Advertisement

423 మీటర్లు చొచ్చుకొచ్చిన చైనా

Jun 30 2020 @ 02:24AM

  • ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి.. నేడు కమాండర్‌ స్థాయి చర్చలు
  • జైశంకర్‌, గోయల్‌తో అమిత్‌ షా భేటీ

న్యూఢిల్లీ, జూన్‌ 29: గల్వాన్‌ లోయలో చైనా సైన్యం భారత్‌లోకి 423మీటర్లు చొచ్చుకుని వచ్చినట్లు ఉపగ్రహాల చిత్రాల ద్వారా వెల్లడవుతోంది. 1960లో చైనాయే పేర్కొన్న సరిహద్దు రేఖను దాటి 423మీటర్ల మేర ఆ దేశం దురాక్రమణకు పాల్పడింది. ఆ దేశంతో భారత్‌ మంగళవారం కమాండర్‌ స్థాయి చర్చలు జరపనుంది. ఇప్పటివరకూ జరిగిన రెండు దఫాల చర్చలు సరిహద్దుకు చైనా వైపున ఉన్న మోల్డోలో జరగగా.. తాజా చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో చోటుచేసుకోనున్నాయి. హిందూ మహా సముద్రంపై భారత్‌ నిఘాను పెంచింది. అమెరికా, జపాన్‌ నావికాదళాలతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేపట్టింది.


భారత యుద్ధనౌకలు ఐఎన్‌ఎ్‌స రాణా, ఐఎన్‌ఎ్‌స కులిష్‌ ఇందులో పాల్గొన్నాయి. గల్వాన్‌ లోయను ఆక్రమించి చైనా సైనికులు వేసిన గుడారం అంతుచిక్కని విధంగా అగ్నికి ఆహుతి అయిపోయిందని, అదే ఈ నెల 15న చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు కారణమని కేంద్రమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. తొలిసారి చర్చలు జరిగినప్పుడు గల్వాన్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాల సైనికులు ఉండరాదని ఒప్పందం జరిగిందని, చైనా సైనికులు మళ్లీ అక్కడకు చేరి గుడారం నిర్మించారని  పేర్కొన్నారు. అది ప్రశ్నించేందుకు భారత సైనికులు వెళ్లగా.. గుడారం అంతుచిక్కని రీతిలో అగ్నికి ఆహుతి అయిపోవడంతో ఘర్షణ మొదలైందన్నారు. 


పాక్‌ సోషల్‌ మీడియా విషప్రచారం

సోషల్‌ మీడియాలో పాక్‌ విషప్రచారానికి తెరతీసింది. పీవోకేలోని స్కర్దు, గిల్గిట్‌ విమానాశ్రయాలు రెండింటికీ కలిపి చైనా 50 జే-10 యుద్ధవిమానాల్ని మోహరించిందని పాక్‌కు చెందిన ట్విటర్‌ హ్యాండిళ్లు వదంతుల్ని వ్యాప్తి చేసున్నాయి. స్కర్దుకు గానీ, గిల్గిట్‌కు గానీ ఆ స్థాయిలో విమానాల్ని నిలిపేందుకు మౌలికవసతులు లేవు. స్కర్దులో కేవలం 8విమానాలకు మాత్రమే చోటుంది. గిల్గిట్‌లో విమానాలు లేవని ఈ నెల 24న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఇక, గల్వాన్‌లో భారీ సంఖ్యలో సైన్యాన్ని సమీకరించిన చైనాకు, అక్కడి నదీ ప్రవాహం అడ్డంకిగా మారింది. చైనా కొత్తగా నిర్మించిన రహదారులు నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. నదీతీరాన్ని కృత్రిమంగా చైనా తగ్గించినప్పటికీ.. దాన్ని కూడా గల్వాన్‌ నది తిరిగి కలిపేసుకున్నట్లు కనిపిస్తోంది. నదీతీరంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న చైనా సైన్యానికి, దక్షిణ ప్రాంతంలో ఉన్న సైన్యానికి మధ్య ప్రాంతంలోనూ నది ప్రవహిస్తుండటంతో.. ఇరు పక్షాలు విడివిడిగా ఉంటున్నాయి.


చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, చైనాలో స్థిరపడిన భారతీయుల పట్ల సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శత్రుదేశాన్ని విడిచి స్వదేశానికి వచ్చేయాలంటూ నెటిజన్లు  డిమాండ్‌ చేస్తున్నారు. తమకు భారత్‌ పట్ల మమకారం పోదని, జీవన భృతి కోసం చైనాలో ఉన్నంత మాత్రాన దేశద్రోహులం ఎలా అవుతామని చైనాలోని భారతీయులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా.. చైనాలోని రిజర్వు బలగాలు జిన్‌పింగ్‌ అధీనంలోకి చేరాయి. ఇన్నాళ్లూ ఇవి మిలిటరీతో పాటు స్థానిక కమ్యూనిస్టు పార్టీ కమిటీల అధీనంలో ఉండేవి. ప్రపంచస్థాయి సైన్యాన్ని తయారుచేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.


నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌ చేసింది. అన్‌లాక్‌ 2.0పై కేంద్రం మార్గదర్శకాలు, 59 చైనా యాప్‌లపై నిషేధ ప్రకటన సోమవారం వెలువడిన నేపథ్యంలో నేడు జాతినుద్దేశించి ప్రధాని చేయనున్న ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఆయన ప్రసంగంలో ప్రధానంగా ఈ అంశాల ప్రస్తావనే ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఆదివారం రోజు ‘మన్‌కీ బాత్‌’లో మోదీ మాట్లాడుతూ.. స్వదేశీ వస్తువులనే కొనాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.