పక్కలో బల్లెం!

ABN , First Publish Date - 2022-08-19T06:07:41+05:30 IST

హిందూ మహాసముద్రంలో భారత్‌కు చైనా నుంచి పెను గండమే పొంచి ఉంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టులో క్షిపణి ట్రాకింగ్‌ నిఘా నౌకను మోహరించిన డ్రాగన్‌.. తాజాగా ఆఫ్రికాలోని జిబౌటీ దేశంలో తన సైనిక స్థావరాన్ని సిద్ధం..

పక్కలో బల్లెం!

జిబౌటీలో చైనా సైనిక స్థావరం రెడీ

యుద్ధనౌక సైతం మోహరింపు

విదేశాల్లో ఇదే తొలి మిలిటరీ బేస్‌

ఇటు శ్రీలంక పోర్టులోనూ నిఘా నౌక

హిందూ మహాసముద్రంలో భారత్‌కు పెనుముప్పు


న్యూఢిల్లీ, ఆగస్టు 18: హిందూ మహాసముద్రంలో భారత్‌కు చైనా నుంచి పెను గండమే పొంచి ఉంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌టోట పోర్టులో క్షిపణి ట్రాకింగ్‌ నిఘా నౌకను మోహరించిన డ్రాగన్‌.. తాజాగా ఆఫ్రికాలోని జిబౌటీ దేశంలో తన సైనిక స్థావరాన్ని సిద్ధం చేసేసింది. 2016 నుంచి దీని నిర్మాణానికి 59 బిలియన్‌ డాలర్లు వ్యయం చేసింది. ఈ స్థావరం ఇప్పుడు పూర్తిస్థాయిలో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ ఏకంగా యుజావ్‌ క్లాస్‌ ల్యాండింగ్‌ నౌక (టైప్‌ 071 యుద్ధనౌక)ను చైనా మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తేలింది. హిందూ మహాసముద్రంలో యుద్ధనౌకలను రంగంలోకి దించడానికి ఈ నౌకా స్థావరం దానికి పూర్తిగా ఉపకరించనుంది. ఆఫ్రికన్‌ దేశమైన జిబౌటీ.. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, ఎర్ర సముద్రానికి మధ్యన గల వ్యూహాత్మక బాబ్‌-ఎల్‌-మండెబ్‌ జలసంధి వద్ద ఉంది.


అంతర్జాతీయ సముద్ర జలమార్గం సూయజ్‌ కెనాల్‌కు ఈ జలసంధి రక్షణగా ఉంది. ఇక్కడి చైనా స్థావరం దుర్భేద్యంగా ఉందని.. మధ్యయుగంలో మాదిరిగా వివిధ రక్షణ శ్రేణులను సిద్ధం చేసిందని.. ప్రత్యక్ష దాడిని సైతం తట్టుకునేలా డిజైన్‌ చేసిందని నౌకాదళ విశ్లేషకుడు, కోవర్ట్‌ షోర్స్‌కు చెందిన హల్‌ సుటన్‌ తెలిపారు. నిర్మాణ పనులు ఇంకా చాలానే జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ స్థావరం పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందని భారత నౌకాదళ మాజీ వైస్‌ అడ్మిరల్‌ శేఖర్‌ సిన్హా తెలిపారు. బ్రేక్‌వాటర్‌కు ఇరువైపులా నౌకలను మోహరించే అవకాశం ఉందని.. జెట్టీ వెడల్పు ఇరుకుగా ఉన్నప్పటికీ చైనా హెలికాప్టర్‌ వాహక నౌక అవలీలగా అక్కడకు వెళ్లగలదని చెప్పారు. అక్కడప్రస్తుతం చైనా మోహరించిన యుద్ధనౌక పేరు చాంగ్‌బాయ్‌ షాన్‌. 25 వేల టన్నుల బరువు ఉంటుంది. 800 మంది సైనికులు, భారీ ట్యాంకులు, ట్రక్కులతో పాటు యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను, హోవర్‌క్రా్‌ఫ్టను మోసుకెళ్లగలదు.


అప్పులిచ్చి కబళింపు..

 జిబౌటీకి చైనా పెద్దఎత్తున అప్పులిచ్చింది. జిబౌటీ దీనిని చెల్లించలేక అక్కడ మిలిటరీ స్థావరం ఏర్పాటుచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. శ్రీలంకదీ ఇదే పరిస్థితి. హంబన్‌టోట పోర్టు అభివృద్ధికి చైనా 1.7 బిలియన్‌ డాలర్ల రుణమిచ్చింది. శ్రీలంక చేతులెత్తేయడంతో ఆ పోర్టును 99 ఏళ్లపాటు లీజుగా తీసుకుంది. ఇక్కడ తన శాటిలైట్‌-మిసైల్‌ ట్రాకింగ్‌ నౌక యువాన్‌ వాంగ్‌-5ను మోహరిస్తానని శ్రీలంకు చైనా ఇటీవల సమాచారమిచ్చింది.మంగళ-బుధవారాల్లో అది రానే వచ్చింది. విదేశీ ఉపగ్రహాలను, వైమానిక  స్థావరాలను, క్షిపణి వ్యవస్థలను ఈ నిఘా నౌక ట్రాక్‌ చేయగలదు.


భారత నిఘా వ్యవస్థలపై డ్రాగన్‌ కన్ను

 సరిహద్దుల్లో భారత్‌-చైనా సరిహద్దు సంక్షోభానికి ఇప్పట్లో పరిష్కారం లభించే అవకాశం లేదని.. ఇప్పుడు ఈ నౌక ద్వారా భారత నిఘా వ్యవస్థలపై కన్నేసే చాన్సు చైనాకు లభించిందని ‘ఇంటెల్‌ ల్యాబ్‌’ రీసెర్చర్‌ డామియన్‌ సైమన్‌ వ్యాఖ్యానించారు. జిబౌటీలో మిలిటరీ స్థావరం ఏర్పాటు వ్యూహాత్మకమని.. పర్షియన్‌ గల్ఫ్‌లోని అమెరికా నౌకాదళ స్థావరాలతో పాటు హిందూమహాసముద్రంలో రెండో అతిపెద్ద నౌకాశక్తి అయిన భారత్‌ను కూడా చైనా టార్గెట్‌ చేసిందని భారత నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌ వెల్లడించారు. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్టు కూడా చైనా విస్తరణకు కీలకమన్నారు. హిందూ మహాసముద్రంలో ఇప్పటికే అణు జలాంతర్గాములను మోహరించిందని.. ఇప్పుడు యుద్ధవిమాన వాహకనౌకలను కూడా దించుతోందని తెలిపారు. హిందూ మహాసముద్రంలో చైనాను ఇక నిలువరించలేమని అమెరికా పసిఫిక్‌ కమాండ్‌ కమాండర్‌ అడ్మిరల్‌ హ్యారీ హ్యారిస్‌ జూనియర్‌ 2017లోనే స్పష్టం చేయడం గమనార్హం.

Updated Date - 2022-08-19T06:07:41+05:30 IST