వింటర్ ఒలింపిక్స్‌పై రాజకీయాలొద్దన్న పాకిస్థాన్.. ప్రశంసలు కురిపించిన చైనా

ABN , First Publish Date - 2021-12-13T21:58:46+05:30 IST

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, లిథువేనియా తదితర దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను

వింటర్ ఒలింపిక్స్‌పై రాజకీయాలొద్దన్న పాకిస్థాన్.. ప్రశంసలు కురిపించిన చైనా

బీజింగ్: మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, లిథువేనియా తదితర దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యబహిష్కరణ చేశాయి. ఫ్రాన్స్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ ఆయా దేశాల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.


క్రీడల్లో రాజకీయాలేంటని మండిపడింది. ఇలాంటి చర్యలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. తక్షణమే వీటికి పుల్‌స్టాప్ పెట్టి ఈ వేదికపై తమ దేశాల క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటే అవకాశం ఇవ్వాలని హితవు పలికింది. క్రీడల్లో రాజకీయాలు ఏ రూపంలో ఉన్నా వాటిని పాక్ సహించదంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ తేల్చి చెప్పారు. 


బీజింగ్ ఒలింపిక్స్ విషయంలో పాక్ చేసిన వ్యాఖ్యలపై చైనా ప్రశంసలు కురిపించింది. క్రీడలను రాజకీయం చేయొద్దన్న పాక్ ప్రకటనను ప్రశంసిస్తున్నట్టు పాకిస్థాన్‌లో చైనా రాయబారి నాంగ్ రోంగ్ పేర్కొన్నారు. వింటర్ ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక క్రీడాకారులకు అద్భుతమైన వేదిక అని స్పష్టం చేశారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ రాజకీయాలకు ఎంతమాత్రమూ కాదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమై అదే నెల 20న ముగుస్తాయి. 

Updated Date - 2021-12-13T21:58:46+05:30 IST