China: భారత విద్యార్థులకు చైనా తీపి కబురు.. రెండేళ్ల విరామం తర్వాత కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2022-08-23T13:11:52+05:30 IST

బీజింగ్‌లో కఠిన కొవిడ్‌ నిబంధనల కారణంగా రెండేళ్లుగా స్వదేశంలోనే ఉండిపోయిన భారత విద్యార్థులకు, వ్యాపారవేత్తలు, చైనాలో పనిచేస్తున్న వారి భారత భాగస్వాములకు చైనా శుభవార్త చెప్పింది.

China: భారత విద్యార్థులకు చైనా తీపి కబురు.. రెండేళ్ల విరామం తర్వాత కీలక నిర్ణయం!

బీజింగ్‌, ఆగస్టు 22: బీజింగ్‌లో కఠిన కొవిడ్‌ నిబంధనల కారణంగా రెండేళ్లుగా స్వదేశంలోనే ఉండిపోయిన భారత విద్యార్థులకు, వ్యాపారవేత్తలు, చైనాలో పనిచేస్తున్న వారి భారత భాగస్వాములకు చైనా శుభవార్త చెప్పింది. వారందరికీ తిరిగి వీసాలను జారీ చేసే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని తాజాగా వెల్లడించింది. ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఏషియన్‌ అఫైర్స్‌ విభాగం కౌన్సిలర్‌ జీ రాంగ్‌ ట్విటర్‌లో తెలిపారు. ‘‘భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ ఓపిక సత్ఫలితాలను ఇచ్చింది. చైనాకు తిరిగి స్వాగతం’’ అని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు వీసా జారీ ప్రక్రియ ప్రారంభమైనట్లు న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయ ప్రకటనలోని వివరాలు తన ట్వీట్‌తో పాటు ఆమె పోస్ట్‌ చేశారు. చైనాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు ఎక్స్‌1-వీసాను చైనా జారీ చేయనుంది. ప్రస్తుతం చైనాలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న సుమారు 23వేలమంది భారత విద్యార్థులు, తిరిగి చైనా వెళ్లేందుకు వేచిచూస్తున్నట్లు అంచనా. శ్రీలంక, పాకిస్థాన్‌, రష్యా సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికే చార్టర్డ్‌ విమానాల్లో చైనాకు చేరిపోవడం గమనార్హం. 


మరోవైపు.. భారత విద్యార్థుల్లో కొత్తగా చేరేవారు తమ అడ్మిషన్‌ లేఖను, తిరిగి వచ్చేవారు వర్సిటీ ఇచ్చిన ‘రిటర్నింగ్‌ టు క్యాంపస్‌’ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుందని చైనా స్పష్టం చేసింది. భారత్‌ నుంచి చైనాకు సరాసరి విమానాలు లేకపోవడం విద్యార్థులకు మరో సమస్యగా మారింది. రెండేళ్లలో తొలిసారిగా భారత వ్యాపారవేత్తలు ఒక చార్టర్డ్‌ విమానంలో తమ కుటుంబాలతో సహా ఇటీవల చైనాకు చేరుకున్నారు. ఇక చైనాలో పనిచేస్తున్నవారి కుటుంబీకులు ఇతర దేశాల నుంచి మరింత అదనంగా ఖర్చుపెట్టి ఇతర దేశాల మీదుగా చైనాకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య వైమానిక మార్గాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు రెండు దేశాల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. త్వరలోనే తిరిగి తమ విద్యను కొనసాగించేందుకు వీలు కలుగుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-23T13:11:52+05:30 IST