చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు: పేర్ని నాని

ABN , First Publish Date - 2022-01-21T23:34:13+05:30 IST

చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు: పేర్ని నాని

చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావు: పేర్ని నాని

అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య అగాధాన్ని పెంచింది. సినీ నిర్మాతలతో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించుకున్నారు. చిరంజీవి, జగన్ భేటీతో టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరూ అనుకున్నారు. జగన్‌తో సమావేశం తర్వాత చిరంజీవి కూడా అందరికీ శుభవార్త తెలిపారు. సినీ రంగ సమస్యలపై జగన్ సానుకూల రీతిలో స్పందించారని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని చిరంజీవి తెలిపారు. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు సమగ్రంగా వివరించానని చెప్పారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చిందన్నారు. సినీ పరిశ్రమవారు ఎవరూ అభద్రతా భావానికి లోనుకావద్దని, సంయమనంతో వ్యవహరించాలని, విమర్శలు చేయవద్దని కోరారు.  


టికెట్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సినీ పెద్దలు గంపెడాశతో ఉన్నారు. అయితే మంత్రి పేర్నినాని అందరి ఆశలపై నీళ్లు చల్లారు. చిరంజీవితో జరిగినవి సంప్రదింపులు కావని, కుశలప్రశ్నలు మాత్రమేనని తేల్చేచారు. వారిద్దరి మధ్య మాట్లాడుకున్నవన్నీ తమకు చెప్పలేదని తెలిపారు. శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు గుడివాడకు ఎందుకు వెళ్లారు..? అని ప్రశ్నించారు. కేసినో వ్యవహారంపై నిజనిర్ధారణ చేయడానికి వారెవ్వరని నిలదీశారు. గుడివాడలో నిజంగా తప్పు జరిగితే సీఎం జగన్ తప్పక చర్యలు తీసుకుంటారని తెలిపారు. తప్పుచేస్తే ప్రభుత్వం జడ్జీలను కూడా వదలదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు పెట్టిన సినిమా వాళ్లు తప్పుచేసినా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్నినాని ప్రకటించారు.

Updated Date - 2022-01-21T23:34:13+05:30 IST