రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టనుంది. మన దేశంలో కరోనా రాకముందు నుంచే ఆర్థిక వ్యవస్థ సరిగా లేదు. నిరుద్యోగం ప్రబలి ఉంది. ప్రగతి వేగం తగ్గింది. అదనంగా వచ్చిన కరోనా విలయం వల్ల లక్షలాది మంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారు. ఎక్కువమందికి ఉపాధి కల్పించే ఇన్ఫార్మల్ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఉపాధి అవకాశాలు తగ్గడమే కాకుండా ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచం మీద పిడుగులా పడింది. ఇప్పటికే తీవ్ర నష్టం కలుగజేసింది. మరింత నష్టం వైపు ప్రపంచాన్ని నెట్టుతూ కొనసాగుతోంది. రష్యాపై ఆర్థిక ఆంక్షల వల్ల అటు రూబుల్ పతనమవ్వడమే కాకుండా క్రూడాయిల్ ధరలు, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆయా దేశాలపై భారత్ వంటనూనెల కోసం విపరీతంగా ఆధారపడడం వల్ల వాటి ధరలకు రెక్కలొస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంధనం, వంటనూనెల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగక తప్పదు. ప్రభుత్వం వాటి భారాన్ని అలాగే ప్రజలకు బదిలీ చేద్దామని భావించకుండా ఊరట ఇవ్వాలి. సంపన్నులకు కొంత మేరకు సర్ఛార్జీలు విధించి అయినా సామాన్య ప్రజలపై భారం తగ్గించాలి.
డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం