పులిబిడ్డను... పోరాటం ఆపను : చిరాగ్ పాశ్వాన్

ABN , First Publish Date - 2021-06-16T22:35:35+05:30 IST

పోరాట పంథాకు సిద్ధమయ్యారు యువనేత చిరాగ్ పాశ్వాన్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎంత దూరం

పులిబిడ్డను... పోరాటం ఆపను : చిరాగ్ పాశ్వాన్

పాట్నా : పోరాట పంథాకు సిద్ధమయ్యారు యువనేత చిరాగ్ పాశ్వాన్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధపడిపోయారు. ఇది ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా ధ్వనిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చిరాగ్ ఘాటుగానే స్పందించారు. ‘‘కుటుంబ విషయాలు నాలుగ్గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ పోరాటం చాలా కాలం పాటు కొనసాగేలా కనిపిస్తోంది. చట్టం ప్రకారమే పోరాడతాం. కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదు. అందుకే బయటికి రాలేదు. ఒక్క మీడియా సమావేశంతో అంతా సర్దుబాటు కాదు. ఈ పోరాటం చాలా సుదీర్ఘమైంది’’ అని నిక్కచ్చిగా మాట్లాడారు చిరాగ్.


తనకు ఆరోగ్యం బాగా లేని సమయం చూసి, పార్టీలో ఇబ్బందులు సృష్టించడానికి ప్రణాళికలను రచించారని చిరాగ్ ఆరోపించారు. ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత పార్టీని చీల్చడానికి జేడీయూ తీవ్రంగా ప్రయత్నించిందని ఆరోపించారు. తమ పార్టీ రాజ్యాంగం ప్రకారం జేడీయూ అధ్యక్షుడే లోక్‌సభ నాయకుడ్ని నియమించవచ్చని అన్నారు. బాబాయ్ పశుపతినాథ్ పదవి అడిగితే, తాను ఇచ్చేవాడినని, ఎల్జేపీ నేతగా నియమించేవాడినని పేర్కొన్నారు. తాను రాంవిలాస్ పాశ్వాన్ కొడుకునని, పులి కొడుకునని, తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని చిరాగ్ ప్రకటించారు. 


తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణించిన కొన్ని రోజులకే ఎన్నికలు వచ్చాయని, వాటిని ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగా మారిందని గుర్తు చేసుకున్నారు. అయినా ప్రజలు తమ పార్టీని ఆదరించారని, 25 లక్షలకు పైగా ఓట్లు తమకు వచ్చాయని చిరాగ్ తెలిపారు. జేడీయూ కారణంగానే తాము ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాల్సి వచ్చిందని, జేడీయూ కారణంగానే తాము ఒంటరిగా బరిలోకి దిగామని వెల్లడించారు. సీఎం నితీశ్ విధానాలను తాను ఏనాటికీ ఒప్పుకోనని, ఎవరి ముందూ తలవంచుకోవద్దని తాను నిర్ణయించుకున్నానని, అందుకే ఒంటరిగా బరిలోకి దిగానని వెల్లడించారు. ఎన్నికల సమయంలోనూ కొందరు పోరాటం చేయలేదని, బాబాయ్ పశుపతినాథ్ ఎన్నికల సమయంలో ఎలాంటి భూమికా పోషించలేదని చిరాగ్ మండిపడ్డారు.


Updated Date - 2021-06-16T22:35:35+05:30 IST