అమెరికా స్వార్థానికి ఉదాహరణ ఆఫ్ఘన్ పరిస్థితి : చైనా

ABN , First Publish Date - 2021-08-24T23:08:40+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా అస్తవ్యస్తంగా వెళ్లిపోవడాన్ని

అమెరికా స్వార్థానికి ఉదాహరణ ఆఫ్ఘన్ పరిస్థితి : చైనా

బీజింగ్ : ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా అస్తవ్యస్తంగా వెళ్లిపోవడాన్ని చైనా తప్పుబట్టింది. అరాజకంగా సైన్యాలను ఉపసంహరించుకోవడాన్నిబట్టి అమెరికా విదేశాంగ విధానం ఎంత స్వార్థపూరితమైనదో వెల్లడవుతోందని దుయ్యబట్టింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ మంగళవారం సింగపూర్‌లో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. 


కమల హారిస్ మంగళవారం సింగపూర్‌లో పర్యటించారు. ఆసియా దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ పర్యటన సాగుతోంది. తన ప్రభుత్వ విదేశాంగ విధానాలను వివరిస్తూ, ఆసియా పట్ల తాము నిబద్ధతతో వ్యవహరిస్తామన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అత్యధిక భాగం తమదేనని చైనా బెదిరిస్తోందన్నారు. నిబంధనల ఆధారిత ప్రపంచ వ్యవస్థను చైనా అణగదొక్కుతోందన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. ఈ ముప్పు, బెదిరింపులను ఎదుర్కొంటున్న తన భాగస్వాములు, మిత్రులకు అమెరికా అండగా ఉంటుందన్నారు. 


ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, అమెరికా తన బెదిరింపులు, ఆధిపత్య ధోరణిని సమర్థించుకోవడం కోసం నిబంధనల ఆధారిత ప్రపంచ వ్యవస్థ అనే మాటల చాటున దాక్కుంటోందని దుయ్యబట్టారు.  అమెరికా ఎలాంటి రూల్స్, ఆర్డర్ గురించి మాట్లాడుతోందో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితి స్పష్టంగా వెల్లడిస్తోందన్నారు. అమెరికా కావాలని చొరవ చేసుకుని సార్వభౌమాధికారం గల దేశాల్లో సైనిక జోక్యం చేసుకుంటుందన్నారు. ఆయా దేశాల ప్రజల బాధల గురించి పట్టించుకోదన్నారు. ‘‘అమెరికాకు పెద్ద పీట’’ను సమర్థించుకోవడం కోసం ఆ దేశం నిరంకుశంగా ఇతర దేశాలను అణచివేస్తోందని, నిర్బంధిస్తోందని, బెదిరిస్తోందని, ఇందుకు ఎటువంటి మూల్యం చెల్లించడం లేదని అన్నారు. ఇలాంటి వ్యవస్థను అమెరికా కోరుకుంటోందని, దానిని ఇక ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

 


Updated Date - 2021-08-24T23:08:40+05:30 IST