Whatsapp వాడే ముస్లిం మహిళలపై చైనా కొరడా.... ప్రీ క్రిమినల్స్‌గా లేబుల్

ABN , First Publish Date - 2021-10-12T22:49:24+05:30 IST

వాట్సాప్ వంటివాటిని వాడే ముస్లింలపై చైనా కఠిన ఆంక్షలు అమలు

Whatsapp వాడే ముస్లిం మహిళలపై చైనా కొరడా.... ప్రీ క్రిమినల్స్‌గా లేబుల్

బీజింగ్ : వాట్సాప్ వంటివాటిని వాడే ముస్లింలపై చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. వీరిని ప్రీ-క్రిమినల్స్‌గా ముద్ర వేసి, రీ-ఎడ్యుకేషన్ క్లాస్‌కు పంపిస్తోంది. ఈ శిబిరాల్లో కొన్ని నెలలు ఉంచిన తర్వాత, కొన్ని షరతులు విధించి విడుదల చేస్తోంది. స్థానిక పరిసరాల్లోనే ఉండాలని, రెగ్యులర్‌గా సోషల్ స్టెబిలిటీ వర్కర్‌ను కలవాలని చెప్తోంది. తాజాగా విడుదలైన ‘‘ఇన్ ది కేంప్స్ : చైనాస్ హై టెక్ పీనల్ కాలనీ’’లో ఈ దారుణాలను వివరించారు. 


వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న వెరా ఝౌ అనే విద్యార్థిని ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకంలో తెలిపిన వివరాల ప్రకారం, చైనాలోని జింజియాంగ్‌లో నివసిస్తున్న ఆమె తన స్కూల్ జీమెయిల్‌ను వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లో ఓపెన్ చేసి, ఉపయోగించినందుకు ఆమెను నిర్బంధించి, ఆరు నెలలపాటు రీ-ఎడ్యుకేషన్ కేంప్‌లో ఉంచారు. చేతులపై నీయాన్ గ్రీన్ స్ట్రైప్స్ గల దుస్తులను ఆమె చేత ధరింపజేశారు. ఆమె థ్యాంక్స్ గివింగ్, క్రిస్టమస్, 2018 న్యూ ఇయర్ ఈ కేంప్‌లోనే గడపవలసి వచ్చింది. 


ఆరు నెలల తర్వాత అనేక షరతులు విధించి ఆమెను ఈ కేంప్ నుంచి విడుదల చేశారు. స్థానికంగానే ఉండాలని, రెగ్యులర్‌గా సోషల్ స్టెబిలిటీ వర్కర్‌ను కలవాలని ఆమెకు షరతులు విధించారు. విడుదలైన తర్వాత కూడా తాను డిజిటల్ జైలులో ఉన్నట్లు భావిస్తున్నానని ఝౌ చెప్పారు. తాను తన స్థానిక పరిసరాలు కాస్త దాటేసరికి సమీపంలోని మానిటర్ తనను ముస్లిం ప్రీ-క్రిమినల్‌గా గుర్తించిందని చెప్పారు. 


మానవ హక్కుల ఉద్యమకారులు చెప్తున్నదాని ప్రకారం, చైనాలో దాదాపు 10 లక్షల మంది వీఘర్లు, ఇతర ముస్లిం వర్గాలవారు కేంపులలో మగ్గిపోతున్నారు. ఈ కేంపులలో ఉండేవారి చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. 


ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఆపరేటర్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా అధికారులకు అందజేయాలని చైనా చట్టాలు చెప్తున్న విషయం గమనార్హం.

Updated Date - 2021-10-12T22:49:24+05:30 IST