పిల్లలకు వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-12-27T14:33:57+05:30 IST

రాష్ట్రంలో 15 నుంచి 18 యేళ్లలోపు వయసు కలిగిన 33.20 లక్షల మందికి వచ్చే యేడాది జనవరి మూడో తేదీ నుంచి కరోనా నిరోధక టీకాలు వేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక గిండీ

పిల్లలకు వ్యాక్సినేషన్

- 15-18 యేళ్లలోపు 33.2 లక్షలమందికి 3 నుంచి ప్రారంభం

- మంత్రి సుబ్రమణ్యం వెల్లడి


చెన్నై: రాష్ట్రంలో 15 నుంచి 18 యేళ్లలోపు వయసు కలిగిన 33.20 లక్షల మందికి వచ్చే యేడాది జనవరి మూడో తేదీ నుంచి కరోనా నిరోధక టీకాలు వేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక గిండీ సమీపంలో మడువాంకరైలో ఆదివారం ఉదయం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఉద్యమ తరహాలో నిర్వహిస్తున్నామని, తాజాగా ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు ఆసక్తిగా టీకాలు వేసుకునేందుకు శిబిరాల వద్ద బారులు తీరుతున్నారని చెప్పారు. రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, బస్టాపులు, బస్టాండ్లు, బస్‌డిపోలు, రైల్వేస్టేషన్లు, సినిమాథియేటర్లు, వాణిజ్య సముదాయాలు సహా 50 వేల చోట్ల 16వ విడత వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేశామని, నగరంలో 1600 చోట్ల టీకాలు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల దాకా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు నిల్వగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో రెండో విడత టీకాలు వేసుకోనివారు సుమారు 95లక్షల మంది వరకూ ఉన్నారని, వారిని టీకాల శిబిరాల వద్దకు తరలించేందుకు ముమ్మరంగా అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 15 నుంచి 18యేళ్లలోపు వయసు కలిగినవారికి కూడా టీకాలు వేసేందుకు తగు సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు. వీరికి జనవరి మూడు నుంచి కరోనా నిరోధక టీకాలు వేయనున్నామని, 10న కరోనా బాధితులకు చికిత్సలందించే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఫ్రంట్‌లైన్‌ వారియర్లందరికీ బూస్టర్‌ డోసు టీకాలు వేయనున్నామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. జనవరి 10న అరవైయేళ్లు పైబడిన వృద్ధులకు కూడా బూస్టర్‌ డోసు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. మంత్రితోపాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌, డీఎంకే ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సెల్వ వినాయగం తదితరులు టీకాల శిబిరాన్ని పరిశీలించారు.

Updated Date - 2021-12-27T14:33:57+05:30 IST