ఒమైక్రాన్‌తో పిల్లలకు భయం లేదు

ABN , First Publish Date - 2022-01-22T07:13:13+05:30 IST

ఒమైక్రాన్‌తో పిల్లలకు భయం లేదని రుయా చిన్నపిల్లల ఆస్పత్రి ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ అంజన్‌ కుమార్‌ తెలిపారు.

ఒమైక్రాన్‌తో పిల్లలకు భయం లేదు

తల్లిదండ్రులు ఆందోళన పడనవసరం లేదు

అనవసరంగా ఆస్పత్రులకు పరుగులు తీయద్దు

రుయా చిన్నపిల్లల ఆస్పత్రి ఇన్‌చార్జి  ప్రొఫెసర్‌ అంజన్‌ కుమార్‌


ఆంధ్రజ్యోతి, తిరుపతి:  మూడోవేవ్‌లో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రంగా ఉంది. పైగా ఇతర రాష్ట్రాల్లాగా ఏపీలో బడులు మూసేయకుండా నడుపుతుండడంతో కొవిడ్‌బారిన పడి ఏ ప్రమాదం వస్తుందో అనే భయం వారిలో కనిపిస్తోంది. ఇల్లిల్లూ జ్వరాల ముట్టడిలో ఉండడంతో పిల్లల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. వాక్సిన్‌ వేసుకోని పదిహేనేళ్ల పిల్లలకు ఒమైక్రాన్‌ ముప్పు ఎంత ఉండొచ్చనే ఆంశంపై రుయా చిన్నపిల్లల ఆస్పత్రి ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ డాక్టర్‌ అంజన్‌ కుమార్‌ ఆంధ్రజ్యోతితో పంచుకున్న కొన్ని ముఖ్యాంశాలు... చిన్నపిల్లల్లో థర్డ్‌వేవ్‌  తీవ్రప్రభావం చూపుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి పరిస్ధితులు ఇప్పుడు కనిపించడంలేదు. పిల్లలకు కొవిడ్‌ సోకినా హోం ఐసోలేషన్‌తోనే స్వస్థత పొందుతున్నారు. వెయ్యిమందిలో ఒకరిద్దరు మాత్రమే ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వాల్సివస్తోంది. ఎలాంటి భయాందోళనలు అవసరంలేదు.


జలుబు, దగ్గులున్నాయి

మూడో వేవ్‌లో కొవిడ్‌ పిల్లల మీద దాడి చేస్తుందన్న అంచనా, ప్రచారం నిజంకాదని తేలిపోయింది. నిజానికి ఈ అంచనాతోనే పిల్లలను ఎలా కాపాడుకోవాలనే అంశం మీద వైద్యరంగం సన్నద్ధమైంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి వైద్యసేవలు ఇవ్వాలనే అంశం మీద జిల్లాలో 800మందికి శిక్షణ కూడా ఇచ్చాం. అయితే అదృష్టవశాత్తూ అది ఊహించినంత దాడి చేయడం లేదు. పిల్లల్లో కూడా జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్‌లా తీవ్రత లేదు కాబట్టి ఒకటి రెండు రోజులకే తగ్గిపోతోంది.టెస్ట్‌ చేసుకోకముందే పిల్లలు సాధారణ స్థితికి వచ్చేస్తున్నారు.పిల్లలకు హాస్పిటల్‌ అవసరం చాలా తక్కువగా ఉంది.  వందలో ఒకశాతమే హాస్పిటల్‌ అవసరం ఉంటుందని ప్రభుత్వ అంచనా. కానీ మా పరిశీలనలో వెయ్యిలో ఒకరిద్దరికి మాత్రమే హాస్పిటల్‌ అవసరం ఉంటోంది. రుయాస్పత్రికి పిల్లలు కొవిడ్‌ లక్షణాలతో వస్తున్నారు, నిర్థారణ చేసి పాజిటివ్‌ వచ్చినవారికి హోం ఐసోలేషన్‌తోనే సరిపెడుతున్నాం. ఒమైక్రాన్‌తో పిల్లలకు ఎలాంటి భయం అవసరంలేదని అర్థం అవుతోంది. తీవ్రంగా ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అశ్రద్ధతో ఉండకూడదు.  


పెద్దల మందులు పిల్లలకు వాడొద్దు

పిల్లల్లో జలుబు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే కొవిడ్‌ అని నమ్మి పెద్దలు వాడుతున్న మందులు వాడొద్దు. మందుల షాపులకు వెళ్లి మాత్రలు తెచ్చి పిల్లలకు వేయొద్దు. కొవిడ్‌ తీవ్రంగా ఉన్న పెద్దలకు సెకండ్‌వేవ్‌లో డాక్టర్లతో సంబంధం లేకుండానే విస్తృతంగా స్టెరాయిడ్స్‌ వాడేశారు. అప్పుడు నయమైంది కదా అని అవే మందులు ఇప్పుడు వాడకూడదు. ముఖ్యంగా పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. భవిష్యత్తులో ఇవి చాలా ఇబ్బందులకు దారి తీస్తాయి. 


టీచర్లు గమనిస్తుండాలి

అక్టోబరు-నవంబరు నెలల్లో వస్తుందనుకున్న మూడోవేవ్‌ ఒమైక్రాన్‌తో ఇప్పుడు వచ్చింది. జనాభాలో వాక్సిన్‌ వేసుకోని వారిలో పదిహేనేళ్ల పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి పెద్దల నుంచి వీరికి కొవిడ్‌ సోకే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుత వేరియంట్‌ వ్యాప్తి వేగంగావుంది.తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. స్కూళ్లలో ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో ఉంటే వారిని హోం ఐసోలేషన్‌ చేయించాలి. తగ్గేవరకు స్కూల్‌కు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలను గుంపులు ఉండే చోటకు తీసుకెళ్లకుండా చూడాలి. 


ఈ ఆరు లక్షణాలుంటేనే ఆస్పత్రికి వెళ్లండి

జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించగానే తల్లిదండ్రులు ఆందోళన పడనవసరం లేదు. అది కొవిడ్‌ కానవసరం లేదు. ఇతర జ్వరాలు కూడా కావొచ్చు.  చీటికీమాటికీ పిల్లల్ని ఆస్పత్రులకు కూడా తిప్పొద్దు. కింది ఆరు లక్షణాలు మీ పిల్లల్లో కనిపించినపుడు మాత్రమే వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లండి.. 

1. తీవ్ర జ్వరం వచ్చి మూడు రోజులు దాటినా తగ్గకుండా ఉంటే.   

2. జ్వరం లేకపోయినా నీరసంగా, డల్‌గా పడుకునే ఉండిపోతే. 

3. ఆహారం, నీళ్లు ఏమీ తీసుకోలేకపోతూవుంటే.

4. రోజుకు 6 కన్నా తక్కువ సార్లు మాత్రమే యూరిన్‌కి వెళ్తూవుంటే.

5. ఆయాసంతో పక్కలు ఎగరేస్తూవుంటే.

6. శరీరంలో రాషెస్‌ వచ్చినా, వాంతులు ఉన్నా.

Updated Date - 2022-01-22T07:13:13+05:30 IST