
హైదరాబాద్: జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్నకొడుకు, కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరవింద్(45) ఈ పైశాచికానికి పాల్పడ్డాడు. 2003లో వెంకటగిరికి చెందిన మహిళ(40)తో అరవింద్‌కు వివాహం జరిగింది. వీరికి కూతురు(14), కొడుకు(11) ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా 2018లో విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు.
గత కొంతకాలంగా కూతురు, కుమారుడు అన్యమనస్కంగా ఉంటుండటంతో ఆందోళన చెందిన తల్లి.. సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్ల క్రితం తమపై తండ్రితో పాటు అతడి స్నేహితుడు అసభ్యకర ప్రవర్తనకు పాల్పడ్డట్లు ఆ చిన్నారులు తెలిపారు. ఎవరూ లేని సమయంలో తన శరీర భాగాలను తాకుతూ తండ్రి అరవింద్, అతని స్నేహితుడు(45) అసభ్యంగా ప్రవర్తించారని కూతురు చెప్పగా.. తనను నగ్నంగా నిలబెట్టి ఇష్టారీతిన వ్యవహరించేవారని కుమారుడు చెప్పాడు. దీంతో తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.