చిక్కుల్లో చిన్న పంచాయతీలు

ABN , First Publish Date - 2021-10-11T05:26:28+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చిన్న గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు.. అన్న చందంగా వీటి పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 712 చిన్న పంచాయతీలు అనేక సమస్యలతో కూనారిల్లుతున్నాయి. అభివృద్ధి లేక అల్లాడిపోతున్నాయి.

చిక్కుల్లో చిన్న పంచాయతీలు

నిధులు చారెడు.. ఖర్చులు బారెడు..

ప్రతీ నెలా పైసలకు కటకట

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

కుంటుపడుతున్న అభివృద్ధి

తడిసిమోపెడుగా కరెంటు బిల్లుల భారం

ట్రాక్టర్‌ ఈఎంఐలతో ఇక్కట్లు


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చిన్న గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు.. అన్న చందంగా వీటి పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 712 చిన్న పంచాయతీలు అనేక సమస్యలతో కూనారిల్లుతున్నాయి. అభివృద్ధి లేక అల్లాడిపోతున్నాయి. 300లోపు జనాభా కలిగిన పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు జరుగుతుండడంతో వీటికి ప్రతీ నెల వచ్చే నిధులు రూ.20వేల నుంచి రూ. 25వేలు కూడా మించడం లేదు. కానీ ఖర్చు మాత్రం రూ.40 వేలకు మించి  అవుతోంది. 


హనుమకొండ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : పరిపాలనా వికేంద్రీకరించడం ద్వారా పల్లెలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాతీయల పునర్‌వ్యవస్థీకరించింది. 500లోపు జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. కానీ వీటి నిర్వహణకు చాలినన్ని నిధులను మాత్రం ఇవ్వడం లేదు. వాటికి ప్రతీ నెల వచ్చే నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రధానంగా వరంగల్‌, జనగామ, మానుకోట జిల్లాలోని చిన్న పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 


నిధులురాక..

300 నుంచి 500 జనాభా ఉన్న శివారు గ్రామాలను కలిపి నూతన పంచాయతీలుగా మా ర్చిన ప్రభుత్వం.. సరిపడా నిధులను మాత్రం అందించకపోవడంతో ప్రస్తుతం ఆ పంచాయతీల పాలక వర్గాలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొదట్లో ప్రతీ చిన్న పంచాయతీకి ఏటా రూ.5లక్షల నిధులు విడుదల చేస్తామని అర్భాటంగా ప్రకటించిన ప్ర భుత్వం.. ఆచరణలో విఫలమైంది. ప్రభుత్వం మండల పరిషత్తు, జిల్లా ప రిషత్తు నిధులు కేటాయించడంతో పంచాయతీలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టింది. దీంతో నిధులు లేక అభివృద్ధి పనులు చేపట్టడం పాలకవర్గాలకు సాధ్యం కావడం లేదు. అప్పులు చేయాల్సి వస్తోంది. 15వ ఆర్ధిక సంఘం నిధులు అప్పుల చెల్లింపులకే సరిపోతున్నాయి. కొన్నిచోట్ల పంచాయతీ భవ నం అద్దె, ట్రాక్టర్ల వాయిదాలు, విద్యుత్‌ బిల్లులు సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. ఉపాధి నిధులతో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డులు చేపట్టినా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది.


కరెంట్‌ బిల్లులకే..

చిన్న పంచాయతీలకు వచ్చే నిధుల్లో 80 శాతం కరెంట్‌ బిల్లులకే సరిపోతున్నది. ఇక మిగిలిన దాంట్లో ట్రాక్టర్ల ఈఎంఐ కట్టేందుకే పోతోంది. కొత్తగా ప్రతీ పంచాయతీలకి ట్రాక్టర్‌ కొనాలని ప్రభుత్వం నిబంధలు విధించి బలవంతంగా ట్రాక్టర్లను కొనుగోలు చేయించింది. దీంతో ట్రాక్టర్‌ ఈఎంఐతో పాటుగా డీజిల్‌ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. కొన్నిచోట్ల డీజిల్‌ కోసం అప్పులు తీసుకువస్తున్నారు. పంచాయతీల నుంచి బిల్లులు రావడం లేదనే కారణంగా బంకుల్లో డీజిల్‌ పోయడం నిలిపివేశారు. కొత్త చట్టాన్ని రూపొందించి పంచాయతీల్లో కార్మికులను  మల్టీపర్పస్‌ ఎంప్లాయి్‌సగా మార్చారు. ఒక్కొక్కరికి రూ.8,500 వేతనంగా నిర్ధారించారు. పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచే వేతనాలను ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి రూపాయి మిగలడం లేదు. దీంతో నెలనెలా వేతనాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.


ఇలా ఇచ్చి..

జిల్లా కలెక్టర్లకు విడుదల చేసే ప్రత్యేక నిధుల నుంచి పంచాయతీలకు ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం లేదు. కలెక్టర్లకు నిధులను విడుదల చేసిన వెంటనే తిరిగి తీసేసుకుంటున్నది. తాజాగా  ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు రూ.10కోట్లు విడుదలయ్యాయి. అయితే వాటిని గ్రామాల కోసం వినియోగించేందుకు కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఉదయం ఇచ్చినట్టే ఇచ్చిన ప్రభుత్వం మధ్యాహ్నానికే తిరిగి తీసుకున్నది. దీంతో కలెక్టర్లు కూడా ఏం చేయలేక పోయారు.


బిల్లులు రాక..

పంచాయతీల్లో పనులు చేసిన ప్రజాప్రతినిధులకు బిల్లులు రావడం లేదు. రాజకీయాల్లో ఉండి గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు కొంత మేరకు తట్టుకుంటున్నా.. కొత్త పంచాయతీల్లో తొలిసారి సర్పంచులు అయినవారు, మధ్య తరగతివర్గాల నుంచి ఎన్నికైన వారు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి పనులు చేసిన సర్పంచులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు.


ప్రోత్సాహం

ఏకగ్రీవంగా ఎన్నికైతే వస్తాయనుకున్న ప్రోత్సాహక నిధులు ఇప్పటి వరకు రాలేదు. సీఎం కేసీఆర్‌ మొన్న అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఆ నిధులు రావని తేలిపోయింది. పంచాయతీ ఎన్నికల సమయంలో పోలింగ్‌ లేకుండా పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీంతో చాలా గ్రామాల్లో ప్రజలు కలిసికట్టుగా ముందుకు కదిలారు. తమ పంచాయతీల అభ్యున్నతికి నిధులను వినియోగించుకోవచ్చునని ఏకగ్రీవంగా చేసుకున్నారు. ఇలా ఏకగీవ్రంగా పాలక వర్గాలను ఎన్నుకున్న వాటిలో చిన్న పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి. రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా శాసనసభలో సీఎం చేసిన ప్రకటనతో ఏకగీవ్రంగా ఎన్నికైన సర్పంచులకు నిరాశే ఎదురైంది. పోత్సాహ నిధులు ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పడంతో ఈ పంచాయతీల సర్పంచులు ఉసూరుమంటున్నారు.


రాబడి – ఖర్చులు

ఉదాహరణకు ఒక చిన్న పంచాయతీ ఖర్చులు చూస్తే ట్రాక్టర్‌ వాయిదాకు రూ.13,500, వీధి దీపాలు, విద్యుత్‌ బిల్లులకు రూ.2,500, పారిశుధ్య కార్మికులకు వేతనాలకు రూ.8,500, ట్రాక్టర్‌ డీజిల్‌కు రూ.6,000, స్టేషనరీ, బ్లీచింగ్‌, సున్నం, ఇతరత్రా ఖర్చులకు రూ.10వేలు, వెరసి రూ.40,500 వరకు వ్యయమవుతుంది. కానీ ఆదాయం మాత్రం రూ.27వేలు మాత్రమే. ఆర్నెళ్లకోసారి వచ్చే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధులు అప్పులకే సరిపోవడం లేదు.


712 కొత్త పంచాయతీలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 712 గ్రామపంచాయతీలు ఆదాయం లేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,688 గ్రామ పంచాయతీలు  ఉన్నాయి. అంతకు ముందు 976 పంచాయతీలు ఉండగా కొత్తగా 712 ఏర్పాటయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 27, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 131, జనగామ జిల్లాలో 91, మహబూబాబాద్‌ జిల్లాలో 241, ములుగు, భూపాలపల్లిజిల్లాలో 241 కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు సొంతభవనాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ఇవ్వన్నీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి నెలనెలా అద్దెలు కట్టడం తలకు మించిన భారం అవుతోంది.

Updated Date - 2021-10-11T05:26:28+05:30 IST