 IST