చుట్టుముట్టి దాడి చేశారు

ABN , First Publish Date - 2020-07-07T07:37:05+05:30 IST

అమావాస్యకు ముందు నాటి దశమి రోజున.. రాత్రిపూట కటిక చీకటి.. ఎత్తైన శిఖర ప్రాంతం.. అతిశీతల పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు...

చుట్టుముట్టి దాడి చేశారు

  • గల్వాన్‌లో ప్రణాళికతోనే చైనా ఘర్షణ


న్యూఢిల్లీ, జూలై 6: అమావాస్యకు ముందు నాటి దశమి రోజున.. రాత్రిపూట కటిక చీకటి.. ఎత్తైన శిఖర ప్రాంతం.. అతిశీతల పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు.. నిరాయుధులైన భారత సైనికులను చుట్టుముట్టి, మేకులు కొట్టిన కర్రలు, ఇనప రాడ్‌లతో దాడి చేశారు. గత నెల 15న చైనా సైనికుల దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆ రోజు ఏం జరిగింది? అనే అంశంపై ‘రాయిటర్స్‌’ ప్రతినిధులు పరిశోధించారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సంబంధించి 13 మందితో, 16వ బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు సైనికులతో మాట్లాడారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. గల్వాన్‌లోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 వద్ద భారత్‌కు చెందిన రెండు టెంట్లు, ఒక వాచ్‌టవర్‌పై చర్చలకు పీఎల్‌ఏ సైన్యం పిలవడంతో.. కమాండింగ్‌ అధికారి కర్నల్‌ సంతో్‌షబాబు, తన సిబ్బందితో కలిసి నిరాయుధులుగా అక్కడకు వెళ్లారు. చైనా సైన్యం.. ఆ వెంటనే దాడికి పాల్పడింది. మనవాళ్లు కూడా ప్రతిదాడి చేశారు. అయితే.. అక్కడ మనవాళ్ల కంటే చైనా సైనికుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా, భారత్‌లో పెట్టుబడులకు సిద్ధమైన 50 చైనా కంపెనీల ప్రతిపాదనలపై భారత్‌ సమీక్షిస్తోందని రాయిటర్స్‌ మరో కథనంలో పేర్కొంది. ఏప్రిల్‌లో ఈ ప్రతిపాదనలను పంపిందని, వాటిపై చైనా కంపెనీలు కూడా ఇప్పుడు డైలమాలో ఉన్నాయని పేర్కొంది. తూర్పు భూటాన్‌లోని సాక్‌టెంగ్‌ అభయారణ్యంపై కన్నేసిన చైనా.. ఇప్పుడప్పుడే దాన్ని వివాదం చేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఏవిధంగా చూసినా.. చైనా దాదాపు తన సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్‌టెంగ్‌ అభయారణ్యం తనదేనని చెప్పుకోవడానికి ఆధారాలు లేవు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళం, వైమానిక దళం విన్యాసాలపై చైనా మండిపడింది. దూరాలోచనతోనే అమెరికా ఈ చర్యకు ఒడిగట్టిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జో లిజియాన్‌ ఆరోపించారు.


Updated Date - 2020-07-07T07:37:05+05:30 IST