బాల్యం.. బందీ

ABN , First Publish Date - 2022-05-25T05:19:12+05:30 IST

ఆటపాటలు.. కేరింతలు.. తుళ్లింతలు.. గిల్లికజ్జాలు.. అందమైన ఊహలు.. ఇలా ఎన్నో మధురానుభూతుల్లో సాగాల్సిన బాల్యం వివాహ బంధంలో బందీగా మారిపోతోంది.

బాల్యం.. బందీ

చిరుప్రాయంలోనే వివాహ బంధనాలు

గడిచిన మూడేళ్లలో పెరిగిన దురాచారం

పట్టణ ప్రాంతాల్లోనూ నమోదవుతున్న వైనం

సంరక్షణ భయంతోనే పెళ్లిబాటలో తల్లిదండ్రులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35.4 శాతం బాల్య వివాహాలు

 

బాల్యం అంటే ఆడుతూ.. పాడుతూ.. అభం.. శుభం తెలియని ప్రాయం. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అనేది ఓ మరువలేని జ్ఞాపకం. బరువులు, బాధ్యతలు, భయాలు లేని ఒక సుందర స్వప్నం. అలాంటి బాల్యం మూడు ముళ్ల బంధంలో బందీగా మారుతోంది. ముక్కుపచ్చలారని పసిమొగ్గలు కుటుంబ బరువు, బాధ్యతల బందీఖానాలో చిక్కి శల్యమైపోతున్నారు. పెళ్లంటే  ఏమిటో కూడా తెలియకుండానే చిన్నారుల జీవితాలు శిథిలమైపోతున్నాయి. విద్యా కేంద్రమైన గుంటూరులాంటి జిల్లాలో కూడా బాల్య వివాహాలు భారీగా నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ అధికారులు ఆపుతున్న బాల్య వివాహాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక అధికారులకు తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో ఎవరికీ అంతుచిక్కడంలేదు. బాల్య వివాహాలతో బాలల ఆరోగ్య, మానసిక ఎదుగుదల, పుట్టే పిల్లలకు ప్రమాదం. తల్లిదండ్రుల్లో అవగాహన లేమి, ఆర్థిక, సామాజిక పరిస్థితులు బాల్య వివాహాల వైపు మొగ్గేలా చేస్తున్నాయి. 



29.3 శాతం బాల్య వివాహాలు

ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రాష్ట్రంలోని మహిళల్లో ప్రస్తుతం 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో 29.3 శాతం మంది బాల్య వివాహాలు చేసుకుంటున్నారని తేలింది. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 32.9 శాతం మంది ఉండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలు 21.7 శాతం మంది ఉన్నారు. వీరిలో 12.6 శాతం మంది మహిళలు 15 నుంచి 19 ఏళ్లలోపే గర్భం దాల్చారు. తగిన వయసు, శారీరక ఎదుగుదల లేకుండానే వీరు గర్భిణులుగా మారడంతో వీరి ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. 


గుంటూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆటపాటలు..  కేరింతలు.. తుళ్లింతలు.. గిల్లికజ్జాలు.. అందమైన ఊహలు.. ఇలా ఎన్నో మధురానుభూతుల్లో సాగాల్సిన బాల్యం వివాహ బంధంలో బందీగా మారిపోతోంది. అనాదిగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒకటి. వేల ఏళ్ల నుంచి వెంటాడుతున్న ఈ దురాచారాన్ని రద్దు చేయాలని భావించి, ఎప్పుడో 150 ఏళ్ల క్రితం 1872లోనే బాల్య వివాహాలను రద్దు చేస్తూ అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం చట్టం చేసినా అది నేటికీ సమాజాన్ని వీడలేదు. సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థాయికి ఎదిగిన మానవుడు సమాజాన్ని పట్టి పీడించే ఇలాంటి దురాచారాల నుంచి బయట పడలేకపోతున్నాడు. ఫలితంగా ముక్కుపచ్చలారని ఎంతో మంది చిన్నారుల జీవితాలు మూడు ముళ్లు బంధంలో చిక్కి శల్యమవుతున్నాయి. బాల్య వివాహాల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరుగుతుండడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌- 19 ప్రభావం మొదలైన తర్వాత బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.


ఉమ్మడి గుంటూరు జిల్లా అత్యధికంత

బాల్య వివాహాల రాష్ట్ర సగటు 29.3 శాతం. అయితే రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా  బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నివేదికలు తేల్చాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం 2019- 20లో 35.4 శాతం బాల్య వివాహాలు జరిగాయి. ఇది రాష్ట్ర సగటు కంటే 6 శాతం అధికం. కాగా కొవిడ్‌ అనంతర కాలంలో వీటి సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అడ్డుకున్న కేసుల సంఖ్య ఏటికేడాది పెరగడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2018లో 31 బాల్య వివాహాలను ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకోగా అది 2019 నాటికి 23కు తగ్గింది. అయితే కొవిడ్‌ ప్రభావం మొదలైన 2020లో 34 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగా, 2021లో 37 వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 12 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లి మండలాల్లో, మారుమూల అటవీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాగా ఇటీవల కాలంలో గుంటూరు సహా అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ బాల్య వివాహాలు జరిగినట్లు అధికారులు  చెబుతున్నారు.  


 వివిధ స్థాయిల్లో కమిటీలు.. 

 బాల్య వివాహాలను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌, డివిజన్‌ స్థాయిలో డివిజన్‌ అధికారి, సబ్‌ కలెక్టర్లు బాల్య వివాహ నిరోధక అధికారులుగా వ్యవహరిస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సీడీపీవో ప్రాజెక్టు స్థాయిలో 3 నుంచి 5 మండలాలకు ఒక బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి, మండల స్థాయిలో సంబంధిత తహసీల్దార్‌ పనిచేస్తారు. గ్రామాల్లో సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, స్థానిక ఉపాధ్యాయురాలు, మహిళా వార్డు మెంబర్లు, స్వచ్ఛంద సంస్థ, యువజన సమాఖ్య సభ్యుడు, ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహ నిరోధక కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరంతా బాల్య వివాహల వల్ల కలిగే నష్టాలను ఆయా ప్రాంతాల్లో తెలియచేస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే అడ్డుకుంటారు. ఈ కమిటీలు నామమాత్రంగా మారిన కారణంగా బాల్య వివాహాల సంఖ్య ఇటీవల కాలంలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 


పని చేయని చట్టాలు

బాల్య వివాహాల రద్దు కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేస్తోంది. బ్రిటీష్‌ పాలనా కాలంలోనే పలు చట్టాలు జరిగాయి. 1872లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ మేయో తొలిసారి బాల్య వివాహాల రద్దు చట్టం చేశారు. ఆ తరువాత 1929లో లార్డ్‌ ఇర్విన్‌ కాలంలో ‘శారద’ చట్టం చేశారు. తాజాగా 2006లో ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మేరేజెస్‌ యాక్ట్‌ 2006ను చేశారు. ఈ చట్టం ప్రకారం ఆడపిల్లల వివాహ వయసు 18, మగపిల్లల వివాహ వయసును 21గా నిర్ణయించారు. కాగా కిందటేడాది ఈ చట్టాన్ని సవరించి ఇద్దరి వయసును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ బాల్య వివాహాలు ఆగడం లేదు.


తల్లిదండ్రులను వెంటాడుతున్న భయం.. 

గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరగడానికి కారణం అవిద్య, అవగాహనాలేమి కారణాలుగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో  అయితే తల్లిదండ్రుల సమస్య వేరేలా ఉంటోంది. సినిమా, టీవీల దుష్ప్రభావాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాల నుంచి బయట పడేందుకు తక్కువ వయసులో పెళ్లిళ్లకు తల్లిదండ్రులు పూనుకుంటున్నారు. సమాజాన్ని ఆవరించిన అభద్రతా భావం ఆడపిల్లలకు శాపంగా మారింది. ప్రజల్లో అవగాహన పెంచి, భయం పోగొట్టి, మహిళలకు, ఆడపిల్లల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఈ బాల్య వివాహాలు అడ్డుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.


బాల్య వివాహాలతో నష్టాలు

- బాల్య వివాహాల వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. 

-సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదిగేందుకు అవకాశం, స్వేచ్ఛ లేకుండా పోతుంది. 

- చిన్న వయసులోనే గర్భం దాలిస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమే. 

- పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.

- బాలికల విద్యా హక్కును ఇది కాలరాస్తుంది. పిల్లలు నిరక్షరాశ్యులుగా, నైపుణ్యం లేనివారుగా మిగిలిపోతారు. 

 

 

Updated Date - 2022-05-25T05:19:12+05:30 IST