పిల్లల మనసుల్ని సంసిద్ధ పరచాలి!

ABN , First Publish Date - 2021-06-23T05:43:22+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తరగతులను అంచెలంచెలుగా ప్రారంభిస్తున్నట్లు తెలిసింది...

పిల్లల మనసుల్ని సంసిద్ధ పరచాలి!

తెలంగాణ రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తరగతులను అంచెలంచెలుగా ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. అనగా జూలై 1నుంచి 8, 9, 10వ తరగతులను, జూలై 20 నుంచి 6, 7 తరగతులను, ఆగస్ట్ 16 నుంచి 3, 4, 5 తరగతులను తెరుస్తున్నారు. ఈ సందర్భంగా- ప్రభుత్వమూ, పాఠశాల యాజమాన్యాలూ, తలిదండ్రులూ కలిసి పాఠశాలలు సురక్షితమైన వాతారణంలో సాగేందుకు సమాన కృషి చేయాలి. ఇక్కడ విద్యాశాఖ ఎటువంటి వ్యూహాలను రచించింది, వాటి అమలు ప్రక్రియ ఎలా ఉండబోతోంది అన్నది ప్రధాన అంశం. ఉదాహరణకు ఉపాధ్యాయులందరూ టీకాలు రెండు డోసులు లేదా కనీసం ఒక్క డోసైనా వేసుకున్నారా లేదా అన్నది కీలకం. కరోనా బారినపడకుండా పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకునేలా తలిదండ్రులు వారిని సమాయత్తం చేయాలి. పిల్లలు పబ్లిక్ రవాణా అనగా బస్సులు, ఆటోల వంటి వాహనాల్లో పాఠశాలకు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో వారికి చెప్పాలి. ఒకవేళ పిల్లలు కొంచెం అస్వస్థతగా ఉంటే వారిని బడికి పంపకుండా నివారించాలి. ఈ మొత్తం ప్రక్రియలో తలిదండ్రులు కీలక పాత్ర పోషించకపోతే పాఠశాల యాజమాన్యాలు ఒక్క చేతితో అన్నింటినీ చక్కపెట్టడం కష్టతరం.


ప్రతి పాఠశాల తమ ఉపాధ్యాయుల, పిల్లల సంఖ్యను, అందుబాటులో ఉన్న తరగతి గదుల సంఖ్యను, ఇంకా పాఠశాల ప్రాంగణ విస్తీర్ణాన్ని పరిగణన లోనికి తీసుకొని పాఠశాలను షిఫ్ట్ విధానంలో నిర్వహించాలా లేక కొన్ని తరగతులనే తొలి విడత ఆరంభించాలా అన్నది యోచించాలి. అభ్యసన ఇపుడు అందరికీ అవసరం, ఏ తరగతినీ మినహాయించలేం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 73 మిలియన్ల పాఠశాల స్థాయి పిల్లలు తరిగిన విద్యా సామర్థ్యాలతో (లెర్నింగ్ పావర్టీ) సతమతమౌతున్నారు. అంతేకాదు ఒక విద్యా సవత్సరం దూరమైన విద్యార్థి 10 నుండి 15 శాతం వరకు తన సామర్థ్యాలను కోల్పోతాడని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిణామం పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  


పాఠశాలల పునః ప్రారంభ ప్రక్రియలో వివిధ కీలకాంశాలపై దృష్టి సారించడం తప్పనిసరి: 1)కొవిడ్ దృష్ట్యా పాఠశాల విద్యకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై పాఠశాలలు విద్యావేత్తలతో చర్చించాలి. 2) ఉపాధ్యాయులందరికీ కోవిడ్ టీకా వేయించాలి. 3) తలిదండ్రులు అందరూ టీకా వేయించుకునేలా చైతన్యపరచాలి. 4) పాఠశాలను షిఫ్ట్ పద్ధతిలో నిర్వహించాలి. 5)వలసలు, దినసరి వేతనంతో జీవనం గడుపుతున్న కుటుంబాల పిల్లలు బాల కార్మికులుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 6) బడి ఈడు పిల్లలందర్నీ బడి వైపు మళ్లించడానికి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. 7) ఆడపిల్లలు, దివ్యాంగులకు ప్రత్యేక వసతులను కల్పించాలి. 8) పాఠశాల సిబ్బంది, యాజమాన్యం పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలకు తగిన వనరులను సమకూర్చుకుని వాటిని కొవిడ్ రహిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలి.


అలాగే కొవిడ్ విపత్తు వల్ల ఎంతో విరామం తర్వాత పాఠశాలలు తెరుస్తున్నారు గనుక పిల్లల్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలి. వినూత్న బోధనా ప్రక్రియలు, వ్యూహాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. సుమారు రెండు నెలల వరకు పాఠ్యాంశాల బోధన కంటే ముఖ్యంగా పిల్లల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచటంపై దృష్టి పెట్టాలి. స్నేహపూరిత వాతావరణాన్ని ఏర్పరచి కోవిడ్ కారణంగా అంతటా నెలకొన్న గంభీర వాతావరణాన్ని తరిమివేయాలి. అలాగే పాఠశాలల్లో ప్రింట్ రిచ్ వాతావరణాన్ని (వ్రాయడం, చదవడం) ఏర్పరచాలి. వర్క్ బుక్స్, ప్రాజెక్ట్ పనులు వంటి కార్యక్రమాలతో ఈ వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల కుటుంబ సభ్యులు లేదా ఎవరైనా బంధువులు కరోనా కారణంగా అస్వస్థత గురి అయినా లేదా మరణించినా వారిని అటువంటి భయాల బారి నుంచి బయటపడవేసే ప్రయత్నాలు జరగాలి.


పాఠశాల యాజమాన్యం తలిదండ్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి బాలల రక్షణ, ఆరోగ్యం, భద్రత వంటి అంశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ -తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలలు నిర్వహించాలి. మానవ అభివృద్ధి సంస్థ, సేవ్ ది చిల్డ్రన్, ఇంకా అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఇప్పటికే రూపొందించిన మార్గదర్శకాలను పరిగణలోనికి తీసుకోవడం వల్ల కూడా ప్రభుత్వ ప్రణాళికలు మరింత సులభతరం అయ్యే వీలుంది.

మల్లాడి శ్రీనగేష్‌

(సేవ్ ది చిల్డ్రన్)

Updated Date - 2021-06-23T05:43:22+05:30 IST