వరద సాయం వైసీపీవారికేనా?

ABN , First Publish Date - 2021-12-01T08:39:07+05:30 IST

వరద సాయం వైసీపీ వర్గీయులకే పంపిణీ చేయడమేమిటని ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డిని బాధితులు నిలదీశారు. దీంతో ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

వరద సాయం వైసీపీవారికేనా?

  • ప్రభుత్వ చీఫ్‌విప్‌ను నిలదీసిన బాధితులు
  • సాయంత్రానికి ఐదుగురిపై పోలీసు కేసులు


రాయచోటి, నవంబరు 30: వరద సాయం వైసీపీ వర్గీయులకే పంపిణీ చేయడమేమిటని ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డిని  బాధితులు నిలదీశారు. దీంతో ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెలో మంగళవారం జరిగిందీ ఘటన. ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గరుగుపల్లెలో వరద సాయం పంపిణీ చేపట్టారు. అర్హులందరికీ ఇవ్వలేదని, వైసీపీ వర్గీయులను మాత్రమే వలంటీర్‌ నమోదు చేశారని ఆరోపిస్తూ గ్రామస్థులు పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌ని పిలవకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ పంపిణీ చేయాలని అధికారులను శ్రీకాంత్‌రెడ్డి ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, అడ్డుకున్నవారిలో ఐదుగురిపైౖ రాయచోటి అర్బన్‌ పోలీసులు సాయంత్రం కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకూ ఆటంకం కల్పించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్‌ 353, 341, 506 రెడ్‌ విత్‌ 34 కింద కేసు(క్రైం నంబరు 448/2021) నమోదు చేశారు. అర్హులందరికీ ఇవ్వాలని అడిగిన ప్రజలపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ తప్పుడు కేసులు పెట్టించడం దారుణమని టీడీపీ నాయకుడు మండిపల్లె రాం ప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.  

Updated Date - 2021-12-01T08:39:07+05:30 IST