పిల్లలు పనుల్లో కాదు, బడుల్లో ఉండాలి

Jun 12 2021 @ 00:39AM

‘‘ప‌ల్లెటూరి పిల్ల‌గాడా ప‌సుల‌గాసే మొన‌గాడా పాలు మ‌ర‌చి ఎన్నాళ్ళ‌య్యందో ఓ పాల బుగ్గ‌ల జీత‌గాడా కొలువుదీరి ఎన్నాళ్ళ‌య్యిందో’’ అంటూ తొలి త‌రం ప్ర‌జాక‌వి సుద్దాల హ‌నుమంతు రాసిన ఈ పాట భార‌త‌దేశంలో శ‌తాబ్దాల త‌ర‌బ‌డి బాల‌కార్మిక వ్య‌వ‌స్థ‌లో మ‌గ్గిపోతున్న బాల‌ల ముఖ చిత్రాన్ని ప్ర‌తిబింబిస్తుంది.  బ‌డిలో ఉండాల్సిన పిల్ల‌ల‌ను, ఆట పాట‌ల‌తో గ‌డ‌పాల్సిన  బాల్యాన్ని బందీ చేయ‌డం ఒక అనాగ‌రిక చ‌ర్య‌. ఇది మ‌న భార‌త‌దేశ స‌మ‌స్య మాత్ర‌మే కాదు. ప్ర‌పంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు సంబంధించింది కూడా.


బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డానికి స్థిర‌మైన, దీర్ఘ‌కాలిక కృషి ఎంతో అవ‌స‌రం. అందుకు బాల‌కార్మికులు లేని స‌మాజాన్ని నిర్మించేందుకు అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఒ) 2002 నుండి ప్ర‌త్యేక దృష్టి సారించింది. బాల కార్మిక వ్య‌వస్థ నిర్మూల‌న కోసం, స‌మాజంలో చైత‌న్యం తీసుకురావ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 12న ‘ప్ర‌పంచ బాల‌కార్మిక వ్య‌తిరేక దినోత్స‌వం’ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది.


బాల‌కార్మికుడు అనే పదానికి సార్వ‌త్రికంగా ఆమోదించిన నిర్వ‌చ‌న‌మేమిటంటే ‘బాల్యాన్ని నాశ‌నం చేసే రీతిలో పిల్ల‌ల‌తో ప‌ని చేయించ‌డం’. పిల్ల‌ల శారీర‌క, మాన‌సిక‌, సామాజిక అభివృద్ధికి అవ‌రోధ‌మై, వారికి అక్ష‌రాస్య‌త, వినోదాన్ని పొందే అవ‌కాశం ఇవ్వ‌ని ప‌నిని, ఆ స్థితిని బాలకార్మిక వ్య‌వ‌స్థ‌గా పేర్కొంటారు. బాల‌లంటే 5 నుంచి 14 సంవత్సరాల వ‌య‌సు గ‌ల‌వారు. అయితే, త‌ల్లిదండ్రుల పేద‌రికం, నిర‌క్షరాస్యత కార‌ణంగా ఎంద‌రో బాల‌లు బాల‌కార్మికులుగా జీవిస్తున్నారు. అవ‌స‌రాల కోస‌మో, అద‌న‌పు ఆదాయం కోస‌మో పేద కుటుంబాలు త‌మ పిల్ల‌ల‌ను ప‌నుల్లోకి పంపిస్తున్నారు.


ఎంతో మంది బాల‌లు వ్య‌వ‌సాయ ప‌నుల్లో, నిర్మాణ రంగాల్లోనే కాకుండా ప్ర‌మాద‌క‌ర వృత్తులైన ఇసుక‌బ‌ట్టీలు, ప‌ల‌క‌ల త‌యారీల్లో, క్వారీల్లో, గాజు ప‌రిశ్ర‌మ‌, మైనింగ్ రంగాల్లో బ్ర‌తుకీడుస్తున్నారు. దీనివ‌ల్ల పిల్ల‌లు శారీర‌క, మాన‌సిక పెరుగుద‌ల లేకుండా దీర్ఘ‌కాల దుష్ప‌రిణామాల‌కు గుర‌వుతున్నారు. పిల్ల‌ల్లో స‌హ‌జంగా ఉండే నైపుణ్యాలు, సామ‌ర్ధ్యాలు న‌శించిపోవ‌డం, భావి భార‌త మాన‌వ వ‌న‌రులు దుర్వినియోగ‌మ‌వడమే.


ప్ర‌మాద‌క‌ర వృత్తుల్లో పిల్ల‌ల‌తో ప‌ని చేయించ‌డాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం 1986లో చట్టం చేసింది. ఇందులో 18 ప్ర‌మాద‌క‌ర వృత్తుల‌ను, 65 ప్ర‌మాద ప్ర‌క్రియ‌ల‌ను గుర్తించింది. భార‌త రాజ్యాంగం 24, 39, 49వ అధిక‌ర‌ణల ప్ర‌కారం బాల‌లకు శ్ర‌మ దోపిడి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాలి. వ‌య‌సుకు త‌గ‌ని వృత్తుల‌లో, ఉత్పత్తి కార్యకలాపాలలో ప‌ని చేయించ‌కూడదు. అదే విధంగా, భార‌త ప్ర‌భుత్వం 2016 సెప్టెంబ‌ర్ 1న బాల‌కార్మిక వ్య‌వస్థ నిర్మూల‌న కోసం ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింది. దీని ప్ర‌కారం 14 ఏళ్ళ లోపు ఉన్న పిల్ల‌లు ఎవ‌రూ, ఎక్క‌డా ప‌ని చేయ‌డానికి వీలులేదు.  14 నుండి 18 ఏళ్ళ వ‌య‌సు గ‌ల వారిని ఎలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశాల్లో ప‌ని చేయించ‌కూడ‌దు. ఎవ‌రైనా అతిక్ర‌మిస్తే క‌ఠిన శిక్ష‌ల‌ను అనుభ‌వించాల్సి ఉంటుంది.


బాల‌కార్మిక వ్య‌వస్థ నిర్మూల‌న‌లో ప్ర‌భుత్వాలే కాకుండా స్వ‌చ్ఛంద సంస్థ‌లు భాగం పంచుకుంటున్నాయి. ‘బ‌డికి రాని పిల్ల‌లంద‌రు బాల కార్మికులే’ అనే నినాదంతో ఎం.వి. ఫౌండేష‌న్ చేస్తున్న కృషి ప్ర‌త్యేక‌మైంది. ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత శాంతాసిన్హా ఎం.వి. ఫౌండేష‌న్ ద్వారా 500 గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని బాల‌కార్మికుల కోసం ప్ర‌త్యేక పాఠ‌శాల‌లను నిర్వహిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్ష‌కు పైగా పిల్ల‌ల‌ను ప‌నులు మాన్పించి పాఠ‌శాల‌ల్లో చేర్పించారు. నోబెల్ శాంతి బహుమ‌తి అందుకున్న కైలాస్ స‌త్యార్థి ‘బ‌చ్‌ప‌న్ బ‌చావో ఆందోళ‌న్’తో బాల‌ల అణ‌చివేత‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. 2021 సంవ‌త్స‌రాన్ని ‘బాల‌కార్మికత నిర్మూల‌న సంవత్సరం’గా అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. 2025 నాటికి బాల కార్మికులు లేని ప్ర‌పంచాన్ని చూడాలని సంకల్పించుకుంది. ఈ సంకల్ప సాధనకు మ‌న‌మంద‌రం ‘పిల్ల‌లు ప‌నుల్లో కాదు బ‌డుల్లో ఉండాలి’ అనే నినాదాన్ని వ్యాప్తి చేద్దాం.జె. విజయ్ కుమార్ జీ

(నేడు బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం)

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.