చైనాలోని జియాన్‌లో లాక్‌డౌన్.. రెండు రోజులకు ఒకసారే బయటకు!

ABN , First Publish Date - 2021-12-25T23:28:57+05:30 IST

కరోనా వైరస్ కట్టడిలో చైనాలో ఎంత అప్రమత్తంగా ఉంటుందో చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ. షాంగ్సీ ..

చైనాలోని జియాన్‌లో లాక్‌డౌన్.. రెండు రోజులకు ఒకసారే బయటకు!

బీజింగ్: కరోనా వైరస్ కట్టడిలో చైనాలో ఎంత అప్రమత్తంగా ఉంటుందో చెప్పేందుకు ఇది చక్కని ఉదాహరణ. షాంగ్సీ వాయవ్య ప్రావిన్స్‌లోని జియాన్ నగరంలో కేసుల అమాంతం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు గురువారం జియాన్‌లో కఠిన ఆంక్షలు విధించారు. క్రిస్మస్ రోజైన శనివారం ఇక్కడ 75 కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఒక్క రోజులో ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. ఇక, దేశంలో నేడు 140 కేసులు వెలుగుచూడగా అందులో 87 స్థానికంగా సంక్రమించినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. అంతకుముందు రోజు వీటి సంఖ్య 55గా ఉండడం గమనార్హం. 


కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో అప్రమత్తమైన అధికారులు జియాన్‌లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. గురువారం నుంచి నగరంలోని 13 మిలియన్ల మంది లాక్‌డౌన్‌లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా జనం అవస్థలు పడుతున్నారు. రెండు రోజులకోసారి ఒక కుటుంబం నుంచి ఒక్కరిని మాత్రమే సరుకులు తెచ్చుకునేందుకు బయటకు అనుమతిస్తున్నారు. ఒకవేళ నగరం విడిచి వెళ్లాలంటే మాత్రం అధికారుల అనుమతి తప్పనిసరి. జియాన్‌లో ఈ ఏడాది డిసెంబరు 9న తొలి కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం అక్కడ 330 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ స్థానికంగా వ్యాప్తి చెందినవేనని అధికారులు తెలిపారు.


మరోవైపు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెరుగుతున్న కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యుల ప్రారంభించింది. 2019లో చైనాలో కరోనా తొలి కేసు నమోదైన తర్వాత అక్కడ ఇప్పటి వరకు 1,00,871 కేసులు నమోదయ్యాయి. 5 వేల కంటే తక్కువగా మరణాలు నమోదయ్యాయి. 

Updated Date - 2021-12-25T23:28:57+05:30 IST