సంక్షోభంలో సినీ పరిశ్రమ..

Sep 20 2021 @ 02:31AM

సర్కార్లే సహకరించాలి

పరిశ్రమలో సక్సెస్‌ రేటు 10-15 శాతమే

‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే 

సామెత చిత్రసీమకు సరిగ్గా వర్తిస్తుంది

కరోనా సమయంలో ఇది స్పష్టమైంది

నిర్మాణవ్యయం పెరిగింది.. రాబడి లేదు

కారణమేంటని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ అడుగుతున్నా

ఆశ కాదు.. అవసరానికి అడుగుతున్నాం

స్పందించి జీవో ఇస్తే ధన్యులం: చిరంజీవి

(సినిమా డెస్క్‌-ఆంధ్రజ్యోతి): ‘‘చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ 10-15 శాతం మాత్రమే సక్సెస్‌ రేటు ఉంది. ‘20 శాతం సక్సెస్‌ రేటుకే చిత్రపరిశ్రమ పచ్చగా ఉంటుంది’ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే తప్ప డొక్కాడని చాలామంది కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే ఇండస్ట్రీ. అంతేతప్ప ఒక ఐదారుమంది నిర్మాతలో, హీరోలో, దర్శకులో బాగున్నారు కాబట్టి సినిమా పరిశ్రమ అంతా పచ్చగా ఉందని అనుకోకూడదు’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. నాగచైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం అన్‌ప్లగ్డ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో, ఆ తర్వాత.. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయన మాట్లాడారు. ‘‘మెరిసేదంతా బంగారం కాదు’ అనే సామెత చిత్ర పరిశ్రమకు సరిగ్గా వర్తిస్తుంది. ఈ మధ్య కరోనా సమయంలో ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసింది. షూటింగ్స్‌ నాలుగైదు నెలలు నిలిచిపోయేసరికి కార్మికులు పడిన ఇబ్బందులు మేం కళ్లారా చూశాం.


హీరోలు, సినీరంగ పెద్దలతో కలసి నిధి సేకరణ చేసి నిత్యావసర వస్తువులు నాలుగు నెలల పాటు అందించాం. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, షూటింగ్స్‌ లేకపోతే కార్మికులు పడిన ఇబ్బందులు తెలియాలని.  చిత్ర పరిశ్రమ అనేది నిత్యం పచ్చగా ఉండదు. వరదలు, భూకంపాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు ముందుగా స్పందించేది సాయం అందించేది మా చిత్ర పరిశ్రమే. ఈ విషయాన్ని నేను గర్వంగా చెపుతున్నాను. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయింది. సినిమా నిర్మాణ వ్యయం పెరిగింది. కానీ, అందుకు తగ్గట్టు ఆదాయం రాకపోవడానికి కారణాలు ఏమిటని ‘లవ్‌స్టోరి’ వేదికగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలనూ వినమ్రంగా అడుగుతున్నాను. కొంచెం సానుకూలంగా స్పందించి, మా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాం.’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘కూరగాయలు కూడా చూసి, బాగుంటేనే కొంటాం. కానీ ముందు టిక్కెట్‌ కొని తర్వాత సినిమా చూస్తాం. అలా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం. మేం కూడా ప్రేక్షకులను నిరాశపరచకూడదని మా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల నిర్మాణ వ్యయం పెరగొచ్చు. కొన్నిసార్లు మా పొరపాటు వల్ల ఫెయిల్యూర్స్‌ ఇవ్వొచ్చు. కానీ అందులో మోసం లేదు. దగా లేదు. అంచనాలను అందుకోలేకపోవడం మా తప్పిదం. ప్రేక్షకులను అలరించాలని కోరుకునే మా సాధకబాధకాలపై మీరు కొంచెం దృష్టి సారించి, ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించాలి. మేం ఆశతో అడగడం లేదు. అవసరానికి అడుగుతున్నాం. మీరు ఒప్పుకోవాలని కోరుకుంటున్నాం. లేకపోతే సినిమాలు చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతాం’’ అని చిరంజీవి ఆవేదన వెలిబుచ్చారు. 


‘‘‘ఆచార్య’ పూర్తయింది కానీ.. 

‘‘‘ఆచార్య’ పూర్తయింది. కానీ ఎప్పుడు, ఎలా రిలీజ్‌ చేయాలి. ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్‌ చేయగలమా? చేస్తే ఆదాయం వస్తుందా? అనే పరిస్థితి. అసలు ప్రేక్షకులు వస్తారా రారా అనే పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. జనాలు వస్తారు. కానీ ఆదాయం అంతకంతా వస్తుందా అనేది మనం ఆలోచించాలి.  ఆ ధైర్యం, వెసులుబాటు ప్రభుత్వాలు మనకు ఇవ్వాలి. మా కోరికను మీకు విన్నవించుకున్నాం. సానుకూలంగా స్పందించి వీలయినంత త్వరలో జీవో ఇవ్వగలిగితే ధన్యులం’’ అని చిరంజీవి అన్నారు. 

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.