ltrScrptTheme3

బహుళత్వానికి బీటలు

Oct 23 2021 @ 00:55AM

మన దేశంలో ముస్లింలు నిత్యం నిందలకు గురవుతున్నారు; దూషణలకు లోనవుతున్నారు; అనేక రకాలుగా మనస్తాపం చెందుతున్నారు; భీతావహులు అవుతున్నారు; హత్యలకు గురవుతున్నారు. ముస్లింలయిన కారణంగా మన సహచర భారతీయులు ఇటువంటి వేధింపుల భారినపడడం సమర్థనీయమేనని అందరూ కాకపోయినా కొంతమంది భారతీయులు అంటున్నారు! మరి ఈ తర్కం ప్రకారం మన ఇరుగు పొరుగు దేశాలలోని హిందువులూ, సిక్కులూ అటువంటి కష్టాలు, యాతనలకు లోనవడం సమర్థనీయమే అవుతుంది. ఈ ఉపఖండంలో ‘చర్య’, ‘ప్రతిచర్య’ను వేరు చేయలేము. 


సరిహద్దులు దేశాలను నిర్వచిస్తాయి. ఇరుగు పొరుగు దేశాలకు, సుదూర సీమలకు వలస వెళ్ళకుండా ప్రజలను ఏ సరిహద్దులూ నిలువరించలేవు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రజలు పెద్దఎత్తున వలస వెళ్ళారనేందుకు ప్రపంచ చరిత్రలో ఉదాహరణలు అనంతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇరవయో శతాబ్ది, అలాగే ప్రస్తుత శతాబ్ది కూడా వలసల విషయంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోదగ్గవి. 


ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో భాగంగా ‘అంతర్జాతీయ వలస సంస్థ’ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ ఐఓఎమ్) అనేది ఒకటి ఉంది. ఇది, 1951లో ప్రారంభమయింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పురోగమనానికి, వలసలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సంస్థ గుర్తించింది. చలన లేదా గమన స్వేచ్ఛను కూడా ఐఓఎమ్ గుర్తించింది. అంతర్గత (ఒక దేశంలోని వివిధ ప్రాంతాలకు), బాహ్య (ఒక దేశం నుంచి ఇతర దేశాలకు) జరిగే వలసలను ఎవరూ ఆపలేరు. మన దేశంలో ఆరున్నర కోట్ల మంది అంతర్- రాష్ట్ర వలసకారులు ఉన్నారు.


వలసలకు ఒక కారణం విభజన. యుద్ధం మరొక హేతువు. మన దేశ అనుభవంలో ఈ రెండూ ఉన్నాయి. 1947లో దేశ విభజన సందర్భంగా అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ జరిగిన వలసలు మానవచరిత్రలోనే అతి పెద్ద ‘బలవంతపు’ వలస వెల్లువలు. ఇంచుమించు రెండు కోట్ల మంది వలస పోవలసివచ్చిందని అంచనా. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన విముక్తి సమరం ముందు, తరువాత దాదాపు 80 నుంచి 90 లక్షల మంది శరణార్థులు భారత్‌కు వచ్చారు. వీరిలో అత్యధికులు పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడ్డారు. అస్సోంలోనూ గణనీయమైన సంఖ్యలో స్థిరపడ్డారు. ఈ వలసకారుల్లో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. దేశ విభజన అనంతరం కోట్లాది ముస్లింలు భారత్‌లోనే ఉండిపోయారు. లక్షలాది హిందువులు, సిక్కులు పాకిస్థాన్‌లోనే ఉండిపోయారు. వారూ వీరూ కూడా తాము స్థిరపడిన దేశాలనే తమ మాతృభూమిగా భావించారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్నారు. ఉపఖండంలోని మూడు దేశాలలో రెండు-భారత్, బంగ్లాదేశ్ -తమను తాము లౌకిక, ప్రజాస్వామిక రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి.


గత ఐదు దశాబ్దాలుగా హిందువులు, ముస్లింలు, సిక్కులతో సహా లక్షలాది భారతీయులు అమెరికాకు వలస పోతున్నారు. వారు వివిధ రంగాలలో ప్రముఖులుగా వెలుగొందుతున్నారు. వారి గురించి మనం సగర్వంగా చెప్పుకుంటున్నాం. అమెరికాలో వలే, యూరోపియన్ దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా లక్షలాది భారతీయులు స్థిరపడ్డారు. ఆయా దేశాలలో స్థిరపడ్డ భారతీయులకు జాతి, మతపరమైన వివక్షలకు బాధితులయినప్పుడు భారత ప్రభుత్వం న్యాయబద్ధంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.


21 కోట్ల మందికి పైగా ముస్లింలకు భారత్ మాతృభూమి. వారి పూర్వీకులు ఈ దేశంలోనే నివశించారు. అలాగే బంగ్లాదేశ్ లోని కోటిన్నర మంది హిందువులు, దేశ విభజన కాలంలో కానీ, విముక్తి సమరం జరిగిన కాలంలో కానీ భారత్‌కు వలస రాని కుటుంబాలకు చెందినవారు. మన దేశంలోని ముస్లింలలో భారతీయ పౌరుల వారసులు, వలస వచ్చినవారు ఉన్నారు. ఈ ఇరు వర్గాలు తరచు మతపరమైన వివక్షలకు బాధితులు అవుతున్నారు. ఆ వివక్షల నుంచి వారి ని రక్షించేందుకు లేదా వారిపై జరుగుతున్న హింసాకాండను ఖండించేందుకు మోదీ ప్రభుత్వం తిరస్కరిస్తోంది. ఆ దురాగతాలను ఏ దేశమైనా ప్రశ్నిస్తే ‘ మా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని’ మోదీ సర్కార్ హెచ్చరిస్తోంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై భారత ప్రభుత్వం ఎలా ఆందోళన వ్యక్తం చేసిందో గమనించండి.. అలాగే ఆ దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలు, తమ హోంమంత్రికి ఆమె ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. 


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులలో ఒకరైన ఎమ్ ఎస్ గోల్వాల్కర్ తన పుస్తకం ‘వియ్ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్’ లో ఇలా రాశారు: ‘ హిందువులను, హిందూ సంస్కృతిని ప్రస్తుతించడం మినహా మరెలాంటి భావాలకు ముస్లింలు ప్రాధాన్యమివ్వకూడదు. ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే వారు పూర్తిగా హిందువులకు విధేయులుగా ఉండాలి. హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాలి. పౌరహక్కులతో పాటు దేనినీ కోరకూడదు’. ఈ వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని ప్రస్తుత ఆరెస్సెస్, బీజేపీ నాయకులు స్పష్టం చేస్తారా? వారి మాటలు, చర్యలను చూస్తే వారు ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారని చెప్పక తప్పదు. ముస్లింలపై జరుగుతున్న దాడులపై సంఘ్ పరివార్ మౌనమే అందుకు నిదర్శనం. మరి కొన్ని ప్రశ్నలు: ముస్లింలను మినహాయిస్తున్న పౌరసత్వ సవరణ చట్టం (సి ఏ ఏ) లాంటి వివక్షాపూరిత శాసనాన్ని ఒక లౌకికరాజ్యం ఎలా సమర్థిస్తుంది? ‘విదేశీయులు’అనే నెపంతో లక్షలాది ముస్లింలను నిర్బంధించడం బంగ్లాదేశ్ మొదలైన ఇరుగుపొరుగు దేశాలపై ప్రభావం చూపదా? రాజస్థాన్ లోని తన డైయిరీకి ఆవులను రవాణా చేస్తున్న పెహ్లూఖాన్‌ను, ఇంటిలో పశు మాంసాన్ని ఉంచుకున్నాడనే ఆరోపణతో అక్లాఖ్‌ను ఊచకోత కోయడాన్ని బహుళ సంస్కృతీ సంపన్న దేశం క్షమిస్తుందా? భిన్న మతాలకు చెందిన యువతీ యువకులు వివాహం చేసుకోవడానికి వ్యతిరేకంగా లవ్ జిహాద్ లాంటి హానికరమైన సిద్ధాంతాన్ని బహుళమతాలు వర్థిల్లుతున్న దేశం ఎలా సహిస్తుంది? ప్రతి జీవనరంగమూ ఇలా ఏదో ఒక విధమైన సహనాన్ని చూస్తుండడం నిజం కాదా? 


మన దేశంలో ముస్లింలు నిత్యం నిందలకు గురవుతున్నారు; దూషణలకు లోనవుతున్నారు; అనేక రకాలుగా మనస్తాపం చెందుతున్నారు; భీతావహులు అవుతున్నారు; హత్యలకు గురవుతున్నారు. ముస్లింలయిన కారణంగా మన సహచర భారతీయులు ఇటువంటి వేధింపుల భారినపడడం సమర్థనీయమేనని అందరూ కాకపోయినా కొంతమంది భారతీయులు అంటున్నారు! మరి ఈ తర్కం ప్రకారం మన ఇరుగు పొరుగు దేశాలలోని హిందువులు, సిక్కులు కూడా అటువంటి కష్టాలు, యాతనలకు లోనవడం సమర్థనీయమే అవుతుంది. మానవతను విస్మరిస్తే ఎలా? ఈ ఉపఖండంలో ‘చర్య’, ‘ప్రతి చర్య’ను వేరు చేయలేము. 


బహుళత్వం ఒక వాస్తవం. విభిన్న సంస్కృతులకు చెందిన వారితోనూ, అన్య మతాలను ఆచరించేవారితోనూ, ఇతర భాషలు మాట్లాడేవారితోనూ , వివిధ జీవనరీతులను అనుసరించేవారితోనూ సహజీవనం నెరపడాన్ని ప్రతి దేశమూ నేర్చుకోవాలి. భారత్ ఇటీవలి సంవత్సరాలలో ఈ విషయాలలో విఫలమయింది. సహనభావం అంతకంతకూ తగ్గిపోతూ హింసాకాండ మరింతగా పెరిగిపోతోంది. ఈ ధోరణి ఎక్కడైనా, ఎప్పుడైనా అసంగతమైనది. హింస హింసకే దారితీస్తుంది . కంటికి కన్ను అనే సిద్ధాంతం యావత్ప్రంచాన్ని గుడ్డి జగత్తుగా మారుస్తుంది. ఈ సత్యాన్ని ఎవరు చెప్పారో మీకు గుర్తుందా?


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.