పవన్, చరణ్‌తో నటించేందుకు నేను సిద్ధం

Published: Fri, 07 Feb 2020 12:26:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పవన్, చరణ్‌తో నటించేందుకు నేను సిద్ధం

మేం ముగ్గురం కలిస్తే 100 కోట్ల సినిమా అవుతుంది

కమర్షియల్‌కు అతీతంగా ప్లాన్ చేస్తేనే అది సాధ్యం

సీఎం కుర్చీ కోసమే రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజలిచ్చిందే మహాప్రసాదం

పవన్ ఎప్పుడూ నా అనుంగుడే.. రాజకీయాల్లోనూ అంతే

రాజకీయాల్లో జయాపజయాలకు ఎవరూ అతీతులు కారు

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో చిరంజీవి


సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా చిరంజీవి ఓ సమ్మోహన శక్తి. జయాపజయాలతో నిమిత్తం లేని స్టార్‌డమ్‌ ఆయన సొంతం. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌ స్థాయికి.. అక్కడి నుంచి ప్రజారాజ్యంతో పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చిన చిరంజీవితో 08-11-2009న ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కేలో మనసువిప్పి మాట్లాడారు. అభిమానుల కోరిక బలంగా ఉంటే సినిమాల్లోకి మళ్లీ రావచ్చేమో అని అభిప్రాయ పడ్డారు. ఆ వివరాలు ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం..


చిరంజీవిగా నామాంతరం ఎప్పుడు, ఎలా చెందారు?

తొలి సినిమా పునాదిరాళ్లు 1978లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో శివశంకర వరప్రసాద్‌ అనేపేరు స్ర్కీన్‌కి చాలా ఆడ్‌గా, పెద్దదిగాను ఉంటుంది. ఒకరోజు కలలో నేనెక్కడో గుడిలో ఉంటే బయట నుంచి నా స్నేహితుడు చిరంజీవీ.. రా అన్నాడు. ఎవర్ని పిలుస్తున్నావంటే నిన్నే అన్నాడు. అప్పటి దాకా చిరంజీవి అనే ఒక పేరు ఉంటుందని కూడా నాకు తెలీదు. ఆ విషయం అమ్మకి చెప్పాను. ఆంజనేయస్వామికి మరో పేరు చిరంజీవి అని, స్ర్కీన్‌ నేమ్‌గా ఆ పేరును ఎందుకు ఆలోచించకూడదని చెప్పింది. నేను పూజించే ఆరాధ్యదైవం ఆంజనేయస్వామే చెప్పారా అనిపించింది. చాలా దైవికంగా కలలో స్ఫురించిన పేరిది. అమ్మ ఆమోదించింది. తర్వాత పునాదిరాళ్లు టైంలో ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే నీ పేరు.. అని అడిగితే చిరంజీవి అనేశాను. అప్పట్నుంచి అదే స్థిరపడింది.


సినిమారంగం బాగుందా? రాజకీయ జీవితం బాగుందా?

నా మనసు నూరు శాతం కళారంగం చుట్టే ఉంది. దాని మీద ఉండే ఆపేక్ష, అందులో రాణించాలనే కుతూహలం వల్ల దా న్నుంచి బయటపడాలంటే చిన్న విషయం కాదు. కానీ, తర్వాత్తర్వాత ప్రజాసేవలో ఉండే సంతృప్తి.. బ్లడ్‌బ్యాంక్‌ పెట్టాక ప్రాణాలు కాపాడుకున్న వారు, వారి బంధువులు కన్నీళ్లతో నన్ను ప ట్టుకుని మాట్లాడుతుంటే.. ఆ రోజు ఎంత హాయిగా పడుకునే వా ణ్నంటే.. సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్లయినప్పుడు కూ డా ఓకే అనే చిన్న తృప్తి ఉండేది. కానీ దీంతో ఏ మాత్రం పోలికే లేదు. రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరారు. ఇందు లో ఇమిడేందుకు ప్రయత్నిస్తున్నాను.


చరణ్‌పై మీకు పుత్రవాత్సల్యం ఎలా కలిగింది?

ఇందాక సినిమాలు మిస్సవట్లేదా అని అడిగారే.. చరణ్‌ రాకపోయి ఉంటే గనక కచ్చితంగా మిస్సయిన బాధ రోజురోజుకూ పెరుగుతూ వచ్చేదేమో. అది ‘బరీ’ అయిపోవడానికి చరణ్‌ హి ట్టవడం కూడా ఓ కారణమేమో. ఆ గ్యాప్‌ను చరణ్‌ ఆషామాషీగా కూడా కాదు.. పూర్తిస్థాయిలో భర్తీ చేశాడు కాబట్టి నాకు సినిమాల మీద మక్కువ పెద్దగా అనిపించలేదు. సినిమా విషయానికొస్తే ఎంత లేదన్నా ఇంకా మనలోని కళాకారుడు ఇంకా జీవించే ఉన్నాడు. అలా ఎక్కడో కొంచెం.. ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో ఇలాంటి క్యారెక్టర్‌ నాకెందుకు తగల్లేదని మాత్రం అనిపించింది. (మధ్యలో ఆర్కే జోక్యం చేసుకుని.. కొంచెం అసూయ అన్నారు) వంద మందిని సంహరించే సీన్‌లో నన్ను నేను ఊహించుకున్నపుడు.. అనుకోకుండా నా కొడుకు స్థానంలో నేనే ఉన్నాననిపించింది. నేను ఉంటే ఎలా చేస్తాననుకునే ఊ హకు దీటుగా వాడు చేశాడు. ఆ రకంగా కూడా తృప్తిపరిచాడు. మగధీరలో కాసేపు మమ్మల్నిద్దరినీ తెరమీద చూసినపుడు, మొత్తం సినిమా చేస్తే బాగుంటుందని సురేఖ కూడా అన్నది. ఇంట్లో సినిమా అలవాటైన మాకే అలా ఉంటే, మమ్మల్ని తెరమీద చూసి అభిమానించేవాళ్లకు ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ల కోరిక బలంగా ఉంటే బహుశా జరగచ్చు. తథాస్తు దేవతలు కూడా అలాగే అంటే శిరసావహిస్తాను.


పవన్, చరణ్‌తో నటించేందుకు నేను సిద్ధం

ఎన్టీఆర్‌లా మీరూ సినిమాల్లో నటించే అవకాశం ఉందా?

ఎక్కడకు వెళ్లినా మా సినిమా పెద్దలను కలిస్తే ప్రతి ఒక్కరూ నన్ను మిస్సవుతున్నామంటున్నారు. ప్రజల్లోకి వెళ్లినా మీ సినిమాలు లేని అసంతృప్తి మాలో ఉందని చెబుతున్నారు. నేను ఈ రంగంలో పూర్తిగా ఇన్వాల్వ్‌ అయిపోయాను. అటువైపు ఆలోచనే రావట్లేదు. ప్రజారాజ్యంలో పూర్తిగా బాధ్యత వహిస్తే తప్ప రాణించలేననే భావనతో ఇక్కడే ఉన్నాను. ఇది గాడిలో ప డిన తర్వాత, సమయం చిక్కితే, సామాజికంగా నాకు సరిపో యే కథ, పాత్ర దొరికితే.. నటిస్తానేమో!


30 ఏళ్ల కెరీర్‌లో మీ హయాంలో మీరే గొప్ప రికార్డులు క్రియేట్‌ చేశారు. వాటిని దూదిపింజల్లా తేల్చి అవతల పారేశాడు.

అవునండీ.. ఎందుకు తేల్చడండీ.. మా ఫాదరేం చిరంజీవి కాదు. వాడి బాబు చిరంజీవి. అందుకనే నన్ను ప్లాట్‌ఫాం చేసుకుని ఎదిగాడు కాబట్టి నాకన్నా ఎత్తులో కనపడతాడు. అదేస్థాయిలో రాణించాడు, మెప్పించాడు, సాధించాడు.


చిరంజీవి కొడుకు అనేది ఇంట్రడక్షన్‌కే పనికొస్తుంది కదా..

మీరా మాట అన్నారు. తొలి సినిమా ఎలా చేస్తాడో అనుకున్నాం. ప్రజలు కూడా ఆమోదముద్ర వేశారు. ఆ రోజునే నాకు గర్వం అనిపించింది. ఇపుడు పూర్తి స్థాయిలో తండ్రిగా గర్వించే పెర్ఫార్మర్‌గా ఉండటం, అందరి ఆశీస్సులు పొందడం చాలా గ్రేట్‌ ఫీలింగ్‌. కానీ, కళాకారుడిగా కొద్ది బాధ. 30 ఏళ్ల కెరీర్‌లో నాకు రాలేదు.. ఈ మూడేళ్ల కెరీర్‌లో, రెండో సినిమాకే అలాంటి కారెక్టర్‌ రావడం అనేది ఎక్కడో కొంచెం... అనిపించింది.


ప్రేక్షకుల విషయానికొస్తే ఇంద్ర, మగధీర కలిసి ఇంకేదో చరిత్ర సృష్టించాలని వారు కోరుకోవచ్చు కదా..

ఇది వాళ్ల కోరిక కంటే ముందు చరణ్‌ కోరిక. అమితాబ్‌, అభిషేక్‌లను చూసి అడిగాడు. (ఆర్కే జోక్యం చేసుకుని.. తెర మీద తేల్చుకుందాం అంటున్నాడా?) అలాగే ఉంటుంది. అక్కడికొచ్చే సరికి యాక్షన్‌ అనగానే ఎవరిది వారిదే. దానికంటే ముందు.. తండ్రి ఫాంలో ఉండగా తాను హీరోగా ఎస్టాబ్లిష్‌ అయ్యి, యూ త్‌ ఐకాన్‌గా వస్తున్న సందర్భంలో నాతో కలిసి డాన్స్‌ చేయాలన్నది చిరకాల వాంఛ అయి ఉంటుంది. సరిగ్గా ఆ సమయానికే నేనిక్కడకి వచ్చాను. దాంతో తను ఎక్కువ మిస్సవుతున్నాడు. మమ్మల్ని తెర మీద చూసి అభిమానించే వాళ్లకు ఆ కోరిక ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ల కోరిక బలంగా ఉంటే బహుశా జరగచ్చు. ఇద్దరి కాంబినేషన్‌లో వస్తే అందరికీ ఆనందమే కదా.


అప్పట్లో పరిశ్రమ కూడా కొన్ని సామాజికవర్గాల అధీనంలో ఉం డేది. ఎప్పుడైనా ఈ రంగంలోకి ఎందుకొచ్చానా అనిపించిందా?

ఒక్కసారి కూడా అనిపించలేదు. పైకి రావడం, రాకపోవ డం.. ఇవన్నీ మన చేతుల్లో, మన కష్టంలో, మన ఆసక్తిలో ఉ న్నాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని కష్టపడి పైకి వెళ్లకపోతే అది మన చేతగానితనం తప్ప ఏమీ కాదు. దీన్ని చుట్టూ ఉండేవారిమీద నెట్టడం ఒప్పుకోను.


స్వయంకృషినే నమ్ముకున్నారా? గాడ్‌ఫాదర్‌ ఉన్నారా? అల్లు రామలింగయ్య ఓ దశలో మీకు పుష్‌ ఇచ్చారంటారు. నిజమేనా?

పుష్‌ ఇవ్వలేదు.. ఆయన ఆశీస్సులిచ్చారు. గాడ్‌ఫాదర్‌ అని చెప్పాల్సి వస్తే, ఒక వ్యక్తిగా ఎవరూ లేరు. చెప్పాలంటే.. ప్రేక్షకు లే. ఇది నేను మనసా వాచా చెబుతున్నాను. ఆయన నన్ను కే వలం ఇంటి అల్లుడిగా చూశారు తప్ప సినిమాల గురించి ఎ ప్పుడూ చూడలేదు. సినిమాలు పెరిగాక పట్టుమని పది రో జులు కూడా ఎప్పుడూ ఖాళీగా లేను. పెళ్లికి కూడా డేట్‌ దొరకనంత పరిస్థితి. అతి కష్టమ్మీద 3, 4 రోజులు వీలు చేసుకోవలసి వచ్చింది. అంత బిజీగా ఉన్నాను. దానికి కారణం వ్యక్తిగతంగా ను, ఆర్టిస్ట్‌గాను అన్ని రకాలుగా బాధ్యత నిర్వర్తించడమే. కళాకారులను ఎవరూ పనిగట్టుకుని అణగదొక్కరు.


పవన్, చరణ్‌తో నటించేందుకు నేను సిద్ధం

మీ కెరీర్‌లో మిమ్మల్ని బాగా ఆకర్షించిన హీరోయిన్‌?

ఇందులో రెండు రకాలు.. సినిమాల్లో చేస్తున్నప్పుడు ఉత్తేజం, ఉత్సాహం ఇస్తూ దీటుగా నటించేవారిని ఇష్టపడతాను. ఆ రకంగా చూస్తే రాధిక.. ఆమెతో చేసేటప్పుడు పోటాపోటీగా ఉండేది. సుహాసిని.. హోమ్లీగా, ఆ నడవడిక, ఇంట్లో మనిషిలా అనిపించేది. ప్రొఫెషనలిజమ్‌ విషయానికి వస్తే సౌందర్య ఇష్టం. మంచి క్రమశిక్షణ, పక్కా ప్రొఫెషనలిస్టు.


అందం విషయానికొస్తే...

నా దృష్టిలో మామూలుగా అయితే ప్రతి ఒక్క మోడల్‌ అందగత్తే... కానీ, ప్రవర్తన, నడవడిక అనేవి అవి అసలు అందం... చాలా మంది అడుగుతుంటారు. వర్షం పాటల్లో మీకేమీ అనిపించదా అని.. ఎందుకనిపించదు... టేక్‌ ఓకే అవుతుందా లేదా? అనిపిస్తుంది.. ఎందుకంటే ఆ వర్షంలో తడిసి చలికి వణికిపోతూంటే త్వరగా షాట్‌ ఓకే అయితే వెంటనే వెళ్లి శాలువా కప్పుకొందామనుకునే పరిస్థితి...


సురేఖతో పెళ్లి ప్రస్తావన ఎటు నుంచి వచ్చింది?

నావైపు నుంచి ప్రస్తావన రాలేదు. రామలింగయ్యగారి స్నేహితులు, నాతో సినిమా తీసిన జ యకృష్ణ నన్ను చూసి.. భవిష్యత్తులో ఎదుగుతానని భావించి ఆయనే ఒత్తిడి చేశారు. కావాలంటే అమ్మానాన్నలను అడగండి అన్నాను. వీళ్లంతా కలిసి నా పసి మనసును పాడుచేసి పెళ్లి వైపు మళ్లించారు. అమ్మా నాన్నా కూడా పెళ్లయితే కుదురుగా ఉంటావన్నారు. ఈలోపు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు.


పెళ్లి చూపులకెళ్లినప్పుడు మాట్లాడుకున్నారా?

మొక్కుబడిగా, విడిగా రెండే రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం. ఒక సమయంలో రైటర్‌ ఉండి డైలాగులు రాసిస్తే బాగుండనిపించింది.


అల్లు గారి కుమార్తెను చేసుకోవడం మీరు గొప్పా? మిమ్మల్ని చేసుకోవడం వాళ్ల అదృష్టమా?

నాది అంత గర్వించే మనస్తత్వం కాదు.. ఆ స్థాయీ లేదు అప్పట్లో...


అతి ప్రేమ వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?

ప్రేమలో మునిగి తేలుతూ... గొడవలు లేవనడం అతిశయోక్తి. అలాంటివి వెంటనే మరిచిపోవడానికే ప్రయత్నిస్తాను కా బట్టి గుర్తుకు రావడం లేదు. స్వీట్‌ మెమొరీస్‌ను పదిలపరచుకుంటాం. కోపతాపాలు, అరచుకోవడాలు ఉన్నా గుర్తుపెట్టు కోం.. ఏం లేవా అంటే ఉన్నాయి. కానీ గుర్తుకు రావడం లేదు.


కాలేజీ రోజుల్లోకి ఎప్పుడైనా గొడవల్లో పాల్గొన్నారా?

నేనెక్కడైనా పట్టుమని ఒకట్రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం లేను. దీంతో గ్రూపులు, శత్రువులు లాంటివి లేవు. వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. డ్రామాల్లో నటించేవాడిని దీంతో అందరి నుంచి ప్రశంసలు వచ్చేవి. కాలేజీ పుస్తకంలో బెస్ట్‌ యాక్టర్‌ ఆఫ్‌ కాలేజ్‌ అని పడినప్పుడు చాలా గర్వంగా ఉండేది.


పవన్, చరణ్‌తో నటించేందుకు నేను సిద్ధం

మీరు యావరేజ్‌ స్టూడెంటా? మెరిటోరియసా?

జస్ట్‌ యావరేజ్‌. ఎంతో కష్టపడినా అలా పాస్‌ మార్కులు వచ్చేవంతే. కాకపోతే మిగతా యాక్టివిటీస్‌లో చాలా ముందుండే వాడిని. ముఖ్యంగా ఎన్సీసీలో చాలా టాప్‌ ర్యాంకుకు వెళ్లాను. ఢిల్లీలో ఇందిరాగాంధీ ముందు పరేడ్‌లో పాల్గొన్నాను.


కాలేజీ రోజుల్లో సాధారణంగా అందంగా కనపడాలని...

ఏంటి లవ్‌ ఎఫైర్‌ గురించి అడుగుతున్నారా.. ఎందుకంటే మీ ముఖంలో ఆ రొమాంటిక్‌ ఫీల్‌ కనపడుతోంది.


ఫస్ట్‌ టైమ్‌ ఎవరినైనా అమ్మాయిని చూశాక కాసేపు లవ్‌ చేయాలనిపించిందా?

అయితే, అది లవ్‌ కాదు. ఆకర్షణ అని చెప్పుకోవాలి. బైపీసీ చదువుతున్నప్పుడు.. బోటనీ ప్రాక్టికల్స్‌లో శివశంకర వరప్రసాద్‌ ద బెస్ట్‌ అనేవారు. అయితే అంత శ్రద్ధ ఆ సబ్జెక్టు మీద కంటే దానిని బోధించే ట్యూటర్‌ మీద ఒక రకమైన క్లోజ్‌ ఫీలింగ్‌ ఉండేది. దీంతో ఆవిడ చెప్పే బోటనీలో నాకు మంచి మార్కులు వచ్చేవి.


ఆ తర్వాత ఎవరికైనా లవ్‌ లెటర్‌ రాశారా?

అస్సలు లేదు. నా కల్చరల్‌ యాక్టివిటీస్‌ మీద దృష్టి పెట్టేవాడిని. ఢిల్లీలో ఎన్సీసీ పరేడ్‌ అయిపోయాక నాకున్న డాన్స్‌ టాలెంట్‌ను ప్రదర్శించేవాడిని. చూసేందుకు మిగతా క్యాంపుల అమ్మాయిలు వచ్చేవారు. వాళ్లలో ఒకరిద్దరిని చూసినప్పుడు ముచ్చటపడ్డాను. అయితే అది మూణ్ణాళ్ల ముచ్చటే.


సినిమాల్లో ఏ హీరోయిన్‌ విషయంలోనైనా...

అంతలా నన్నాకర్షించే వారు మొదటి రెండు సంవత్సరాల్లో తారసపడాలి. అలా జరగలేదు. ఎందుకంటే అంతా సీనియర్స్‌తో చేస్తుండేవాడిని. అసలా దృష్టే ఉండేది కాదు.


ఇంద్ర,మగధీర, జల్సా పురుషుడు కాంబినేషన్‌ ఆశించవచ్చా?

ఇదంతా ప్రాక్టికల్‌గా వర్కవుట్‌ కాదు. మా ముగ్గురు మీద అంటే 100 కోట్ల సినిమా అవ్వాలి. కమర్షియల్‌కు అతీతంగా వెళ్లి ప్లాన్‌ చేస్తే ప్రేక్షకులకు ఈ కాంబినేషన్‌లో సినిమా అందించవ చ్చు. నేను సిద్ధమే కానీ, ఇది జరుగుతుందని అనుకోవడం లేదు.


పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల నుంచి విరమించుకున్నట్టేనా?

తను కచ్చితంగా నాకు ఎప్పుడూ అనుంగుడిగా, బాధ్యతతో ఉంటాడు. రాజకీయాల్లో కూడా నాతో అలాగే ఉంటాడు. పవన్‌ గురించి చెప్పేటప్పుడు చరణ్‌ గురించి మాట్లాడేటప్పుడు కనిపించే ఆప్యాయత, అభిమానం కనిపిస్తాయి. నేను సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు వాడు చాలా చిన్నవాడు. మా ఇంట్లో మొదటి బిడ్డలా అనిపిస్తుంది. సినిమాల్లోకి వచ్చాక మంచి చదువుల కోసం మద్రాసుకు తీసుకొచ్చి నా దగ్గరే ఉంచాను. లవ్‌ ఇన్‌ సింగపూర్‌ సినిమా కోసం తొలిసారి విదేశాలకు వెళ్లినప్పుడు కీ బొమ్మలు తెచ్చాను. వాటిని కల్యాణ్‌కు ఇచ్చాను. ఇప్పటికీ ఆ బొమ్మలు వాడి దగ్గర ఉన్నాయి. ఏవైనా ముట్టుకో గానీ ఆ బొమ్మలు ముట్టుకోవద్దని వాడి అబ్బాయికి కూడా ఈ మధ్య చెప్పాడు. ఇద్దరిదీ ఓ రకంగా తండ్రీకొడుకుల అనుబంధం.


పవన్, చరణ్‌తో నటించేందుకు నేను సిద్ధం

ఫలితాల ట్రెండ్స్‌ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్‌?

పాలకొల్లులో నేను లేను అన్నప్పుడు ఓహో అని చాలా ఈజీగా తీసుకున్నాను. తిరుపతిలో ముందంజ.. అనగానే ఓకే అనుకున్నాను..నేను పాలకొల్లుకే సొంతం కాదు. అందరివాడిని. రాష్ట్రమంతా నన్ను ఆదరిస్తోంది. అందరి ఆశీస్సులు కావాలి.


మొన్నటి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాక కూడా చాలా కూల్‌గా మాట్లాడారు... మీరు మానసికంగా ముందే సిద్ధమయ్యారా?

సిద్ధం కాలేదు. నేను మాత్రం నార్మల్‌గానే ఉన్నానని అనుకున్నాను. చిత్తశుద్ధి, నిజాయితీతో వారికి సేవ చేయాలనే నేను వచ్చాను. వారు నన్ను పూర్తి స్థాయిలో ఆమోదించలేదనుకున్నాను. అందుకే నిరుత్సాహపడలేదు. ఇప్పుడు కాకపోతే మరోసారి ఇస్తారు అనుకున్నా.


పార్టీ అధినేతల కెరీర్‌లో ఓటమి అనేది చరిత్రలో ఓ రిమార్క్‌లా ఉంటుంది.

జయాపజాయాలకు ఎవరూ అతీతులు మాత్రం కారు. కావాలని ఎవరూ అపజయాన్ని కొని తెచ్చుకునేందుకు ప్రయత్నించరు. ఓటమి వల్ల నా ప్రతిష్ట పడిపోయిందని నేననుకోలేదు. సినిమాల్లో ఉన్నప్పుడు జయాపజయాలు చూశాను కాబట్టి అది నాకు అలవాటైపోయి ఉంటుంది.


పార్టీ ప్రజాభిమానం పొందడంలో విఫలం కావడానికి కారణాలను అంచనా వేశారా?

నన్ను మెగాస్టార్‌ నుంచి పొలిటికల్‌ స్టార్‌గా ఆమోదించడంలో ప్రజలు ఇంకా సంధి కాలంలో ఉన్నారని నాకనిపిస్తోంది. ఎన్నో కారణాల్లో ఇది ఒకటి. నన్ను రాజకీయ నేతగా తప్పకుండా ఆమోదిస్తారు. భవిష్యత్తులో ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


రాజకీయాల్లో అరవింద్‌, మీ కాంబినేషన్‌ ఎందుకు విజయం కాలేదు.

రాజకీయాల్లో ఇది ప్రారంభమే. సినిమాలతో దీనిని పోల్చకూడదు. అక్కడా అపజయాలున్నాయి. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాం. ఈరోజు ఈస్థాయికి చేరుకున్నాం. అలాగే రాజకీయాల్లో కూడా ఒక రోజు ది బెస్ట్‌ కాంబినేషన్‌ అనిపించుకుంటాం.


పొత్తును కాంగ్రెస్‌లో ఒక వర్గం సీరియస్‌గా ప్రతిఘటించింది. దానికి ప్రధాన కారణం... పొత్తు తర్వాత విలీనం.. అన్న వార్తలు వచ్చాయి. తద్వారా కాంగ్రెస్‌లో చిరంజీవి క్రౌడ్‌పుల్లర్‌ అవుతారు. కాంగ్రెస్‌ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనే ఉద్దేశంతోనే దానిని వ్యతిరేకించారని మీరు భావించారా?

అంత దూరం ఆలోచించలేదు. ఒంటరిగానే పోటీ చేయాలని మడిగట్టుకుని నేనేనాడు కూర్చోలేదు. ప్రజలకు సేవ చేసేందుకు భావసారూప్యం ఉండేవారితో కలిసి వెళ్లేందుకు ఎప్పుడూ సిద్ధమే. మా పార్టీవారితో సమావేశమైతే అందరూ బాగుంటుందనడం... ఈలోగా ఆ పార్టీలో వచ్చిన పరిణామాలతో మేం కూడా విరమించుకోవలసి వచ్చింది.


ముఖ్యమంత్రి పదవి మీకు ఎంత దూరంలో ఉందనుకుంటున్నారు?

ఆ పదవే లక్ష్యంగా చేసుకొని నేను రాజకీయాల్లోకి రాలేదు. ఆ కోరిక కూడా లేదు. ప్రజలిచ్చిందే మహాప్రసాదం అనుకుంటాను. నేను అనుభవించిన స్థానం, అభిమానం ఏవీ కూడా ముఖ్యమంత్రి పదవి కంటే తీసిపోనివి. ఆ పదవి నాకు తృణప్రాయమే.


చివరిగా కాంగ్రెస్‌ ఆశిస్తున్నట్టుగా పీఆర్పీ విలీనం అయ్యే అవకాశం ఉందా?

ఆ అవకాశం లేదు. స్నేహపూర్వకంగా కలిసి పని చేసేందుకు అయితే సిద్ధమే గానీ విలీనం అనే ప్రసక్తే లేదు. ఈ పార్టీ నా ఒక్కడిదే కాదు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రాజకీయ నేతలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.