చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?: కేసీఆర్

ABN , First Publish Date - 2022-03-22T00:27:03+05:30 IST

చినజీయర్ స్వామికి సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక అంతోఇంతో నిజం లేకపోలేదని కొందరు చెబుతున్నారు.

చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?: కేసీఆర్

హైదరాబాద్: చినజీయర్ స్వామికి సీఎం కేసీఆర్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక అంతోఇంతో నిజం లేకపోలేదని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే ముచ్చింతల్‌లో నిర్వహించిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ముచ్చింతల్ కార్యక్రమానికి ముందు నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్‌గా రియాక్టయ్యారు. ‘‘చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదు. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌గా సమాధానమిచ్చారు. 


ముచ్చింతల్‌లో అట్టహానంగా ఏర్పాటు చేసిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు కేసీఆర్ పోలేదు. దీనికి రకరకాల కారణాలు హల్‌చల్ చేశాయి. కొంతకాలంగా కేంద్రంతో తలపడేందుకు కేసీఆర్ సిధ్దమవుతున్నారు. ఇప్పుడు కేసీఆర్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితి ఉందంటే ఢీ అంటే డీ అనే స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోదీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయి. 


రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ పోలేదు. అయినా ఆయనను రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని కేసీఆర్‌ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ శాంతికల్యాణానికి వెళ్లలేదు. 


ఇక యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన.. మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్నారు. ఆగమశాస్త్ర పండితులు నిర్ణయించిన సుముహూర్తం.. స్వస్తిశ్రీ చాంద్రనామ శ్రీప్లవనామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారం రోజున శ్రవణా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ ముహూర్తం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ చేపట్టారు. ఇక్కడే అసలు ముచ్చట ఉంది. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే. ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఉద్ఘాటన జరగుతోంది. ఇదే విషయంపై ఇటీవల పిలిస్తే యాదాద్రి పోతామని చినజీయర్ మీడియా ముఖంగా తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు చినజీయర్‌కు వెళ్లినట్లు కనబడలేదు. అందరూ ఆహ్వానితులే అంటున్నారనే తప్ప ప్రత్యేకంగా చినజీయర్‌ను ఆహ్వానించిన దాఖలాలు కనిపించడం లేదు.

Updated Date - 2022-03-22T00:27:03+05:30 IST