ఇక్కడ పార్టీ పెడితే వెస్ట్..అక్కడైతేనే బెటర్: చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2021-01-24T21:20:16+05:30 IST

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదని చిన్నారెడ్డి అన్నారు.

ఇక్కడ పార్టీ పెడితే వెస్ట్..అక్కడైతేనే బెటర్: చిన్నారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి అన్నారు. ఆమె ఏపీలోనే పార్టీ పెట్టుకోవడం మేలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణలో గొప్ప అభిమానం ఉందన్నారు. తెలంగాణ రెండో ఉద్యమం 2వేల సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డితో విభేదించి మొదలుపెట్టామన్నారు. తాము మొదలుపెట్టిన ఏడాదికి టీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ ఉద్యమం ప్రారంభించారన్నారు. ఆ సమయంలో తెలంగాణ అభివృద్ధికి వైఎస్ హయాంలో అనేక పనులు చేపట్టామని చెప్పారు. సాగునీటి రంగం, జిల్లాకు ఒక యూనివర్శిటీ ఇవ్వడంలో వైఎస్ కృషి చేశారని చిన్నారెడ్డి చెప్పారు. అయినా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని.. ఆ విధంగా తెలంగాణ వచ్చిందన్నారు. 


అయితే వైఎస్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్లు తెలిసిందని చిన్నారెడ్డి అన్నారు. ఇక్కడ షర్మిల పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నది ప్రశ్నార్థకమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిల ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా కాదని, అందుకే ఆమె ఏపీలో పార్టీ పెడితే కొంతవరకు ఉపయోగం ఉండే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-24T21:20:16+05:30 IST