చలాకీ చికెన్‌!

ABN , First Publish Date - 2021-06-05T05:03:24+05:30 IST

ఇమ్యూనిటీ పెంచే పోషకాల్లో ప్రధానమైనది ప్రొటీన్‌. చికెన్‌ బ్రెస్ట్‌, కాలేయాల్లో ప్రొటీన్‌ పరిమాణం కొంత ఎక్కువ. కాబట్టి ఈ కొవిడ్‌ కాలంలో చికెన్‌ తరచుగా తింటూ ఉండాలి.

చలాకీ  చికెన్‌!

ఇమ్యూనిటీ పెంచే పోషకాల్లో ప్రధానమైనది ప్రొటీన్‌. చికెన్‌ బ్రెస్ట్‌, కాలేయాల్లో ప్రొటీన్‌ పరిమాణం కొంత ఎక్కువ. కాబట్టి ఈ కొవిడ్‌ కాలంలో చికెన్‌ తరచుగా తింటూ ఉండాలి. త్వరగా, తేలికగా, రుచిగా తయారు చేసుకోగలిగే  చికెన్‌ రెసిపీలు ఇవే! 



సింపుల్‌ చిల్లీ చికెన్‌!

(తయారీ సమయం: 20 నిమిషాలు)

తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో వండుకోగలిగే చికెన్‌ రెసిపీ ఇది! స్పైస్‌ ఇష్టపడేవాళ్లకు సూటయ్యే చికెన్‌ రెసిపీ ఇది!


కావలసిన పదార్థాలు:

చికెన్‌ బ్రెస్ట్‌: 2

ఉప్పు: ఒక టీస్పూను

గుడ్డు: గిలక్కొట్టుకుని ఉంచుకోవాలి

మైదా పిండి: 3/4 కప్పు

బెంగుళూరు మిర్చి: 1 (సన్నగా, పొడవుగా ముక్కలు తరుక్కోవాలి)

రెడ్‌ పెప్పర్‌: 1 (సన్నగా, పొడవుగా ముక్కలు తరుక్కోవాలి)

వెల్లుల్లి: 3 (దంచుకోవాలి)

సోయా సాస్‌: 3 టేబుల్‌ స్పూన్లు

టమాటా ముద్ద: 2 టేబుల్‌ స్పూన్లు

నీళ్లు: అర కప్పు


తయారీ విధానం:

చికెన్‌ ముక్కలను సన్నగా, పొడవాటి పట్టీల్లా కట్‌ చేసి పెట్టుకోవాలి.

వాటిని మొదట గుడ్డు సొనలో ముంచి, తర్వాత మైదా పిండిలో దొర్లించాలి.

ప్యాన్‌లో నూనె వేసి, ఈ ముక్కలను పరిచి, రెండు వైపులా బంగారు రంగుకు మారే వరకూ వేయించుకోవాలి.

 బెంగుళూరు మిర్చి, రెడ్‌ పెప్పర్‌ ముక్కలు కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే ప్యాన్‌లో వెల్లుల్లి, కారం, సోయా సాస్‌, టమాటా ముద్ద, నీళ్లు వేసి కలిపి, చిన్న మంట మీద చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి.

తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేసి, సాస్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి.

రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ నుంచి దించుకుని వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.



లాస్ట్‌ మినిట్‌ చికెన్‌!

(తయారీ సమయం: 15 నిమిషాలు)

వంటకు ఎక్కువ సమయం లేనప్పుడు, చివరి నిమిషంలో చిటికెలో తయారుచేసుకోదగిన చికెన్‌ రెసిపీ ఇది.


కావలసిన పదార్థాలు:

వెల్లుల్లి పొడి: 2 టీస్పూన్లు

ఉల్లి పొడి: ఒకటిన్నర టీస్పూను

కారం: 2 టీస్పూన్లు

ఆరిగానో: 2 టీస్పూన్లు

మిరియాల పొడి: ఒకటిన్నర టీస్పూను

కొషెర్‌ సాల్ట్‌: 1 టీస్పూను

బోన్‌లెస్‌ చికెన్‌: ఒక కిలో

ఆలివ్‌ ఆయిల్‌: 1 టేబుల్‌ స్పూను

కొత్తిమీర: ఒక కట్ట


తయారీ విధానం:

వెల్లుల్లి పొడి, ఉల్లి పొడి, కారం, ఆరిగానో, మిరియాల పొడి, ఉప్పు ఓ గిన్నెలో కలుపుకోవాలి.

చికెన్‌ ముక్కలను ప్లేట్‌లో పరిచి సగం పొడిని చల్లుకుని, ముక్కలను తిరగేసి మిగిలిన పొడి చల్లుకోవాలి.

మసాలా ముక్కలకు పట్టేలా వేళ్లతో చికెన్‌ ముక్కలను రుద్దుకోవాలి.


గ్రిల్‌ ఇలా!

 నాన్‌స్టిక్‌ గ్రిల్‌ ప్యాన్‌ను మీడియం మంట మీద ఉంచి, ప్యాన్‌ మీద ఆలివ్‌ ఆయిల్‌ చలుకోవాలి.

సగం చికెన్‌ ముక్కలను ప్యాన్‌ మీద పరుచుకోవాలి. ముక్కల మధ్య ఎడం ఉండేలా చూసుకోవాలి.

కలపకుండా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

 చికెన్‌ ముక్కలను తిరగేసి, మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. 

ఇలాగే మిగతా చికెన్‌ను కూడా గ్రిల్‌ చేసుకోవాలి.

కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.


హనీ గార్లిక్‌ చికెన్‌! 

(తయారీ సమయం: 15 నిమిషాలు)

రొటీన్‌కు భిన్నంగా తీయదనాన్ని జోడించిన చికెన్‌ రెసిపీ ఇది. స్నాక్‌గా, మెయిన్‌ కోర్స్‌ రెసిపీగా రెండు విధాలుగా వాడుకోగలిగే సింపుల్‌ చికెన్‌ రెసిపీ హనీ గార్లిక్‌ చికెన్‌!


కావలసిన పదార్థాలు:

ఆలివ్‌ ఆయిల్‌: రెండు టీ స్పూన్లు

బోన్‌లెస్‌ చికెన్‌: కిలో (అర అంగుళం ముక్కలు)

ఉప్పు, మిరియాల పొడి: తగినంత

తేనె: 3 టేబుల్‌ స్పూన్లు

సోయా సాస్‌: 3 టేబుల్‌ స్పూన్లు

వెల్లుల్లి పేస్ట్‌: ఒకటిన్నర స్పూను

మిరపకాయ విత్తనాలు: పావు టీస్పూను


తయారీ విధానం:

 గిన్నెలో ఆలివ్‌ ఆయిల్‌ వేడి చేసుకోవాలి.

చికెన్‌ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి పట్టించాలి

 తేనె, సోయా సాస్‌, వెల్లుల్లి ముద్ద, మిరపకాయ విత్తనాలు బాగా కలుపుకుని పెట్టుకోవాలి.

 వేడెక్కిన నూనెలో చికెన్‌ ముక్కలు వేసి, నాలుగు నిమిషాల పాటు ముక్కలు రంగు మారేవరకూ వేయించుకోవాలి.

కలుపుకున్న మసాలా ముద్దను చికెన్‌లో వేసి, మసాలా ముక్కలకు పట్టేలా నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.

చికెన్‌ ముక్కలు చిన్నవే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి అవసరానికి మించి ఉడికించుకోకూడదు. 

 స్టవ్‌ నుంచి దించి, కొత్తిమీర, నువ్వులతో అలంకరించి, వేడి అన్నంతో పాటు సర్వ్‌ చేయాలి.


ఫన్‌ఫ్యాక్ట్స్‌ 

బాబిలోనియాలో గోడల మీద బయల్పడిన ఆకృతులను బట్టి, క్రీస్తుపూర్వం 600 ప్రాంతం నుంచే చికెన్‌ను వంటకంగా తినే సంప్రదాయం ఉందని ప్రపంచానికి తెలిసింది.  

ప్రపంచంలో మనుషుల కంటే కోళ్ల సంఖ్యే ఎక్కువ.

తన 70వ యానివర్సరీని పురస్కరించుకుని కెఎఫ్‌సి ఏకంగా 1131 కిలోల అతి పెద్ద ఫ్రైడ్‌ చికెన్‌ను సర్వ్‌ చేసింది. 

 కోళ్లను చూస్తే కలిగే భయానికి ‘అలెక్టెరోఫోబియా’ అని పేరు.


క్విక్‌ చికెన్‌! 

(తయారీ సమయం: 20 నిమిషాలు)

ఆఫీసు పనితో అలసిపోయి, వండుకునే ఓపిక లేని సమయాల్లో ఈ క్విక్‌ చికెన్‌ ట్రై చేయవచ్చు. 


కావలసిన పదార్థాలు:

 చికెన్‌: కిలో

 ఉల్లిపాయ పేస్ట్‌: ఒక కప్పు

టమాటా పేస్ట్‌: ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 1 టేబుల్‌ స్పూను

ధనియాల పొడి: 2 టీస్పూన్లు

జీలకర్ర పొడి: 2 టీస్పూన్లు

పసుపు, ఉప్పు, నూనె: తగినంత

కారం: ఒకటిన్నర టీస్పూను

గరం మసాలా: ఒక టీస్పూను

 కొత్తిమీర - ఒక కట్ట


తయారీ విధానం:

 ప్యాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకోవాలి.

తర్వాత టమాటా ముద్ద వేసి, నీరు ఇగిరిపోయే వరకూ వేయించుకోవాలి.

ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.

రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి.

ముక్కలు రంగు మారేవరకూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

తర్వాత అర కప్పు నీళ్లు పోసి, కలుపుకుని, మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి.

చికెన్‌ ముక్కలు ఉడికి, గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించి, చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్‌ నుంచి దించుకోవాలి.   


Updated Date - 2021-06-05T05:03:24+05:30 IST