Chief minister: పేదలకు సత్వర న్యాయం చేకూర్చండి

ABN , First Publish Date - 2022-09-21T15:26:35+05:30 IST

న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు పట్టాలు పొందటానికే పరిమితం కాకుండా వాదనా పటిమను పెంపొందించుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు

Chief minister: పేదలకు సత్వర న్యాయం చేకూర్చండి

- లా విద్యార్థులకు స్టాలిన్‌ పిలుపు

- ఘనంగా అంబేడ్కర్‌ లా వర్సిటీ రజతోత్సవాలు


చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు పట్టాలు పొందటానికే పరిమితం కాకుండా వాదనా పటిమను పెంపొందించుకోవాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలకు సకాలంలో న్యాయం చేకూర్చాలని ముఖ్యమంతి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. స్థానిక పెరుంగుడిలో మంగళవారం ఉదయం జరిగిన డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయవిశ్వవిద్యాలయ రజత్సోవంలో సీఎం ముఖ్య అతిథిగా హాజరై ఆ వేడుకల శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాలవారికి నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతోందని, విద్యార్థులు ప్రతిభాపాటవాలు పెంపొందించుకోవడానికి ‘నాన్‌ ముదల్వన్‌’ పథకం, ఇదే విధంగా మహిళలతోపాటు విద్యార్థినులు కూడా లబ్దిపొందేలా సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం వంటి విప్లవాత్మకమైన పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కోవలోనే న్యాయశాఖకు కూడా తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. శతవార్షికోత్సవాలను పూర్తి చేసుకున్న నగరంలోని న్యాయకళాశాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi)కి దక్కుతుందని, ఆ తర్వాత 1997లో అంబేడ్కర్‌ న్యాయవిశ్వవిద్యాలయాన్ని నెలకొల్పింది కూడా ఆయనేనని స్టాలిన్‌ గుర్తు చేశారు. తొలుత 40 మందితో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం 4500 మంది విద్యార్థులకు సేవలందిస్తుండటం అభినందనీయమని, ఈ విశ్వవిద్యాలయం రజోత్సవాల్లో పాల్గొనడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులందరూ న్యాయకోవిదులుగా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, అదే సమయంలో న్యాయవాదులుగా నిరుపేదలకు సత్వర న్యాయం అందించటమే తమ విద్యుక్త ధర్మంగా భావించాలన్నారు. ఈ వేడుకల్లో  మంత్రులు ఎస్‌.రఘుపతి, ఎం.సుబ్రమణ్యం, సెంజి మస్తాన్‌, హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్‌ రమేష్‌, రిటైర్డ్‌ జడ్జి ఎన్‌. కృపాకరన్‌, ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, శాసనసభ్యులు అరవింద్‌ రమేష్‌, కృష్ణసామి, తాయగమ్‌ కవి, హసన్‌ మౌలానా, మేయర్‌ ఆర్‌. ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, న్యాయశాఖ కార్యదర్శి పి. కార్తికేయన్‌, డాక్టర్‌ అంబేడ్కర్‌ న్యాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ ఎన్‌ఎస్ సంతోష్ కుమార్‌, రిజిస్ట్రార్‌ రంజిత్‌ ఒమన్‌ అబ్రహామ్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ప్రభాకర్‌, అమల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-21T15:26:35+05:30 IST