గుజరాత్లో ఓ లేడీస్ హాస్టల్లో వార్డెన్ అమ్మాయిల పట్ల ఎలాంటి వికృత ప్రవర్తనను చూపించిందనే సంగతి పేపర్ల ద్వారా చాలా మందికి తెలిసింది. ఇప్పుడు అలాంటి వికృత వార్డెన్ మన హైదరాబాద్లో కూడా ఉన్నారంటూ విషయాన్ని బయట పెట్టింది సింగర్ చిన్మయి. అసలు విషయమేమంటే, దక్షిణాదిన మీ టూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటున్న సింగర్ చిన్మయి పలు రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక ఇబ్బందులను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్లో ఓ వార్డెన్ పైశాచికత్వంపై ఓ అమ్మాయి స్పందనను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిన్మయి.
అమ్మాయి మాటల్లో.. "నేను 2015లో పదవ తరగతి చదివేదాన్ని. చదువు రీత్యా హైదరాబాద్ హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. అక్కడ వార్డెన్ అమ్మాయిలను ఇబ్బంది పెట్టేది. పీరియడ్స్ ఉన్నాయని చెప్పిన నమ్మేది కాదు. బట్టలు విప్పి చూపించమనేది. ఓసారి నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. క్లాసులో ఉండగానే పీరియడ్స్ వచ్చాయి. అందుకని హాస్టల్కు వచ్చాను. కానీ వార్డెన్ నన్ను హాస్టల్లోకి అనుమతించలేదు. నాకు పీరియడ్స్ అని చెప్పినా వినలేదు. బట్టలు విప్పి చూపించమని చెప్పింది. ఆమె చెప్పినట్లు చేసిన తర్వాత, ఆమె నన్ను హాస్టల్లోకి అనుమతించింది".. అంటూ అమ్మాయి చెప్పిన విషయాన్ని ట్వీట్ చేసింది చిన్మయి. సమాజంలో ఇలాంటి చీడపురుగులున్నారంటూ చిన్మయి చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.