చిన్నారెడ్డి గెలుపు.. తెలంగాణ సమాజానికి మలుపు

ABN , First Publish Date - 2021-02-28T05:53:23+05:30 IST

చిన్నారెడ్డి గెలుపు.. తెలంగాణ సమాజానికి మలుపు

చిన్నారెడ్డి గెలుపు.. తెలంగాణ సమాజానికి మలుపు
మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి 


ఆంధ్రజ్యోతి,రంగారెడ్డి అర్బన్‌/చేవెళ్ల: చిన్నారెడ్డి గెలుపు.. తెలంగాణ సమాజానికి మలుపు అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు సన్నాహక సమావేశాన్ని చేవెళ్లలోని కేజీఆర్‌గార్డెన్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  చిన్నారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపిస్తే.. ఏ సమస్యనైనా గుర్తించి మాట్లాడగల సత్తా ఉన్న నాయకుడని  కొనియాడారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యరక్త సైనికుడిగా పనిచేయాలన్నారు. చిన్నారెడ్డి గెలుస్తే.. నీతి గెలిచినట్టే.. చిన్నారెడ్డి గెలుపు తెలంగాణ సమాజానికి అవసరమన్నారు. 14రోజులు కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు అభ్యర్థి గెలుపుకోసం శ్రమించాలని సూచించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్‌ మోసం చేస్తే... సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. చేవెళ్ల సర్పంచ్‌ శైలజాఆగిరెడ్డి ప్రసంగాన్ని కాంగ్రెస్‌ నేతలు అభినందించారు. చేవెళ్ల చెల్లెమ్మగా బిరుదునివ్వడంతో సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. 


హైదరాబాద్‌-బీజాపూర్‌ రోడ్డు విస్తరణకు కృషి

 తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే..హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణకు కృషి చేస్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో 84 గ్రామాలకు గుదిబండగా మారిన జీవో 111 సడలింపు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. చేవెళ్ల ప్రాంతాలకు రావాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును సిద్ధిపేటకు తరలించాడని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొపెసర్‌ నాగేశ్వర్‌ టీవీ డిబేట్లు, విశ్లేషణకే పరిమితమయ్యారని, అలాగే బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరేళ్లలో ఏనాడు ప్రజల్లో తిరగలేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ సొంతంగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నా కాంగ్రెస్‌ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.  


ప్రజల చూపు కాంగ్రెస్‌ వైవే : మాజీ ఎంపీ కొండా 

కేంద్ర రాష్ర్టాప్రభుత్వాల పనితీరుపై ప్రజలు విసుగు చెంది ప్రజలు, ఓటర్లు కాంగ్రెస్‌ పాలన కోసం ఎదురు చూస్తున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నారెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. చిన్నారెడ్డిని గెలిపిస్తే.. చేవెళ్ల ప్రాంతం అభివృద్ది చెందడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు మల్లురవి, పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి తదితరులుపాల్గొన్నారు.  అయితే నిజాలు నిర్భయంగా రాసే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికను కాంగ్రెస్‌ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నంప్రభాకర్‌, మల్లు రవి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వేదికపై ఆసక్తిగా తిలకించారు.

Updated Date - 2021-02-28T05:53:23+05:30 IST