చైనాలో మరో వింత పరిణామం.. కరోనాతో అల్లాడిపోయిన ఆ దేశంలో మరో గుబులు..!

ABN , First Publish Date - 2021-05-26T18:04:23+05:30 IST

చైనా.. ఈ దేశం పేరు చెబితేనే ప్రపంచ దేశాలకు ప్రస్తుతం కరోనా మహమ్మారే గుర్తుకు వస్తోంది. వూహాన్‌ నగరంలో మొదలైన కరోనా కేసుల వరద అతి కొద్ది సమయంలోనే ప్రపంచాన్ని చుట్టేసింది.

చైనాలో మరో వింత పరిణామం.. కరోనాతో అల్లాడిపోయిన ఆ దేశంలో మరో గుబులు..!

బీజింగ్: చైనా.. ఈ దేశం పేరు చెబితేనే ప్రపంచ దేశాలకు ప్రస్తుతం కరోనా మహమ్మారే గుర్తుకు వస్తోంది. వూహాన్‌ నగరంలో మొదలైన కరోనా కేసుల వరద అతి కొద్ది సమయంలోనే ప్రపంచాన్ని చుట్టేసింది. అన్ని దేశాల్లోనూ అల్లకల్లోలం సృష్టించింది. కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ ఆ దేశాన్ని ఆరోపణలు, అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా డ్రాగన్ దేశంలో మరో ఆశ్చర్యకర పరిణామం జరగబోతోంది. మూడు నాలుగేళ్లలోనే తమకు మాత్రమే సొంతమైన ఓ ఘనతను చేజార్చుకోవాల్సి వస్తుందేమోనని  ఆ దేశంలో గుబులు మొదలైంది. ఇంతకీ అసలు విషయం ఏంటనే కదా మీ డౌటు. చైనా పేరు చెప్పగానే కరోనాతోపాటు ‘అత్యధిక జనాభా కలిగిన దేశం’ అనే విషయం కూడా గుర్తుకు రాక మానదు. ఇప్పుడు ఆ ట్యాగ్‌లైనే చైనా నుంచి చేజారబోతోందని అక్కడి నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే వరుసగా మూడు నాలుగేళ్లు కొనసాగితే ‘అత్యధిక జనాభా కలిగిన దేశం’ అనే ఘనతను భారత్‌కు ఇచ్చేయాల్సి వస్తుందేమోనని చైనా నిపుణులు ఆందోళన చెందుతున్నారట. నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండటం, మరణాల రేటు పెరుగుతుండటమే వారి ఆందోళనకు ప్రధాన కారణం. ఒకప్పుడు మరణాల రేటు కంటే జననాల రేటు రెండు మూడింతలు ఉండేదట. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మరణాల రేటుకు, జననాల రేటుకు వ్యత్యాసం ఉంటోదని చైనా అధికారులు వాపోతున్నారు. చైనా పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లు మాత్రమే. అదే భారత్‌లో ఇప్పటికే సుమారు 138 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే 2025 నాటికి అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్ సులభంగా దాటేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఇలా చైనాలో జనాభా తగ్గిపోవడానికి కారణమేంటి..? చైనాలో అసలేం జరుగుతోంది..?


చైనాలో గతేడాది అంటే 2020వ సంవత్సరంలో 1.2 కోట్ల మంది పిల్లలు పుట్టారు. అంతకుముందు సంవత్సరం అంటే 2019లో ఈ సంఖ్య 1.465 కోట్లు. అంటే 2019 నుంచి 2020కి వచ్చే సరికి జననాల సంఖ్య 18శాతం తగ్గిపోయింది. గర్భధారణ రేటు కూడా కేవలం 1.3 శాతానికి పడిపోయిందట. కానీ ఒక దేశంలో వయసైపోయిన పెద్దవారి స్థానాన్ని భర్తీ చేయడం కోసం మరో బిడ్డ కావాలి. ఈ లెక్కన దేశం జననాల రేటు కనీసం 2.1 ఉండాలి. ఇది కూడా చైనాలో లేదు. ఇదే కొనసాగితే ఆ తర్వాత చైనాలో యువకుల సంఖ్య తగ్గిపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1953 నుంచి చూసుకున్నా గడిచిన నాలుగేళ్లలో చైనాలో జననాల రేటు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2010లో చైనా జనాభా 134 కోట్లు. 2021లో ఈ జనాభా 141కోట్లకు చేరింది.  అంటే గడిచిన ఏడాదిలో దేశ జనాభా కేవలం 5.34శాతమే పెరిగిందన్నమాట.


చైనా జనాభాలో పనిచేసే వ్యక్తులు అంటే 15 నుంచి 59 మధ్య వసున్న వారు 89.43కోట్లు ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 63.5శాతం.  60ఏళ్లు పైబడిన వారి శాతం కూడా గతంతో పోల్చుకుంటే 5.44శాతం పెరిగింది. వీరి శాతం దేశ జనాభాలో 26.4కోట్లు లేదా 18.7 శాతం అని తెలుస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చైనాకు కొంత ఊరటనిచ్చే విషయం ఈ దేశంలో 14 అంతకన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య 25.38 కోట్లు ఉంది. ఇది దేశ జనాభాలో 17.95శాతం. చైనాలో ఇంతకు ముందున్న ‘ఒక్క పిల్లాడు ముద్దు. ఇద్దరు పిల్లలు వద్దు’ అంటూ ఒక పిల్లాడికే అనుమతులిస్తూ చేసిన చట్టాన్ని సడలించడం కూడా బాలుర సంఖ్య పెరగడానికి దోహదపడిందనే చెప్పాలి. అయితే 1970 నుంచి అమల్లోకి వచ్చిన ‘ఒకే బిడ్డ’ నిబంధన వల్ల 40కోట్ల మంది పుట్టకుండా ఆపినట్లు అధికారులు చెప్పారు. దీని వల్ల దేశంలో కరువు, నీటి కొరత సమస్యలు తలెత్తకుండా నిలువరించిందని నిపుణుల మాట.


చైనాలో ఇదే పరిస్థితి కొనసాగితే కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశ జనాభా తగ్గిపోవడం మొదలవుతుందట. మూడు నాలుగేళ్లలో అత్యధిక జనాభా ఉన్న దేశం అనే ట్యాగ్‌లైన్‌ను భారత్‌కు సమర్పించుకోవడం ఖాయమని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే చైనా ప్రభుత్వం మాత్రం దీన్ని ఏమాత్రం అంగీకరించడం లేదు. 2027వ సంవత్సరం నాటికి దేశ జనాభా అత్యున్నత స్థాయికి చేరుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అలాగే వార్షిక మరణాలు జననాల మధ్య తేడా కూడా వచ్చే ఐదేళ్లలో 10లక్షలకు తగ్గిపోతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, 2030 తర్వాత నుంచి చైనా జనాభా తగ్గిపోవడం మొదలవుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. కొందరు నిపుణులు మరో అడుగు ముందుకేసి వచ్చే ఏడాది నుంచే చైనా జనాభా తగ్గిపోవడం మొదలు కావొచ్చని అంటున్నారు. ఒక వేళ దేశంలో జననాలు కోటికి తగ్గి, మరణాలు కోటిపైగా ఉంటే చైనా జనాభా తగ్గుదల చాలా త్వరగా మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని వాళ్లు చెప్పారు.


ఇలా ఒక్క చైనాలోనే కాదు. చాలా ఆసియా దేశాల్లో జనాభా తగ్గుతున్న ట్రెండ్ కనబడుతోంది. గతేడాది దక్షిణ కొరియాలో చరిత్రలోనే అతిపెద్ద జనాభా తగ్గుదల నమోదయింది. అమెరికాలో కూడా ఇలానే జరుగుతోంది. ఇక్కడ జననాల రేటు రికార్డు స్థాయిలో 1.6శాతానికి చేరింది. ఇలా జనాభా తగ్గడం వల్ల సదరు దేశంలో ఆర్థిక వ్యవధి సమస్యలు ఎదుర్కొంటుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ అయిన చైనా అయినప్పటికీ.. ఈ దేశం మధ్యతరగతి ఆదాయం వచ్చే ఆర్థిక వ్యవస్థగా మిగిలింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లలు కనడం కోసం జంటలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించడం గమరార్హం. చైనా కనుక తొందరపడి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ దేశం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-05-26T18:04:23+05:30 IST