సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను వదులుతున్న దృశ్యం
వేకువజామునే సందడిగా మారిన తీర ప్రాంతం
బీచ్ రోడ్డు, మార్చి 27: జోడుగుళ్లపాలెం సాగర తీరంలో ఆదివారం ఉదయమే సందడి వాతావరణ నెలకొంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో భాగంగా సూర్యోదయానికి ముందే సుమారు 700 తాబేళ్ల పిల్లలను సముద్ర జలాల్లోకి విడిచిపెట్టారు. జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఇక్కడి ప్రత్యేక హేచరీల్లో పొదిగించిన పిల్లలను సాగరంలోకి వదిలారు. జిల్లా అటవీశాఖాధికారి అనంతశంకర్ తాబేళ్ల పిల్లలను చిన్నారుల ద్వారా సముద్రంలోకి వదిలించారు. బుల్లి తాబేళ్లను చూసిన ఆనందంతో చిన్నారులు కేరింతలు కొట్టారు. తాబేళ్ల సంతతిని సంరక్షించేందుకు అటవీ శాఖాధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో సేకరించిన 11,664 గుడ్లను హేచరీల్లో పొదిగిస్తున్నారు. అనంతరం తాబేళ్ల పిల్లలను సాగర జలాల్లో వదిలేలా చర్యలు చేపడుతున్నారు. మే నెలాఖరు వరకు పొదిగిన తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా తాబేళ్ల సంరక్షణార్థం ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయ్యపాలెం, ముత్యాలమ్మపాలెం తీర ప్రాంతాల్లో అటవీ శాఖాధికారులు హేచరీలను ఏర్పాటు చేశారు.