తూర్పు లడఖ్‌లో గుట్టుగా బలపడుతున్న చైనా!

ABN , First Publish Date - 2021-01-24T23:13:33+05:30 IST

చైనా నిజ స్వరూపం మరోసారి బయటపడింది. భారత్-చైనా మధ్య

తూర్పు లడఖ్‌లో గుట్టుగా బలపడుతున్న చైనా!

న్యూఢిల్లీ : చైనా నిజ స్వరూపం మరోసారి బయటపడింది. భారత్-చైనా మధ్య గత సెప్టెంబరులో కుదిరిన ఒప్పందాన్ని అతిక్రమించి తూర్పు లడఖ్‌లో చైనా సైన్యం బలపడుతోంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఫ్రిక్షన్ పాయింట్స్ వద్ద చైనా దళాలు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యంత శీతల వాతావరణంలో సైతం భారత సరిహద్దులకు చాలా దగ్గరకు చైనా దళాలు, ట్యాంకులు, సిబ్బంది రవాణా వాహనాలు వచ్చాయి. 


2020 మే నెల నుంచి భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు వివిధ స్థాయుల్లో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ విడత చర్చల అనంతరం గత ఏడాది సెప్టెంబరులో ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఇరు దేశాల నేతల మధ్య కుదిరిన అంగీకారాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించాయి. క్షేత్ర స్థాయిలో కమ్యూనికేషన్‌ను పటిష్టపరచుకోవాలని, అపార్థాలను, తప్పుడు నిర్ణయాలను నివారించుకోవాలని, సరిహద్దుల ముందు వరుసలోకి ఎక్కువ మంది సైనిక దళాలను పంపించడాన్ని నిలిపివేయాలని,  క్షేత్ర స్థాయిలో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడం మానుకోవాలని, పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే చర్యలకు పాల్పడకూడదని నిర్ణయించినట్లు ఈ ఉమ్మడి ప్రకటన పేర్కొంది. 


ఈ ఒప్పందాన్ని గుట్టుగా చైనా ఉల్లంఘిస్తోందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.  ఈ ఒప్పందం నిరుపయోగంగా మారిందని తెలిపాయి. అత్యున్నత స్థాయి సైనిక వర్గాలను ఉటంకిస్తూ, భారత్, చైనా సైనిక దళాలు నాలుగు నెలల క్రితం కన్నా ఇప్పుడు మరింత దగ్గరగా ఉన్నట్లు మీడియా పేర్కొంది. తట్టుకోలేనంత చలి తీవ్రత ఉన్నప్పటికీ, చైనా దళాలు, ట్యాంకులు, ఇతర వాహనాలు భారత సరిహద్దులకు దగ్గరగా వచ్చినట్లు తెలిపింది. ఉత్తర లడఖ్‌లోని డెప్సాంగ్ సమీపంలో కూడా క్రమంగా చైనా బలపడుతోందని తెలిపింది. దౌలత్ బేగ్ ఓల్డీలో కూడా కొత్తగా చైనా దళాలు కనిపిస్తున్నట్లు పేర్కొంది. 


తూర్పు లడఖ్‌లో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా మధ్య తొమ్మిదో విడత చర్చలు ఈ నెల 24న జరుగుతాయని అంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్‌లోని చూసుల్ సెక్టర్‌కు ఎదురుగా మోల్డోలో జరిగే ఈ చర్చల్లో  భారత్, చైనా మిలిటరీ కమాండర్లు పాల్గొంటారు. 


Updated Date - 2021-01-24T23:13:33+05:30 IST