చైనా ధనికులకు అలాంటి బాడీగార్డ్స్ మాత్రమే కావాలట!

ABN , First Publish Date - 2020-09-22T02:10:41+05:30 IST

చైనాలోని ధనవంతులు ఇప్పుడు మామూలు బాడీగార్డులను కోరుకోవడం లేదు. డిజిటల్ డార్క్ ఆర్ట్స్‌లో నైపుణ్యం కలిగిన బాడీగార్డులను

చైనా ధనికులకు అలాంటి బాడీగార్డ్స్ మాత్రమే కావాలట!

బీజింగ్: చైనాలోని ధనవంతులు ఇప్పుడు మామూలు బాడీగార్డులను కోరుకోవడం లేదు. డిజిటల్ డార్క్ ఆర్ట్స్‌లో నైపుణ్యం కలిగిన బాడీగార్డులను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఈ కళలో శిక్షణ పొందినవారికి ఇప్పుడు చైనాలో బోల్డంత డిమాండ్ ఉంది. అంతేకాదు, డిమాండ్‌కు సరిపడా గార్డులు దొరక్క ధనవంతులు ఇబ్బందులు పడుతున్నారు. 


తియాంజిన్‌లో ఉన్న ‘గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీ’లో ఇప్పుడు సాధారణ బాడీగార్డ్స్‌కు ఇచ్చే శిక్షణతోపాటు డిజిటల్ డార్క్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ ఇస్తారు. ఇలాంటి శిక్షణ ఇచ్చే సంస్థ చైనాలో ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సంపన్నులకు హ్యాకర్లతో అనుక్షణం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రంగంలోనూ శిక్షణ పొందిన గార్డుల కోసం చైనా సంపన్నులు క్యూ కడుతున్నారు.  


గెంఘిస్ సెక్యూరిటీ అకాడమీలో శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మిలటరీ శిక్షణ కంటే కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ప్రతిరోజు బ్లాక్ బిజినెస్ సూట్స్ ధరించి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు. సంప్రదాయ రక్షణ నైపుణ్యాలతోపాటు ఆయుధాలు, హైస్పీడ్ డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇస్తారు. ఈ అకాడమీ నుంచి ప్రతి సంవత్సరం వేయి మంది నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లు  సంపన్నల వద్ద ఉద్యోగులు పొందవచ్చన్న ఆశతో బయటకు వస్తున్నారు.  


ఒక్కో విద్యార్థి నుంచి 3 వేల డాలర్లను వసూలు చేస్తారు. దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మిలియనీర్ల డిమాండ్ తీర్చడం కష్టంగా ఉందని అకాడమీ పేర్కొంది. క్రెడిట్ సూయిస్ లెక్కల ప్రకారం చైనాలో  4.4 మిలియన్ల మంది మిలియనీర్లు ఉన్నారు.  తమ వద్ద శిక్షణ మిలటరీలో కంటే కఠినంగా ఉంటుందని అకాడమీ వ్యవస్థాపకుడు చెన్ యాంగ్‌కింగ్ తెలిపారు. తమ వద్ద చేరిన వారిలో దాదాపు సగం మంది గతంలో మిలటరీలో పనిచేసిన వారేనని చెన్ పేర్కొన్నారు. 


చైనాలో అత్యంత ధనికుల్లో రెండోవాడైన జాక్ మా నుంచి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ల వరకు రక్షించిన వారి గ్రాడ్యుయేట్ల ఫొటోలను అకాడమీ డైనింగ్ హాల్ గోడలపై ఉంటాయి. పూర్తిస్థాయిలో నిఘా ఉండే చైనాలో నేరాల రేటు తక్కువ. అయితే, ప్రొఫెషనల్ హ్యాకర్ల నుంచి ముప్పు మాత్రం ప్రతి క్షణం పొంచి ఉంటుంది. కాబట్టే ఇప్పుడు వాటి నుంచి కూడా రక్షించే బాడీగార్డులను చైనా సంపన్నులు కోరుకుంటున్నారు. 


‘‘మీరు ఫైట్ చేయాలని మీ బాస్ కోరుకోరు’’ అని చెన్ తన విద్యార్థులకు చెబుతుంటారు. ‘‘అకస్మాత్తుగా ఓ వీడియో ఫైల్‌ను ధ్వంసం చేయమని మీ బాస్ మిమ్మల్ని ఆదేశిస్తే మీరేం చేస్తారు?’’ అని విద్యార్థులను ప్రశ్నిస్తుంటారు. మొబైల్ ఫోన్, నెట్‌వర్క్ సెక్యూరిటీ హ్యాక్‌లను తిప్పికొట్టడం, రహస్యంగా తమ కార్యకలాపాల్ని గమనించే వారిని గుర్తించడం వంటివి ఈ అకాడమీలో శిక్షణ ఇస్తారు. దేహదారుఢ్యాన్ని పెంచి భౌతిక దాడులను ఎదుర్కోవడంతోపాటు, సైబర్ ముప్పును కూడా సమర్థంగా ఎదుర్కోవడంలో ఇక్కడి విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతామని చెన్ వివరించారు.  

Updated Date - 2020-09-22T02:10:41+05:30 IST