ఏడవకండిరా.. అంటూ పిల్లలను ఓదారుస్తూనే కన్నీటిపర్యంతమైన ఉపాధ్యాయుడు.. గుండెను తడిచేసే సంఘటన..!

ABN , First Publish Date - 2022-09-03T22:34:03+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సిద్ధమవుతున్న వేళ

ఏడవకండిరా.. అంటూ పిల్లలను ఓదారుస్తూనే కన్నీటిపర్యంతమైన ఉపాధ్యాయుడు.. గుండెను తడిచేసే సంఘటన..!

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు సిద్ధమవుతున్న వేళ మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. పదమూడేళ్లుగా ఆ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వరిస్తున్న రామ్‌గోపాల్‌ మాస్టారు ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆ వార్త తెలుసుకున్న విద్యార్థులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదారుస్తూ రామ్ గోపాల్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Serial Killer: 6 రోజుల్లో నలుగురిని చంపేశాడు.. 19 ఏళ్ల వయసులోనే ఏంటీ దారుణమని నిలదీస్తే.. ఆ కుర్రాడు చెప్పిన మాటలు విని..


ఉపాధ్యాయుడు రామ్‌గోపాల్‌ బిరౌన పాఠశాలలో 13 సంవత్సరాలుగా గణిత శాస్త్రాన్ని బోధిస్తున్నారు. ఆయన వేరే పాఠశాలకు వెళ్లిపోతున్నారని తెలియడంతో గ్రామస్థులు, విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉపాధ్యాయుడైన రామ్‌గోపాల్‌ గ్రామస్థులందరితోనూ కలిసిపోయేవారని, చాలా సింపుల్‌గా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులెవరికైనా జబ్బు చేస్తే ఇంటికి వెళ్లి వారి పరిస్థితి గురించి ఆరా తీసేవారు. చాలా సార్లు పిల్లలను తన బైక్‌పై ఇంటికి దింపేవారు. కరోనా కాలంలో పాఠశాలలు మూసివేసినప్పుడు కూడా పిల్లల చదువుకు సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. 


గ్రామస్థులతోనూ, విద్యార్థులతోనూ తనకు ఎంతో అనుబంధం ఉందని, 13 ఏళ్లుగా వారితో తన జీవితం పెనవేసుకుపోయిందని రామ్‌గోపాల్ చెప్పారు. తనతో పాటు ఎన్నో మధురానుభూతులను తీసుకెళ్తున్నానని చెప్పారు. వీడ్కోలు సందర్భంగా అందరూ తన కోసం కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే చాలా భావోద్వేగంగా అనిపించిందని అన్నారు. 

Updated Date - 2022-09-03T22:34:03+05:30 IST