మళ్లీ వచ్చిన రాఫెల్ భూతం!

ABN , First Publish Date - 2021-07-10T07:02:57+05:30 IST

రాఫెల్ అవినీతి బాగోతం జరిగిన తరుణంలో నాలుగు భారతీయ వ్యవస్థలు దేశ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయి. అవి: మీడియా, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.....

మళ్లీ వచ్చిన రాఫెల్ భూతం!

రాఫెల్ అవినీతి బాగోతం జరిగిన తరుణంలో నాలుగు భారతీయ వ్యవస్థలు దేశ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయి. అవి: మీడియా, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. మరి ప్రజల విషయమేమిటి? వారు ప్రశాంతచిత్తంతో మౌనంగా ఉండిపోతారా? శాంగ్ ఫ్రాకు ఫ్రెంచ్ భాషలో మరో అర్థం కూడా ఉంది. అది ఒక పనిని ‘పథకం ప్రకారం చేయడం’.


శాంగ్‌ఫ్రా ఒక ఫ్రెంచ్ పదం. ఈ మాటకు అర్థం ‘అత్యంత క్లిష్ట పరిస్థితులలోనూ కలత చెందకుండా ప్రశాంతంగా ఉండగలిగే సామర్థ్యం’ అని ఆక్స్‌ఫర్డ్ ఆంగ్ల నిఘంటువు పేర్కొంది. శాంగ్ ఫ్రాలో భారతీయులు ఫ్రెంచ్ వారిని మించిపోయారు సుమా! లక్షలాది వలస కార్మికులు డబ్బు, ఆహారం, మందులు, ఇతరత్రా ఎలాంటి తోడ్పాటు లేకుండానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకన వెళ్లవలసిన దుస్థితి పట్ల ఉదాసీనంగా ఉండిపోవడమనేది మన దేశంలో కాక మరేదైనా దేశంలో జరుగుతుందా? రోగులను తీసుకువచ్చిన అంబులెన్స్‌లు ఆసుపత్రుల వెలుపల బారులు తీరిన దృశ్యాన్ని సహించడం మనకు మాత్రమే సాధ్యమేమో?! ఒక అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇదొక అనివార్యమైన చేటు అని మనకు మనమే సంజాయిషీ ఇచ్చుకుంటున్నాం.


కొవిడ్–-19 కారణంగా సంభవించిన 4,05,967 మరణాల (నిజానికి ఈ విషాద గణాంకాన్ని నాలుగైదు రెట్లు తక్కువగా చెప్పారనేది ఒక విశ్వసనీయ అంచనా)పై ప్రజాగ్రహం ప్రజ్వరిల్లకుండా పూర్తిగా వ్యక్తిగత దుఃఖగాథగా మిగల్చడం మన దేశంలో గాక ఏ దేశంలో సాధ్యమవుతుంది? తల్లిదండ్రుల ఆగ్రహాన్ని చవిచూడకుండా లక్షలాది పేద బాలలను ఆన్‌లైన్ విద్యాభ్యాసం నుంచి మినహాయించగలగడం మనదేశంలో గాక మరెక్కడ జరుగుతుంది? మరెన్నో శోచనీయ పరిణామాలు ఈ పాటికే మీ మదిలోకి వచ్చి ఉంటాయి. భారతీయుల ‘శాంగ్ ఫ్రా’ మీకు ఆశ్చర్యం గొల్పడం లేదూ? 


సరే, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆరోగ్య శాఖామాత్యుడూ రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి సైతం రాజీనామా చేశారు. ఇంకా మరెంతో మంది మంత్రులు రాజీనామా చేశారు. అయితే వీరిలో ఏ ఒక్కరూ ప్రజలు పడిన నానా కష్టాలకు బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. 2020, 2021 సంవత్సరాలలో తమ పాలన ప్రజలపై భరించలేని భారాలను మోపిందన్న పరితాపంతో ఈ మంత్రి మహాశయులు ‘స్వచ్ఛందంగా’ రాజీనామా చేశారని మీలో ఒక్కరంటే ఒక్కరైనా భావించడం జరిగిందా? ఈ నెల 3న ఫ్రెంచ్ వార్తా వెబ్‌సైట్ ‘మీడియా పార్ట్’ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రచురించిన ఒక ఫాలోఅప్ వార్తాకథనం న్యూఢిల్లీలో ఎటుంటి సంచలనం కలిగించలేదు మరి. అధికార నడవాల్లో ఈ విషయమై ఎటువంటి గుసగుసలు విన్పించనేలేదు. రక్షణ మంత్రిత్వశాఖలో కూడా ఎవరూ ఆ వార్తాకథనంపై కళ్ళు పెద్దవి చేయలేదు. ఉదారస్వభావుడైన గౌరవనీయ రక్షణమంత్రి ప్రతిస్పందించలేదు. రాఫెల్‌పై గతంలో తాను చేసిన అధికారిక ప్రకటనలతో ఆ వార్తాకథనం ఏకీభవించడం లేదన్న వాస్తవాన్ని మాజీ రక్షణమంత్రి పూర్తిగా ఉపేక్షించారు. ఎంత నిశ్చింత! ఇదే కదా శాంగ్ ఫ్రా. 


రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసౌ నిబంధనలకు విరుద్ధంగా భారత్‌కు చెందిన ఒక మధ్యవర్తికి 10 లక్షల యూరోలను చెల్లించడానికి అంగీకరించిందని గత ఏప్రిల్‌లో మీడియా పార్ట్ తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది. డిఫైస్ సొల్యూషన్స్ అనే భారతీయ కంపెనీకి 5,98,925 యూరోలను వాస్తవంగా చెల్లించిందని కూడా ఆ వార్తా కథనం వెల్లడించింది. అదొక నిర్దిష్ట ఆరోపణ. అయినా భారత్‌లో సంబంధిత ‘పెద్దమనుషులు’ నిశ్చింతగా ఉండిపోయారు. అయితే ఫ్రాన్స్‌లో కథ వేరేగా ఉంది.


ఇప్పుడు మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భారత వాయుసేనకు 126 రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేసేందుకు 2012లో ఒక టెండర్ ద్వారా దసౌ కంపెనీని ఎంపిక చేశారు. భారత్‌లో రాఫెల్ విమానం తయారీ కోసం హెచ్‌ఎఎల్‌కు సాంకేతికత బదీలి చేయడానికి సంబంధించిన కాంట్రాక్టు కుదిరిందని దసౌ సిఇఓ 2015 మార్చి 25న వాయుసేన ప్రధానాధికారి, హెచ్ఏఎల్ చైర్మన్ సమక్షంలో ప్రకటించారు. ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరుగుతాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే మార్చి 26న దసౌ, రాఫెల్ తయారీ విషయమై ఒక ప్రైవేట్ భారతీయ కంపెనీతో ‘జాయింట్ వెంచర్’ విషయమై ఒక ఎంవోయుపై సంతకం చేసింది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంట ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళిన భారతీయ అధికారులు ఏప్రిల్ 8న పారిస్‌లో దసౌ–-హెచ్ఏఎల్ మధ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు జరుగుతాయని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందాన్ని రద్దుచేశామని, ఫ్రాన్స్‌లో తయారైన 36 రాఫెల్స్‌ను భారత వాయుసేన కొనుగోలు చేస్తుందని ప్రధాని మోదీ ఏప్రిల్‌ 10న పారిస్‌లో ప్రకటించారు. నవంబర్ 9న దసౌ, ప్రైవేట్ భారతీయ కంపెనీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.


2016 సెప్టెంబర్లో 36 రాఫెల్ యుద్ధ విమానాల విక్రయంపై భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. నవంబర్ 28న వాటాదారుల ఒప్పందంపై దసౌ, ప్రైవేట్ భారతీయ కంపెనీ సంతకాలు చేశాయి. 51 శాతం ఈక్విటీతో దసౌ 159 మిలియన్ యూరోలు సమకూర్చేందుకు, 49 శాతం ఈక్విటీతో ప్రైవేట్ భారతీయ కంపెనీ 10 మిలియన్ యూరోలు సమకూర్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ వాస్తవాలపై నేషనల్ పైనాన్షియల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ కొత్త విచారణ ప్రారంభించింది. ఈ విచారణ ఒక స్వతంత్ర న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతోంది. 


రాఫెల్ అవినీతి బాగోతం జరిగిన తరుణంలో నాలుగు భారతీయ వ్యవస్థలు (వీటిలో మూడు రాజ్యాంగబద్ధమైనవి) దేశ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయి. అవి: మీడియా, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). రాఫెల్ విషయంలో పార్లమెంటు ఆత్మరక్షణలో పడుతుందని నిశ్చితంగా చెప్పగలను. ఇది నాకు చాలా విచారం కలిగిస్తోంది. అయితే ప్రభుత్వం తన సంఖ్యాబలంతో ఎటువంటి అవినీతి జరగలేదని తనను తాను సమర్థించుకునే అవకాశముంది. కాగ్ గతంలో రాఫెల్ వ్యవహారంపై 141 పేజీల నివేదిక సమర్పించింది. దానిని సమర్థించుకునేందుకు కాగ్ మళ్ళీ ప్రయత్నించదు. అయితే దేశ సర్వోన్నతన్యాయస్థానంలో కొత్త పవనాలు వీస్తున్నాయి. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని, 2018 డిసెంబర్ 14న జస్టిస్ గొగోయ్ వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించవచ్చు. మీడియాపై నాకు విశ్వాసముంది. చాలామంది పాలకులకు విధేయులయ్యారు.


మరికొందరు అణచివేతకు గురయ్యారు. అయినప్పటికీ రాఫెల్ వ్యవహారంపై తమ అభిప్రాయాలను నిష్పాక్షికంగా, నిర్భయంగా ప్రజలకు చెప్పగల సాహసవంతులు మీడియాలో ఇంకా ఉన్నారు. మరి ప్రజల విషయమేమిటి? వారు ఇక ముందు కూడా రాఫెల్ విషయంలో ప్రశాంతచిత్తంతో మౌనంగా ఉండిపోతారా? శాంగ్ ఫ్రాకు ఫ్రెంచ్ భాషలో మరో అర్థం కూడా ఉంది. అది ఒక పనిని ‘పథకం ప్రకారం చేయడం’.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-07-10T07:02:57+05:30 IST