ఆసిఫాబాద్‌ జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు

ABN , First Publish Date - 2022-04-28T03:56:56+05:30 IST

పేదరికం, నిరక్షరాస్యత, కట్టుబాట్లు, సామాజిక రుగ్మతలతో ఆడపిల్లలను భారంగా భావిస్తున్న కొందరు తల్లిదండ్రులు వారికి త్వరగా పెళ్లిళ్లు చేయడానికి మొగ్గు చూపుతుండడంతో చిన్నారుల జీవితాలు చిధ్రమవుతున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లాలో చిన్నారి పెళ్లి కూతుళ్లు

- కట్టుబాట్లు.. ఆర్థిక ఇక్కట్లతో బాల్యవివాహాలు

- అవగాహన కల్పిస్తున్నా మార్పు నామమాత్రమే

- మారుమూల పల్లెల్లో.. తండాల్లో జోరుగా వివాహాలు

- కౌన్సెలింగ్‌ ఇచ్చినా కొందరిలోనే మార్పు

- అడ్డుకుంటున్న అధికారులు

- గత మూడు నెలల్లో ఏడు బాల్యవివాహాలు నిలిపివేత

బెజ్జూరు, ఏప్రిల్‌ 27: పేదరికం, నిరక్షరాస్యత, కట్టుబాట్లు, సామాజిక రుగ్మతలతో ఆడపిల్లలను భారంగా భావిస్తున్న కొందరు తల్లిదండ్రులు వారికి త్వరగా పెళ్లిళ్లు చేయడానికి మొగ్గు చూపుతుండడంతో చిన్నారుల జీవితాలు చిధ్రమవుతున్నాయి. బాల్యవివాహాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పించినా ఎన్నిచట్టాలు తీసుకొచ్చినా ప్రజల్లో పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. కట్టుబాట్లనే చాదస్తం వల్ల తల్లిదండ్రులు చేసే అనాలోచిత చర్యల వల్ల చిన్నారుల జీవితాల్లో చీకట్లు అలుము కుంటున్నాయి. అధికారులకు అందిన సమాచారంతో చిన్నారి పెళ్లి కూతుళ్లకు విముక్తి లభిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అరికట్టడంలో అధికారులు విఫలం అవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు చిన్నారి పెళ్లికూతుళ్లకు వివాహాలు జరిపించడానికి అనేక అడ్డదారులను వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల మండల కేంద్రాలతో పాటు గిరిజన గ్రామాల్లో బాల్యవివాహాలు జోరుగా జరుగుతున్నాయి.

మారుమూల ప్రాంతాల్లోనే..

ఇటీవల జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలంలో రెండు, బెజ్జూరులో ఒకటి, చింతలమానేపల్లిలో రెండు, కాగజ్‌నగర్‌లో ఒకటి, సిర్పూర్‌(టి) మండలంలో ఒకటి బాలికలకు వివాహాలు చేయడానికి నిర్ణయించగా విషయం తెలుసుకున్న డీసీపీయూ, ఐసీడీఎస్‌, పోలీసులు, పంచాయతీ సిబ్బంది వెళ్లి ఇరువురి తల్లి దండ్రులతో మాట్లాడి ఆ పెళ్లిలను నిలిపి వేశారు. మారుమూల ప్రాంతాలు కావడం ఇక్కడికి ఎవరు వస్తారులే అనే ఆలోచననో, లేదంటే చట్టంపై అవగాహన లేకనో, స్థానిక ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు పూర్తిస్థాయి నిఘాపెట్టినా కూడా కొన్నిచోట్ల వివాహాలు అడ్డుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లా ఏర్పాటుకు ముందు బాల్యవివాహాలు ఎక్కువగా జరుగగా జిల్లా ఏర్పడిన తరువాత ప్రత్యేక మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, సఖికేంద్రం, 1098, బాలల సంరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో కొంత తగ్గుముఖం పట్టాయి. 

బాల్య వివాహచట్టం.. నివారణ చర్యలు

ప్రభుత్వం బాల్యవివాహాలను అరికట్టడానికి బాల్యవివాహచట్టం-2006ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం బాల్యవివాహాలను చేసినా లేక ప్రోత్సహించినా శిక్షర్హులే. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్షల వరకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు. బాల్య వివాహం చేసి మైనర్‌ను అక్రమంగా రవాణా చేయడం, దానిని దాచి ఉంచడం కూడా తీవ్రమైన నేరంగా చట్టం పరిగణిస్తోంది. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్‌ లేని శిక్ష విధిస్తారు. కాగా గ్రామాల్లో బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రభుత్వం పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సర్పంచ్‌ చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, స్థానిక ఉపాధ్యాయురాలు, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, వార్డు మెంబర్‌, ఆశా వర్కర్‌, అంగన్‌వాడీ టీచర్‌లను నియమించింది. గ్రామాల్లో వీరు ప్రజల్లో చైతన్యం నింపుతూ బాల్య వివాహాలను అరికట్టాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఏడు వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.

సత్ఫలితాలిస్తున్న అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో బాల్యవివాహాలపై ఇటీవలి కాలంలో అవగాహన కార్యక్రమాలను పెంచడం సత్ఫలితాలనిస్తోంది. రెండేళ్ల నుంచి అధికారులు ప్రతిగ్రామంలో అవగాహన కార్యక్రమాలు పెంచారు. ఇటీవలి కాలంలో బాల్యవివాహాలు కొంతమేర తగ్గాయని చెప్పవచ్చు. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో అధికారుల కల్లుగప్పి కొన్నిచోట్ల వివాహాలు జరిపిస్తూనే ఉన్నారు. గతంలో సరైన అవగాహన లేక జిల్లాలో 50నుంచి 100మంది వరకు బాల్య వివాహాలు చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. 

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

- మహేష్‌, జిల్లా బాలల సంరక్షణాధికారి, ఆసిఫాబాద్‌

బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తాం. బాల్యంలోనే వివాహాలను చేయడంతో చిన్నారులకు అనేక శారీరక, ఆరోగ్య సమస్యలు వస్తాయి. గర్భధారణ సమస్యలు ఏర్పడి పుట్టబోయే బిడ్డకు, తల్లికి సమస్యలు ఏర్పడుతాయి. బాలికలు తమకు జరిగే అన్యాయంపై 1098టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలి. గ్రామాల్లో జరిగే బాల్యవివాహాలను అడ్డుకునేం దుకు ఎవరైనా సరే నిర్భయంగా టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేయవచ్చు.

Updated Date - 2022-04-28T03:56:56+05:30 IST