Chief Minister Stalin: ఆత్మగౌరవం అత్యంత ప్రధానం

ABN , First Publish Date - 2022-08-07T13:58:46+05:30 IST

మానవ హక్కులకు ఆత్మగౌరవమే పునాది అని, ఆత్మాభిమానమే ప్రతి మనిషికి గుర్తింపు అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Chief

Chief Minister Stalin: ఆత్మగౌరవం అత్యంత ప్రధానం

- భంగం కలిగిస్తే కఠిన చర్యలు

- మానవ హక్కుల కమిషన్‌ రజతోత్సవంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌


చెన్నై, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కులకు ఆత్మగౌరవమే పునాది అని, ఆత్మాభిమానమే ప్రతి మనిషికి గుర్తింపు అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (Chief Minister MK Stalin) పేర్కొన్నారు. స్థానిక కలైవానర్‌ అరంగంలో మానవ హక్కుల కమిషన్‌ రజతోత్సవానికి ముఖ్య అతిథిగా స్టాలిన్‌ హాజరై ప్రసంగించారు. మానవ హక్కుల భద్రతా చట్టం 1993లో రూపొందించగా, తమిళనాడు మానవ హక్కుల కమిషన్‌(Tamil Nadu Human Rights Commission) 1997లో ఏర్పాటైందన్నారు. ఈ కమిషన్‌ రూపొందించింది అప్పటి ముఖ్యమంత్రి కలైంజర్‌ అని గుర్తు చేశారు. కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన రాష్ట్ర శాసనసభలో 1997 ఏప్రిల్‌ 16వ తేదీ 110వ నిబంధన కింద ముఖ్యమంత్రి కలైంజర్‌ ప్రకటించారని పేర్కొన్నారు. అలాంటి మానవ హక్కుల కమిషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం, మానవుడి ఆత్మాభిమానాన్ని గౌరవించాలనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తందై పెరియార్‌ మొట్టమొదటిసారిగా రూపొందించిన సంస్థకు ‘ఆత్మగౌరవ ఉద్యమం’ అని పేరు పెట్టారన్నారు. ప్రతి మనిషికి ఆత్మగౌరవం అత్యంత ప్రధానమైనదని, మానవ హక్కులకు పునాది ఆత్మగౌరవమేనన్నారు. ఆత్మగౌరం, గౌరవం, మానవత్వం, మానవ హక్కులు అన్నీ ఒకే అర్థమిచ్చే భిన్నమైన పదాలన్నారు. అందుకే అది వ్యక్తి ఆత్మగౌరవమైనా, జాతి లక్షణమైనా, హక్కులైనా ఎలాంటి పరిస్థితుల్లో విచ్ఛిన్నం కాకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ అభిప్రాయం కాదని రాజ్యాంగం చెప్పిందని వివరించారు. రాజ్యాంగంలోని అత్యంత ప్రాథమిక అంశం మానవ హక్కులన్నారు. సమానత్వ హక్కు, వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ హక్కు వంటి 9 హక్కులున్నాయన్నారు. ఈ హక్కులు బాధించబడితే వాటి పరిష్కారం రాజ్యాంగంలో ఉందన్నారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉందన్నారు. న్యాయశాఖకు సంబంధించిన కోర్కెలను వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమ నిధి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతుల కల్పన, పలురకాల కోర్టు భవనాల ఏర్పాటుకు చెన్నైలో 4.24 ఎకరాల స్థలం రాష్ట్రప్రభుత్వం కేటాయించిందన్నారు. రూ.20 కోట్లతో 9 అంతస్తుల భవనం నిర్మిస్తున్నామని, న్యాయశాఖకు అన్నివిధాలా సహకరించే ప్రభుత్వం తమది అని తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌లో ఖాళీలు భర్తీ చేస్తామని, ఉద్యోగుల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కమిషన్‌లో పోలీసుల సంఖ్య తగినంతగా లేదని, ఈ విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే, మానవ హక్కుల కోసం గళం విప్పే వారు, అట్టడుగు ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఎలా వినియోగించుకోవాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలు, న్యాయవాదుల సంక్షేమం దృష్ట్యా సుప్రీంకోర్టు శాఖను చెన్నై(Chennai)లో ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. మద్రాసు హైకోర్టులో అధికార భాషగా తమిళంను వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు అరుణ్‌మిశ్రా, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వరనాథ్‌ భండారీ(Madras High Court Chief Justice Justice Munishwarnath Bhandari) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మానవ హక్కుల కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, తిరువళ్లూర్‌, కన్నియాకుమారి, తూత్తుకుడి జిల్లా కలెక్టర్లు, మదురై పోలీస్‌ కమిషనర్‌, కోయంబత్తూర్‌, కృష్ణగిరి జిల్లా ఎస్పీలకు పురస్కారాలు ప్రదానం చేశారు.

Updated Date - 2022-08-07T13:58:46+05:30 IST