CM statement: విద్య, ఉపాధి కల్పనే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-31T14:25:55+05:30 IST

అందరికీ విద్య, అర్హతను బట్టి ఉపాధి కల్పించడమే ద్రావిడ తరహా పాలన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే తమ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక

CM statement: విద్య, ఉపాధి కల్పనే లక్ష్యం

- నీట్‌, నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తాం

- ‘సీఎం రీసెర్చ్‌ ఫెలోషిప్‌’ వీసీల సదస్సులో స్టాలిన్‌ ప్రకటన


చెన్నై, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): అందరికీ విద్య, అర్హతను బట్టి ఉపాధి కల్పించడమే ద్రావిడ తరహా పాలన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే తమ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) వెల్లడించారు. స్థానిక అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం నిర్వహించిన వైస్‌ ఛాన్సలర్ల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ నీట్‌ సహా కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత నూతన విద్యావిధానాన్నికూడా తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్టాలిన్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి కలిగించేలా, వారి దృష్టిని నూతన అన్వేషణలపై మరల్చేలా ‘ముఖ్యమంత్రి పరిశోధనా ప్రోత్సాహక నగదు’ (సీఎం రిసెర్చ్‌ ఫెలోషిప్‌) పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం రాష్ట్రస్థాయిలో అర్హత పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామికరంగంలో ఏర్పడే మార్పులకనుగుణంగా అధ్యాపకులతోపాటు విద్యార్థులకు తగిన శిక్షణ అందించాల్సి ఉందని, ఆ దిశగా ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కలిసి ‘ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌’ అమలు చేయనున్నామని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికోసం ప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలకు విశ్వ విద్యాలయాలు కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరికీ విజ్ఞానం అందించటమే విశ్వవిద్యాలయాల ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. ‘కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు’ అనే అంశంపై అధ్యయనం జరిపిన జస్టిస్‌ పూంచ్‌ కమిటీ సిఫారసు మేరకే తన నాయకత్వంలోని డీఎంకే(DMK) ప్రభుత్వం వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించుకునేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించే బిల్లును శాసనసభలో ఆమోదింపజేసిందని తెలిపారు. త్వరలో అమలుకానున్న ఈ చట్టానికి అనుగుణంగా విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 విశ్వవిద్యాలయాలున్నాయని, వీటిలో స్వాతంత్ర్యానికి ముందు మద్రాసు విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం మాత్రమే ఉండేవని, తరువాత 1947 నుంచి 1967 వరకు మదురై విశ్వవిద్యాలయం మాత్రమే ఏర్పాటైందని, తక్కిన 19 విశ్వవిద్యాలయాలు 1967 తర్వాత, అంటే ద్రావిడ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాకే ఏర్పాటయ్యాయని స్టాలిన్‌ వివరించారు. మహిళలను ఉన్నతవిద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే 6 నుంచి ప్లస్‌-2 వరకు ప్రభుత్వ పాఠశాల్లో చదివి, డిగ్రీలో చేరిన విద్యార్థినులందరికీ ప్రతినెలా రూ.1000 జమచేసే ‘పుదుమై పెణ్‌’ (నవీన మహిళ) పథకాన్ని ప్రారంభించనున్నామని సీఎం చెప్పారు.


నీట్‌ వ్యతిరేకానికి కారణాలెన్నో...

నిరుపేద, గ్రామీణ విద్యార్థులు వైద్య కోర్సుల్లో ప్రవేశం పొందటానికి అడ్డుకట్టగా ఉన్న ‘నీట్‌’కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం పోరాడుతోందని,  ఆ పరీక్షలు విద్యార్థులను ఉన్నతి స్థితికి తీసుకెళ్లే నిచ్చెనలా కాకుండా అడ్డుకట్టగా ఉండటం వల్లే వాటి నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతున్నామని తెలిపారు. విద్యను బట్టే అర్హత ఉండాలే తప్ప, అర్హతలు ఉంటేనే ఉన్నత విద్యనందిస్తామని చెప్పడం అసమంజసమన్నారు. విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే నీట్‌, కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకెళ్లే గురుతర బాధ్యత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై ఉందని, ఆ దిశగా వైస్‌ఛాన్సలర్లు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మంత్రులు పొన్ముడి, ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, తంగం తెన్నరసు, ఎస్‌. రఘుపతి, అనితా రాధాకృష్ణన్‌, ఎం. సుబ్రమణ్యం, సీవీ మెయ్యనాధన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరైఅన్బు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జయరంజన్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయన్‌, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-31T14:25:55+05:30 IST