Chief Minister: జాతీయ విద్యావిధానం కాదది కాషాయ విధానం!

ABN , First Publish Date - 2022-10-02T13:32:27+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరిట దేశంలో కాషాయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందు కు, హిందీ భాషను నిర్బంధంగా అమలు

Chief Minister: జాతీయ విద్యావిధానం కాదది కాషాయ విధానం!

                            - సీపీఐ మహానాడులో స్టాలిన్‌ ధ్వజం


చెన్నై, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరిట దేశంలో కాషాయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు, హిందీ భాషను నిర్బంధంగా అమలు చేసేందుకు చట్టం ముసుగులో కుట్రపన్నుతోందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో సీపీఐ రాష్ట్రస్థాయి మహానాడు సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన సదస్సులో ‘ఫెడరలిజమ్‌- కేంద్ర రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీలని చెబుతూ తమ పార్టీ జెండాలో, కమ్యూనిస్టు పార్టీల జెండాలోనూ ఎరుపు రంగు ఉందన్న విషయాన్ని ఎవరూ మరువకూడదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రాల హక్కులన్నీ వరుసగా హరించుకుపోతున్నాయని, నీట్‌ ప్రవేశపెట్టి గ్రామీణ తమిళ యువకులకు వైద్య విద్యను దూరం చేసిందని, జీఎస్టీని అమలు చేసి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్వాన్నంగా మార్చిందని, పథకాల అమలుకు నిధుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచాల్సి అగత్యం ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే మొదటి నుంచి రాష్ట్రాల స్వయం సమృద్ధి ప్రధాన లక్ష్యంగానే పోరాడుతోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా ద్వంద్వపాలను చేయించి,  నిధులు విడుదల చేయకుండా రాష్ట్రాల స్థాయిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చుతోందని స్టాలిన్‌ ఘాటుగా విమర్శించారు. తాము వేర్పాటు వాదానికి వ్యతిరేకులమని, రాష్ట్రానికి మరిన్ని హక్కులు కావాలన్నదే డీఎంకే, వామపక్షాల ఏకైక లక్ష్యమని స్టాలిన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేందుకు, దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టేందుకు డీఎంకే, వామపక్షలు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని కాపాడాలంటే ముందుగా రాష్ట్రాలను కాపాడాలని, వాటిని ఆర్థికపరంగా పరిపుష్టం చేయాల్సి ఉందని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సహా సీపీఐ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T13:32:27+05:30 IST