చినజీయర్‌ క్షమాపణ చెప్పాలి: పరిపూర్ణానంద

ABN , First Publish Date - 2022-03-18T00:25:40+05:30 IST

సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. చినజీయర్‌ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు.

చినజీయర్‌ క్షమాపణ చెప్పాలి: పరిపూర్ణానంద

హైదరాబాద్: సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. చినజీయర్‌ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. ఆదివాసి, దళిత సంఘాల నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి చినజీయర్‌పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌స్వామి వ్యాఖ్యలను స్వామి పరిపూర్ణానంద ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందు సమాజానికి చినజీయర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమ్మక్క-సారలమ్మను కోట్ల మంది ఆరాధిస్తున్నారని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ పేరుతో బ్యాంక్‌లు పెడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. చినజీయర్‌ వ్యాఖ్యలపై స్వామీజీలు స్పందించాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. 


సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్‌ గతంలో ఏ సందర్భంగా మాట్లాడారో తెలియదు గానీ కొన్నిరోజులుగా ఆ వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో తిరుగుతోంది. ఆ ‘‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ.. దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగొచ్చిన వారా? ఏమిటీ చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామ దేవత. చదువుకున్నవాళ్లు.. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. దట్‌ బికేమ్‌ ఏ బిజినెస్‌ నౌ (అది ఇప్పుడో వ్యాపారమైపోయింది)’’ అని  వీడియోలో చినజీయర్‌ అన్నారు. వీడియోలో ఆయన మాట్లాడిన మాటలపై ఆదివాసీ భక్తులు, వివిధ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. చినజీయర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-03-18T00:25:40+05:30 IST