Oppo: రూ.4,389 కోట్ల కస్టమ్స్‌ సుంకం ఎగ్గొట్టిన ఒప్పో ఇండియా మొబైల్‌ సంస్థ

ABN , First Publish Date - 2022-07-14T03:20:12+05:30 IST

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో (Oppo) చిక్కుల్లో పడింది. ఇండియా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సోదాల్లో ఒప్పో కంపెనీ కస్టమ్స్ సుంకాన్ని..

Oppo: రూ.4,389 కోట్ల కస్టమ్స్‌ సుంకం ఎగ్గొట్టిన ఒప్పో ఇండియా మొబైల్‌ సంస్థ

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో (Oppo) చిక్కుల్లో పడింది. ఇండియా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సోదాల్లో ఒప్పో కంపెనీ కస్టమ్స్ సుంకాన్ని ఎగ్గొట్టినట్టు తేలింది. ఒప్పో సంస్థ దాదాపు రూ.4,390 కోట్ల సుంకాన్ని ఎగనామం పెట్టినట్లు ఈ సోదాల్లో తెలిసింది. దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో డీఆర్‌ఐ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. తప్పుడు సమాచారంతో రూ.2,981 కోట్ల సుంకం మినహాయింపు పొందినట్లు ఈ సోదాల్లో తెలిసింది. మరో రూ.1,408 కోట్ల ఎక్సైజ్‌ సుంకాన్ని ఎగవేసినట్లు డీఆర్‌ఐ గుర్తించింది. ఒప్పో ఇండియాకు పెనాల్టీలు విధించాలని రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రతిపాదన చేసింది. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తర్వాత నుంచి చైనా కంపెనీలకు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం సవాల్‌గా మారింది.



దేశ పౌరుల భద్రత దృష్ట్యా 300 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం అప్పట్లో నిషేధం కూడా విధించింది. చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివోకు సంబంధించిన 48 చోట్ల ఫెడరల్ ఫైనాన్షియల్ క్రైం ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గత వారం సోదాలు జరిపాయి. వివో ఇండియాకు సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, పన్నులను ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో నష్టాలను చూపించి వివో సంస్థ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. చైనాకు చెందిన మరో సంస్థ Xiaomi సంస్థపై కూడా ఈ తరహా ఆరోపణలే వచ్చాయి. అయితే Vivo, Xiaomi సంస్థలు అవకతవకలు జరిగాయని ఒప్పుకోకపోవడం గమనార్హం.

Updated Date - 2022-07-14T03:20:12+05:30 IST