మోదీ సర్కార్‌ను వెంటాడే భూతం

ABN , First Publish Date - 2021-04-10T06:01:04+05:30 IST

రాఫెల్ కేసును నిశితంగా పరీక్షించి దేశ ప్రజలకు వాస్తవాలు వెల్లడించడంలో మీడియా, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కాగ్ విఫలమయ్యాయి. ఆ యుద్ధ విమానాల ఒప్పందంపై వివాదం ఎంతమాత్రం ముగిసిన వ్యవహారం కాదు....

మోదీ సర్కార్‌ను వెంటాడే భూతం

రాఫెల్ కేసును నిశితంగా పరీక్షించి దేశ ప్రజలకు వాస్తవాలు వెల్లడించడంలో మీడియా, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కాగ్ విఫలమయ్యాయి. ఆ యుద్ధ విమానాల ఒప్పందంపై వివాదం  ఎంతమాత్రం ముగిసిన వ్యవహారం కాదు. ఫ్రెంచ్ మీడియా సంస్థ ‘మీడియా పార్ట్’ పరిశోధనాత్మక కథనాలే అందుకు నిదర్శనం.


లోకానికి జ్ఞాపకశక్తి తక్కువ. సామాన్య ప్రజలకు ప్రతి రోజు జీవించడమే ఒక సవాల్. దేశానికి ఎదురవుతున్న మహాసవాళ్ళ గురించి వారికి బాగా తెలుసు. అయితే వాటిపై వారు ఎంతోసేపు మనసు పెట్టరు, పెట్టలేరు. ఆ మహా సవాళ్ళను ఎదుర్కొనేందుకు తాము ప్రతిష్ఠాపించిన, పట్టం కట్టిన పార్లమెంటు, శాసనసభలు, న్యాయవ్యవస్థ, స్వతంత్ర మీడియా, కాగ్, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మొదలైన వాటిని వారు విశ్వసిస్తారు. అయితే ఈ సంస్థలు, వ్యవస్థలు వేర్వేరుగాను, సమష్టిగాను విఫలమయినప్పుడు ప్రజలు అట్టే పట్టించుకోరు. తమ జీవిత వ్యవహారాలలో మునిగిపోతారు. రాఫెల్ యుద్ధ విమానాల కేసులో కూడా ఇదే జరిగింది. 


రాఫెల్ కేసును నిశితంగా పరీక్షించే అవకాశం నాలుగు సంస్థలకు ఉన్నది. అవి: మీడియా, సుప్రీం కోర్టు, పార్లమెంటు, కాగ్. నాలుగూ తమ విధ్యుక్త ధర్మ నిర్వహణలో విఫలమయ్యాయి. తొలుత మీడియా విషయాన్ని చూద్దాం. రాఫెల్ వ్యవహారంలో వివిధ ప్రశ్నలు లేవనెత్తి, వాటికి సమాధానాలు డిమాండ్ చేసేందుకు అవసరమైన సమాచారం మీడియాకు అందుబాటులో ఉన్నది. అయితే మీడియా ఆ ప్రశ్నలు సంధించేందుకు తిరస్కరించింది. ప్రభుత్వం అందించిన ప్రకటనలే అ విశ్వసనీయ ‘వార్తలు’గా పరిగణించింది. 2018 అక్టోబర్ 7న ఇదే కాలమ్‌(‘కారణాలు కావాలా రక్షణ మంత్రీ!’)లో రాఫెల్ కేసు విషయమై ఆర్థిక మంత్రిని పది ప్రశ్నలు అడిగాను.


వాటిలో కొన్ని: (1) 126 రాఫెల్ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారు? 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కొత్త ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? (2) పాత ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ఖరీదు రూ.526 కోట్లు కాగా కొత్త ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర రూ.1670 కోట్లు అని తెలుస్తోంది. ఇది నిజమేనా? (3) మొదటి విమానాన్ని 2019 సెప్టెంబర్‌లో (కొత్త ఒప్పందం కుదుర్చుకున్న నాలుగు సంవత్సరాలకు), చివరి విమానాన్ని 2022లో సరఫరా చేస్తారు. మరి రాఫెల్ ఒప్పందం ‘అత్యవసర కొనుగోలు’ లావాదేవీ అని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది? (4) హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌కు సాంకేతికతల బదిలీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారు? (5) ప్రభుత్వం ఆఫ్ సెట్ భాగస్వామిగా ఏ సంస్థ పేరు నైనా సూచించిందా? సూచించనప్పుడు హెచ్‌ఏఎల్ పేరును ఎందుకు సూచించలేదు? వీటితో సహా ఆ పది ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. కొన్ని పత్రికలు మినహా మీడియా సంస్థలన్నీ రాఫెల్ ఒప్పందం విషయంలో దేశ ప్రజల పట్ల తమ విధ్యుక్త ధర్మనిర్వహణలో విఫలమయ్యాయి.


రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద దాఖలైన ఒక పిటిషన్‌లోని కీలక ప్రశ్నలపై విచారణ జరపడంలో తన అశక్తతను సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. విమానాల ధర, సాంకేతికతల నాణ్యతను పరీక్షించేందుకు నిరాకరించింది. భారత వాయుసేనకు 126 విమానాలు అవసరం కాగా కేవలం 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం పై కూడా తాము విచారణ జరపబోమని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఒక ‘సీల్డ్ కవర్’లో సమర్పించిన సమాచారాన్ని, ‘మౌఖికంగా తెలిపిన విషయాలను’ సుప్రీంకోర్టు అంగీకరించింది. రాఫెల్ ఒప్పందంపై కాగ్ ఒక నివేదిక సమర్పించినట్టు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే సదరు నివేదికను పార్లమెంటుకు గానీ, సుప్రీంకోర్టుకు గానీ నివేదించలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందన్నది స్పష్టం. రాఫెల్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తమ వాదనల సత్యసంధతను రుజువు చేసిందని ప్రభుత్వం చెప్పుకుంది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై విచారణ జరగకుండానే సత్యాలు ఎలా వెల్లడవుతాయి? 


రాఫెల్ వ్యవహారంలో పార్లమెంటు పార్టీల వారీగా చీలిపోయింది. ప్రభుత్వ కార్యకలాపాలపై పార్లమెంటరీ పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయింది. 2014 మార్చి 13న హెచ్‌ఏఎల్, దసో కంపెనీ మధ్య సాంకేతికతల బదిలీ విషయమై కుదిరిన ఒప్పందాన్ని ఎందుకు వదిలివేశారని ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయింది. కొత్త ఒప్పందం కింద విమానాల ధర 9 నుంచి 20 శాతం తక్కువ అయిన పక్షంలో 126 విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేదు? హెచ్‌ఏఎల్‌ను ఆఫ్‌సెట్ భాగస్వామిగా ఎందుకు సూచించలేదు? ప్రభుత్వం తన మెజారిటీతో న్యాయబద్ధమైన పార్లమెంటరీ పర్యవేక్షణను వమ్ము చేసింది. 


రాఫెల్ విషయంలో దేశ ప్రజలకు నిజాలు వెల్లడించడంలో కాగ్ ఘోరంగా విఫలమయింది. తన 33 పేజీల నివేదికలో రాఫెల్ లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలను కప్పిపుచ్చింది. ఈ లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ వాదనల విషయంలో చూపిన సంయమనం, గౌరవం బోఫోర్స్ కేసులో గానీ, మరే కేసులో గానీ సంబంధిత పాలకుల వాదనల పట్ల కాగ్ చూపనేలేదు అయినప్పటికీ కొత్త ఒప్పందం ప్రకారం రాఫెల్ విమానాల ధర 9 శాతం మేరకు తగ్గిందన్న ప్రభుత్వ వాదనను కాగ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం గమనార్హం. ఇతర రాజ్యాంగ సంస్థల కంటే కాగ్‌కు విస్తృత సమాచారం అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ ఈ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ దేశ ప్రజల పట్ల తన విధ్యుక్త ధర్మ నిర్వహణలో ఘోరంగా విఫలమయింది. 


కొత్త ఒప్పందం అసాధారణంగా అవినీతికి అడ్డుకట్ట వేసి నిబంధనలన్నిటినీ రద్దు చేసేసింది. కారణమేమిటి? ఈ రద్దు వెనుక రహస్య లక్ష్యం ఏమైనా ఉన్నదా? అది మనకు తెలియదు. అయితే అవినీతిని నిరోధించే నిబంధనల రద్దు అంశం మళ్ళీ చర్చనీయాంశమయింది. ఇది ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. మీడియా పార్ట్ అనే ఫ్రెంచ్ మీడియా సంస్థ కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుకు సంబంధించి భారత్‌లో దర్యాప్తు నెదుర్కొంటున్న ఒక మధ్యవర్తికి పది లక్షల యూరోలు చెల్లించేందుకు దసో కంపెనీ అంగీకరించిందని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఫ్రెంచ్ ప్రభుత్వ అవినీతి నిరోధక సంస్థకు లభించాయని మీడియా పార్ట్ తెలిపింది.


డెఫ్సిస్ సొల్యూషన్స్ అనే భారతీయ కంపెనీకి దసో వాస్తవంగా ఐదు లక్షలకు పైగా యూరోలు చెల్లించిందని కూడా మీడియా పార్ట్ పేర్కొంది. ఈ విషయం తెలిసినప్పటికీ ఫ్రెంచ్, భారత్ అధికారులు మౌనం వహిస్తున్నారని ఆ ఫ్రెంచ్ మీడియా సంస్థ పేర్కొంది. ఒక ఆరోపణను ఎంత నిర్దిష్టంగా చేయవచ్చునో అంత నిర్దిష్టంగా చేసిన ఆరోపణ ఇది. రాఫెల్ ఒప్పందం పై వివాదం ముగిసిన వ్యవహారం ఎంతమాత్రం కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అది ఒక భూతంలా వెంటాడుతూనే ఉంటుంది.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-04-10T06:01:04+05:30 IST