ఎవరిపైనా నేను లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదు: పెంగ్‌ షూవాయి యూ టర్న్

ABN , First Publish Date - 2021-12-21T00:54:01+05:30 IST

చైనీస్ టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి యూటర్న్ తీసుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు తనను

ఎవరిపైనా నేను లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదు: పెంగ్‌ షూవాయి యూ టర్న్

బీజింగ్: చైనీస్ టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి యూటర్న్ తీసుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు తనను లైంగికవంగా వేధించారని ఆరోపించి కలకలం రేపి, ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిన పెంగ్.. తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని వ్యాఖ్యానించి అందరినీ నివ్వెరపరిచింది. తాను ఎవరిపైనా ఆరోపణలు చేయలేదన్న విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నానని, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని పేర్కొంది. 


పెంగ్ షువాయి తన వ్యాఖ్యల నుంచి యూటర్న్ తీసుకున్నప్పటికీ మహిళల టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) మాత్రం ఆందోళన వీడలేదు. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ మాజీ చాంపియన్ అయిన పెంగ్ గత నెలలో లైంగిక ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అమెరికా సహా టెన్నిస్ క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. 


 ‘‘నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. లైంగిక దాడికి సంబంధించి నేనెప్పుడూ ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదు, రాయలేదు’’ అని 35 ఏళ్ల పెంగ్ అని పేర్కొన్న ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. షాంఘైలోని ఓ క్రీడా కార్యక్రమంలో దానిని ఫోన్‌లో చిత్రీకరించినట్టుగా ఉంది. ‘‘ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను’’ అని నొక్కి చెప్పింది.


చైనాలో ట్విట్టర్‌లాంటి వీబోలో గత నెలలో పెంగ్ ఓ పోస్టు చేస్తూ.. కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత ఝంగ్ గావోలి (70) గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపించింది. ఆ తర్వాత కాసేపటికే ఆ పోస్టును డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ట్విట్టర్‌కెక్కి ప్రపంచవ్యాప్తంగా చేరిపోయింది. 


ఈ పోస్టుపై తాజాగా పెంగ్ మాట్లాడుతూ.. ‘‘అది తన వ్యక్తిగత విషయమ’’ని స్పష్టం చేసింది. అయితే, ఆ పోస్టును ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నాని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకుమించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. తాను స్వేచ్ఛగానే ఉన్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అయితే, పెంగ్ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేసిన డబ్ల్యూటీఏ ఆమె బాగోగులపై ఆందోళన వ్యక్తం చేసింది. పెంగ్ అదృశ్యమైన తర్వాత చైనాలోని అన్ని టోర్నమెంట్లను  డబ్ల్యూటీఏ రద్దు చేసింది. ఈ వీడియో తర్వాత చైనా అధికారిక మీడియా పెంగ్ ఫొటోలను ప్రచురించింది. 

Updated Date - 2021-12-21T00:54:01+05:30 IST