బయటపడిన చైనా గుట్టు!

ABN , First Publish Date - 2021-04-08T01:31:06+05:30 IST

చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) భాగస్వామ్య దేశాలకు

బయటపడిన చైనా గుట్టు!

బీజింగ్ : చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) భాగస్వామ్య దేశాలకు అసలు నిజాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. దాదాపు 140 దేశాల గుండా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా, ఇది తనతోపాటు దీనిలో పాలుపంచుకునే దేశాలకు కూడా లాభదాయకంగా ఉంటుందని చైనా ఆశపెట్టింది. కానీ ఈ సహాయంలో దయార్థ్రత లేదని పాకిస్థాన్, శ్రీలంక సహా జాంబియా, ఇథియోపియా, పపువా న్యూ గినియా వంటి దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. చైనా ప్రయత్నాలను స్వాగతించడానికి బదులుగా వేరే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా మల్టీ ట్రిలియన్ డాలర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ప్లాన్‌ను ప్రతిపాదించారు. 


బీఆర్ఐలో చేరిన దేశాల్లో చాలా దేశాలు తాము చైనా ఇచ్చిన అప్పును తిరిగి తీర్చడం చాలా కష్టమని గుర్తించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. హంబంటోట పోర్ట్‌ను చైనాకు 99 సంవత్సరాలకు లీజుకు ఇవ్వడం తప్పేనని శ్రీలంక పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రజాస్వామిక స్వేచ్ఛ, మానవ హక్కులు, పారదర్శకత వంటివాటిపై ప్రశ్నించడానికి వీల్లేని విధంగా చైనా వ్యవహరిస్తోందని పేర్కొంది. 


చైనీస్ బీఆర్ఐలో భాగస్వాములయ్యేందుకు అంగీకరించిన 100కు పైగా దేశాలు చైనా వ్యవహార శైలి వల్ల తమ సార్వభౌమాధికారం దెబ్బతింటుందని భయపడుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒప్పందాల్లో రుణాల వల, అసమానతలు చైనా ‘సహాయం’పై విపరీతమైన భయాందోళనకు కారణమవుతున్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-04-08T01:31:06+05:30 IST