గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లు : చైనా పరిశోధకులు

ABN , First Publish Date - 2021-06-13T17:19:34+05:30 IST

గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను గుర్తించినట్లు చైనా పరిశోధకులు

గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లు : చైనా పరిశోధకులు

న్యూఢిల్లీ : గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను గుర్తించినట్లు చైనా పరిశోధకులు ప్రకటించారు. రినోలోఫెస్ పుసిల్లుస్ అనే వైరస్ వీటిలో ఒకటని, ఇది ప్రస్తుత కోవిడ్-19 వైరస్‌కు జన్యుపరంగా దగ్గరగా ఉన్నవాటిలో రెండోదని తెలిపారు. షాండోంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను ‘సెల్’ జర్నల్‌లో ప్రచురించారు. 


యునన్‌లోని ఉష్ణ మండల ఉద్యానవనాలు (ట్రాపికల్ బొటానికల్ గార్డెన్), దాని పరిసరాల్లోని అడవుల్లో నివసించే గబ్బిలాల నుంచి నమూనాలను పరిశోధకులు సేకరించారు. గబ్బిలాల రెట్టల నమూనాలు 283, నోటి నమూనాలు 109, మూత్ర నమూనాలు 19 సేకరించి, అధ్యయనం నిర్వహించారు. 2019 మే నుంచి 2020 నవంబరు మధ్య కాలంలో వీటిని సేకరించారు. 


చైనాలోని యునన్ అనే ఓ చిన్న ప్రాంతంలో నిర్వహించిన ఈ పరిశోధనల్లో గబ్బిలాల్లో ఎన్ని కరోనా వైరస్‌లు ఉండగలవో వెల్లడిస్తున్నాయి. వీటిలో మానవులకు అదేవిధంగా పందులు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, కోళ్ళు, పశువులు వంటివాటికి వ్యాపించే సామర్థ్యంగల వైరస్‌లు ఎన్ని? అనేది తెలుస్తోంది. వేర్వేరు గబ్బిలాల జాతుల నుంచి 24 నోవల్ కరోనా వైరస్ జన్యువులను అసెంబుల్ చేశామని పరిశోధకులు తెలిపారు. వీటిలో SARS-CoV-2 వంటి కరోనా వైరస్‌లు నాలుగు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారికి కారణమైన SARS-CoV-2కు జన్యుపరంగా దాదాపు ఒకే విధంగా ఉన్న వైరస్‌ వీటిలో ఒకటని వివరించారు. ఇది, స్పైక్ ప్రొటీన్‌పై జన్యుపరమైన తేడాలు మినహా, SARS-CoV-2కు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. 


2020 జూన్‌లో థాయ్‌లాండ్ నుంచి సేకరించిన SARS-CoV-2 సంబంధిత వైరస్‌ను, ప్రస్తుత ఫలితాలను పరిశీలించినపుడు ఓ విషయం స్పష్టంగా వెల్లడవుతోందని పరిశోధకులు తెలిపారు. SARS-CoV-2కు సన్నిహిత సారూప్యతగల వైరస్‌లు గబ్బిలాల్లో కొనసాగుతున్నట్లు వెల్లడైందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్‌లు మరింత తీవ్రంగా ఉండవచ్చునన్నారు. 


Updated Date - 2021-06-13T17:19:34+05:30 IST