పిల్లలు ఇలా సురక్షితం

ABN , First Publish Date - 2021-07-06T17:20:58+05:30 IST

పిల్లలకు కొవిడ్‌ సోకినా ఆ ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు తక్కువ. ఇది కొవిడ్‌ విషయంలో పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్‌. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటి కొవిడ్‌ నియమాలు పాటించడంలో పెద్దలతో పోలిస్తే

పిల్లలు ఇలా సురక్షితం

కరోనా మూడో వేవ్‌ గురించిన భయాలు మొదలయ్యాయి!

దాని లక్ష్యం పిల్లలే అనే వార్తలు పెద్దలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి!

దీన్లో నిజం ఎంత? పిల్లలను కాపాడుకోవాలంటే ఎలా నడుచుకోవాలి?


పిల్లలకు కొవిడ్‌ సోకినా ఆ ఇన్‌ఫెక్షన్‌ ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలు తక్కువ. ఇది కొవిడ్‌ విషయంలో పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్‌. అయితే మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటి కొవిడ్‌ నియమాలు పాటించడంలో పెద్దలతో పోలిస్తే, పిల్లల్లోనే అలసత్వం ఎక్కువ. ఇది కొవిడ్‌ విషయంలో పిల్లలకు ఉండే దుష్ప్రయోజనం. కాబట్టి ఇంటికే పరిమితమైన సమయంలో పిల్లలు ఎంత సురక్షితంగా ఉన్నారో, ఆరుబయట ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి ఆడుకునేటప్పుడు, పెద్దలతో మసలేటప్పుడూ అంతే జాగ్రత్తగా వ్యవహరించేలా పిల్లలకు శిక్షణ ఇవ్వడం అవసరం. 


మాస్క్‌ సౌకర్యవంతంగా...

పిల్లలకు కొవిడ్‌ నియమాల పట్ల అవగాహన ఉన్నా, వాటిని తూచతప్పక పాటించే విషయంలోనే తప్పులు చేస్తూ ఉంటారు. ఇంటి బయట అడుగు పెట్టబోయే ప్రతిసారీ మాస్క్‌ ధరించడం పిల్లలకు అలవాటు చేయాలి. ముఖ్యంగా మాస్క్‌ పిల్లలకు సౌకర్యంగా ఉండేలా పెద్దలు చూసుకోవాలి. మాస్క్‌ ముక్కును, నోటినీ సమంగా కప్పి ఉంచేలా ఉందో, లేదో చూసుకోవాలి. మాస్క్‌ జారిపోకుండా చెవులకు తగిలించే హ్యాంగర్ల ఎలాస్టిసిటీని పరీక్షించాలి. మాస్క్‌ ధరించేటప్పుడు, తీసేటప్పుడు వాటి హ్యాంగర్లనే తాకేలా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. పొరపాటున కూడా మాస్క్‌ ముందరి భాగాన్ని చేతులతో తాకకూడదని పిల్లలకు చెప్పడం అవసరం.


ఈ జాగ్రత్తలు కీలకం

పెద్దలతో పాటు పిల్లలు కూడా కొవిడ్‌ గురించి వింటున్నారు, చూస్తున్నారు. అయినా ఆ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే ఆరోగ్య నష్టాలను వారికి వివరించడం పెద్దల బాధ్యత. ఎందుకు మాస్క్‌ ధరించడం అవసరమో, సామాజిక దూరం ఉపయోగాలేంటో పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. 


ఆరుబయట ఆడుకునే సమయాల్లో పిల్లలతో సన్నిహితంగా మెలగవద్దని  పిల్లలకు చెప్పాలి

తినుబండారాలను తోటి పిల్లలతో పంచుకోవద్దని చెప్పాలి.

ఆరుబయట ఆటలే తప్ప, తలుపులు, కిటికీలు మూసి ఉన్న ఇరుకు గదుల్లో ఆటలు ఆడుకోకుండా చూడాలి.

తోటి పిల్లలతో అన్ని సందర్భాల్లో భౌతిక దూరం పాటించడం అవసరమని చెప్పాలి.

వీలైనంతవరకూ పుస్తకాలు, పెన్నులు, బొమ్మలు, ఆటవస్తువులను తోటి పిల్లలతో పంచుకోకూడదని చెప్పాలి.


ఇల్లే బడి!

ఆన్‌లైన్‌ పాఠాలు మరికొంత కాలం పాటు కొనసాగబోతున్నాయి. దాంతో కంప్యూటర్లతో పిల్లలు గడిపే వేళలు పెరుగుతాయి. పెరిగే స్ర్కీన్‌ టైమ్‌ ప్రభావాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే తల్లితండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


యాంటీగ్లేర్‌: ఏ వయసు పిల్లలైనా ఆన్‌లైన్‌ పాఠాలు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా యాంటీగ్లేర్‌ కళ్లజోడు ధరించేలా చూసుకోవాలి. కళ్లు మండుతున్నట్టు చెప్పినా, నీరు కారుతున్నట్టు గమనించినా కళ్లు శ్రమకు గురవుతున్నాయని గ్రహించాలి. కళ్లు ఆర్పకుండా ఎక్కువ సమయం స్ర్కీన్లను చూడడం వల్ల కనుగుడ్లు పొడిబారతాయి. కాబట్టి తరచుగా కళ్లు ఆర్పడం మర్చిపోవద్దని పిల్లలకు చెప్పాలి.


ఒకే ప్రదేశం: డెస్ట్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ ఎలాంటి కంప్యూటర్‌ వాడుతున్నా, ఆన్‌లైన్‌ పాఠాలకు హాజరయ్యే ప్రదేశం ఒకటే ఉండాలి. అలాగే కంప్యూటర్‌ టేబుల్‌, కుర్చీల ఎత్తులు సరిచూసుకోవాలి. పిల్లలు అవసరానికి మించి తలను ముందుకు చాపి పాఠాలు వింటున్నా, అవసరానికి మించి జారిగిలబడి కూర్చున్నా శరీర భంగిమల్లో తేడాలు చోటుచేసుకుని మెడ, భుజాల్లో నొప్పులు తలెత్తవచ్చు.


నియమిత వేళలు: ఇంటిపట్టున ఉంటున్నా, బడి వేళల్లో భోజన సమయాలనే కొనసాగించాలి. బడికి వెళ్లే రోజుల్లో ఎలా సమయపాలనతో నడుచుకున్నారో దాన్నే ఇంట్లో కూడా పిల్లలు కొనసాగించేలా చూడాలి.


ఆహారం: ఇంటిపట్టున ఉంటున్న పిల్లల కోసం చిరుతిళ్లు అందుబాటులో ఉంచడం సహజం. అయితే వాటితో కడుపు నింపుకుంటూ పిల్లలు భోజనాలను మానేయకుండా చూసుకోవాలి. ఆకుకూరలు, కనీసం ఐదు రకాల కూరగాయలు, పళ్లు ప్రతి రోజూ ఆహరంలో ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆన్‌లైన్‌ ఆర్డర్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. 


వ్యాయామం: పిల్లలకు ఆటలతో వ్యాయామం దక్కుతుంది. అయితే ఇంట్లో ఆటలకు వీలుండదు కాబట్టి స్కిప్పింగ్‌, స్పాట్‌ జాగింగ్‌ లాంటి వ్యాయామాలు చేయించాలి. వీలైతే పిల్లల వ్యాయామాల్లో పెద్దలూ పాల్గొనాలి.


ఇండోర్‌ గేమ్స్‌: ఔట్‌డోర్‌ గేమ్స్‌ ద్వారా కొవిడ్‌ వ్యాపించే అవకాశాలు తక్కువ. కాబట్టి ఆటల విషయంలో వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.


సొంత వాహనాలు: సొంత కారు ఉంటే, దాన్ని ఇతరులకు అరువివ్వడం లాంటివి చేయకూడదు. కుటుంబసభ్యులు మినహా, ఇతరులకు కారులో చోటు కల్పించకపోవడమే ఉత్తమం. అలాగే క్రమంతప్పక కారు లోపలి భాగాలను శుభ్రం చేస్తూ ఉండడం కూడా అవసరమే!


ఈ మాస్క్‌లు  ఉత్తమం

పిల్లలకు డిస్పోజబుల్‌ సర్జికల్‌ మాస్క్‌ లేదా మెల్ట్‌ గ్లోన్‌ లేయర్‌ కలిగిన మూడు పొరల క్లాత్‌ మాస్క్‌ వాడాలి. సర్జికల్‌  మాస్కుల్లో వైరస్‌ను అడ్డుకోగలిగే మెల్ట్‌ గ్లోన్‌ లేయర్‌ ఉంటుంది. ఒకవేళ క్లాత్‌ మాస్క్‌ వాడాలనుకుంటే, మెల్ట్‌ గ్లోన్‌ లేయర్‌ కలిగి ఉండే, మూడు పొరల మాస్క్‌నే పిల్లలు ధరించేలా చూసుకోవాలి. ఊపిరి వల్ల మాస్క్‌ లోపల తేమ చేరి, ఫంగస్‌, ఇతరత్రా సూక్ష్మక్రిములు పెరిగే వీలు కూడా ఉంటుంది. పైగా సూక్ష్మక్రిములు చేరడం వల్ల పిల్లలకు ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మళ్లీ మళ్లీ వాడే వీలున్న క్లాత్‌ మాస్క్‌లను తప్పనిసరిగా ప్రతి రోజూ శుభ్రం చేయాలి.


త్వరలో పిల్లల వ్యాక్సిన్‌

పెద్దలతో సమానంగా పిల్లలకూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ దిశగా ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికాలో 12 నుంచి 18 ఏళ్ల పిల్లల కోసం ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 3 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ మొదలయ్యాయి. అక్టోబర్‌కి ట్రయల్స్‌ ముగిసి, ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో కూడా భారత్‌ బయోటెక్‌లో పిల్లల వ్యాక్సిన్‌ ప్రయోగాలు నడుస్తున్నాయి. ఈ ఫలితాలు కూడా అక్టోబరుకు వెల్లడవుతాయి. ఆ ఫలితాలను బట్టి దుష్ప్రభావాలు లేవని నిర్ధారించుకున్న వెంటనే ఈ వ్యాక్సిన్లు పిల్లలకు అందుబాటులోకి వస్తాయి.


ఎంతో కాలం సాగదు

వందేళ్ల క్రితం ఇన్‌ఫ్లుయోంజా ఎపిడమిక్‌ను ఎదుర్కొన్నాం. ఇది కూడా ఒకదానివెంట ఒకటిగా నాలుగు వేవ్‌ల రూపంలో వేధించి, నెమ్మదిగా సద్దుమణిగిపోయింది. కాబట్టి కరోనా వైరస్‌ విస్తృతి కూడా ఇదే తరహాలో సద్దుమణిగే వీలూ లేకపోలేదు. 


అది అపోహ

రాబోయే థర్డ్‌ వేవ్‌ పిల్లలే లక్ష్యంగా దాడి చేస్తుందనే వార్తలు వింటున్నాం. కానీ ఇది నిజం కాదు. నిజానికి మొదటి, సెకండ్‌ వేవ్స్‌లో కూడా 8% నుంచి 10% మంది పిల్లలు కొవిడ్‌ బారిన పడ్డారు. మున్ముందు కూడా ఇదే తరహా పరిస్థితి ఉండవచ్చు. అంతే తప్ప పిల్లలే ఎక్కువగా ప్రభావానికి గురవుతారు అనేది అపోహ మాత్రమే! 


డెల్టా ప్లస్‌ వేరియెంట్‌తో భయం వద్దు!

డెల్టా వేరియెంట్‌ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌కు కారణం. ఈ వేరియెంట్‌ గత ఏడాది దాడిచేసిన వైరస్‌ కంటే తీవ్రమైనది. మొదటి వేవ్‌లో 20 లేదా 30 నిమిషాలు కొవిడ్‌ సోకిన వ్యక్తితో గడిపినప్పుడే ఇతరులకు వైరస్‌ వ్యాప్తి ఉండేది. కానీ సెకండ్‌ వేవ్‌ వైరస్‌ తత్వం వేరు. ఈ డెల్టా వైరస్‌ అంతకంటే తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతోంది. కుటుంబంలో ఒక్కరికి సోకినా, త్వరితంగా కుటుంబం మొత్తానికీ సోకుతోంది. మున్ముందు రాబోతున్న థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ మునుపటి వైరస్‌ల మిశ్రమ వేరియెంట్‌. దీని పేరు డెల్టా ప్లస్‌. ఇప్పటికే పటు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ తత్వం గురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు. అయితే వ్యాధి నిరోధకశక్తిని దాటుకుని మరీ వ్యాధి గ్రస్థం చేసే సామర్ధ్యం కొంతమేరకు ఈ వైరస్‌కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి మరింత అప్రమత్తంగా నడుచుకోవాలి.


డాక్టర్‌ ప్రీతమ్‌ కుమార్‌ రెడ్డి,

నియోనాటాలజిస్ట్‌ అండ్‌ పిడియాట్రీషియన్‌,

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.

Updated Date - 2021-07-06T17:20:58+05:30 IST