Chief Minister: తిరుమల తరహాలో తిరుచెందూరు

ABN , First Publish Date - 2022-09-29T14:09:12+05:30 IST

రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రం తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో భక్తులకు ప్రత్యేక

Chief Minister: తిరుమల తరహాలో తిరుచెందూరు

- ఆలయంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రం తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో భక్తులకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్ల ద్వారా క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం దేవాదాయ శాఖ, హెచ్‌సీఎల్‌  సంయుక్త ఆధ్వర్యంలో రూ.300కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను సచివాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. తిరుచెందూరు ఆలయ కుంభాభిషేకం జరిగి 12 యేళ్లు దాటడంతో ఆ ఆలయ కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ అభివృద్ధిపనులు చేపట్టనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్నట్లుగా భక్తులకు విశ్రాంతి గదులు, కాటేజీలు, అగ్నిమాపక కేంద్రం,  ప్రత్యేకమైన కల్యాణకట్ట, అన్నదానసత్రం, పంచామృతం, విభూది తయారీ కేంద్రాలు నిర్మించనున్నారు. ఇదే విధంగా ఆ ఆలయానికి వెళ్లే దివ్యాంగులైన భక్తులు సముద్ర  స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక రహదారి కూడా  నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu), ఎంపీ కనిమొళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి పి. చంద్రమోహన్‌, కమిషనర్‌ జే కుమారగురుబరన్‌, హెచ్‌సీఎల్‌ ఉన్నతాధికారులు శ్రీమతి శివశంకర్‌, సుందర మహాలింగం తదితరులు పాల్గొన్నారు. తిరుచెందూరు ఆలయం వద్ద ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి అనితా రాధాకృష్ణన్‌, శాసనసభ్యుడు షణ్ముగయ్యా, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కే సెంథిల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


లెక్చరర్లకు నియామక పత్రాలు 

సచివాలయంలో జరిగిన మరొక కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైనవారికి నియామక  పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులకు 1024 మంది ఎంపిక కాగా, వారిలో ఐదుగురికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయన్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కె.లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T14:09:12+05:30 IST